తాడేపల్లి: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు రావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఏపీకి జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఆ ప్యాకేజీని అమలు చేస్తుందా.. లేదా అన్నది చూడాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు రావాలన్నారు. రుణాలపై మారటోరియం, ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆ దిశగా ఆలోచన చేస్తే పారిశ్రామిక రంగాన్ని ఆదుకోగలుగుతామన్నారు. ఏపీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 97 వేలకు పైగా ఉన్నాయి. వారికి సీఎం వైయస్ జగన్ ప్రకటించిన ప్యాకేజీ అమలుకు చర్యలు చేపట్టామని వివరించారు. దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నామన్నారు. ఏపీలో మాత్రం చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అదే విధంగా ఎల్‌జీ పాలిమర్స్ కొరియన్ టీమ్ వచ్చిందని, 14 రోజులు పాటు ఈ బృందం విశాఖలో అధ్యయనం చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కూడా ఉన్నారని, హైపవర్ కమిటీ కూడా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోంది. నివేదికల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు.