వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల పనితీరు అభినందనీయం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల పనితీరు అభినందనీయమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో కరోనా నివారణకు అనేక చర్యలు తీసుకున్నారన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ దూరదృష్టితో తీసుకువచ్చిన వలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నాయన్నారు. గ్రామ/ వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులకు చేరవేస్తున్నారన్నారు. విదేశాల నుంచి వచ్చినా, కరోనా లక్షణాలున్నా పది నిమిషాల్లోనే గుర్తించి సమాచారం అందిస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి పెద్దిరెడ్డి అభినందనలు తెలిపారు.

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌ లాక్‌డౌన్‌ ప్రకటించారని, ప్రజారవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేశారన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు. బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిట్మాల్‌ వాడాలని ప్రపంచ వ్యాప్తంగా అందరూ చెబుతున్నారు. కానీ, టీడీపీ నేతలు ఆ రోజున ఎద్దేవా చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలని స్వీయ నిర్బంధంలో ఉన్నానని పెద్దిరెడ్డి చెప్పారు. 

Back to Top