రైతుకు ఆత్మహత్య అనే ఆలోచనే రావొద్దు

మీడియాతో మంత్రి కన్నబాబు

రైతుకు ఏ కష్టం రాకుండా చర్యలు

పెదవేగి ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్వహణ ఇక రైతులదే

వైయస్‌ఆర్‌ పొలం బడి కార్యక్రమానికి శ్రీకారం

రాష్ట్ర వ్యాప్తంగా మరో 2వేల వాతావరణ పరిశీలన కేంద్రాలు

చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు

మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యవసాయాధికారులు పొలాల్లోనే ఉండాలి

వ్యవసాయ శాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం వైయస్‌ జగన్‌

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ధర్మాడి సత్యం పేరు ప్రతిపాదించిన సీఎం

 

తాడేపల్లి: ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేయాలో సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రతి నిమిషం ప్రజా శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నారని చెప్పారు. పడవ ప్రమాదాన్ని తెలుగుదేశం పార్టీ పెద్ద రాద్ధాంతం చేయాలని చూసిందని, ఒక సామాన్య వ్యక్తి ధర్మాడి సత్యం బృందం దాన్ని వెలికి తీశారని, సామాన్య వ్యక్తి.. అసమాన్య పనిచేసినందుకు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకొని అతనికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని, అది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కమిట్‌మెంట్‌ అని చెప్పారు.

క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌తో సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారని వివరించారు.
 
– ఆయిల్‌ఫామ్‌ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని సీఎం దృష్టికి తీసుకురావడంతో రూ. 87 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. తెలంగాణతో సమానమైన రేటు ఆయిల్‌ఫామ్‌ రైతులకు ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా పెదవేగిలోని ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఫ్యాక్టరీలను మూసివేశారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఒక ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించడం వ్యవసాయ చరిత్రలో గొప్ప విషయంగా భావిస్తున్నాం. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు.

– వైయస్‌ఆర్‌ ఆగ్రి ల్యాబ్‌లను మూడు దశల్లో ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఒకటి జిల్లా స్థాయిలో, రెండోది నియోజకవర్గస్థాయిలో, మూడు గ్రామస్థాయిలో కూడా భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన నమూనాను సీఎం పరిశీలించారు.

– విత్తన ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.  విత్తనాలు పండించడానికి ముందుకు వచ్చిన రైతులతో ఏపీ సీడ్స్‌ ఎంఓయూ కుదుర్చుకుంటుంది. విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రోసెసింగ్‌ చేసిన తరువాత అందజేస్తాం. దీని వల్ల రైతులకు అధిక ఆదాయం, నాణ్యమైన విత్తనాలు అందించగలుగుతాం.

– రాష్ట్రంలోని ప్రతి పంట ఈ–క్రాపు బుకింగ్‌లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఏ సర్వే నంబర్‌లో ఏ పంట వేశారనేది అందుబాటులో తీసుకురావాలని, ఈ–క్రాపు బుకింగ్‌ చేస్తే మార్కెటింగ్‌ను పటిష్టం చేయగలుగుతాం.. రైతులకు ఇబ్బందులు వస్తే అధిగమించగలుగుతామని సీఎం చెప్పారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు ట్యాబ్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలని, అవసరమైన టెక్నాలజీ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.

– వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకాన్ని ప్రారంభించాం. రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉచిత పంట బీమా పథకం బ్రహ్మాండంగా ఆదరణ పొందింది.

– 2018లో లెక్కల ప్రకారం 15 లక్షల 50 వేల మంది రైతులు మాత్రమే పంటలకు ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు. ప్రస్తుతం 21.5 లక్షల మంది ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు. ఏరియా వైజ్‌ చూసుకుంటే 18 లక్షల 50 వేల హెక్టార్లకు పంటల బీమా జరిగితే.. ప్రస్తుతం 27.01 లక్షల హెక్టార్లకు పంట బీమా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అన్ని పంటలు బీమా పరిధిలోకి వచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు.

– రైతులకు ఇంకా మేలు జరగాలనే చర్చలో మరొక 2 వేల వాతావరణ పరిశీలన కేంద్రాలను గ్రామాలను ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. అందుకు నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

– రాష్ట్రంలో చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. రబీ సీజన్‌లోనే చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు రూపొందించిన ప్రణాళికను సీఎం పరిశీలించారు. చిరుధాన్యాలు సాగు చేసే వారికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

– ఆర్గానిక్‌ పంటలను ప్రోత్సహించాలని, ఆర్గానిక్‌ పంటలకు అధిక రేటు ఇచ్చే విధంగా మార్కెటింగ్‌ శాఖకు ఆదేశాలిచ్చారు. భవిష్యత్తులో పూర్తిగా ఆర్గానిక్‌వైపు వెళ్లాలంటే ఈ ప్రోత్సాహకాలు అవసరం అని ముఖ్యమంత్రి చెప్పారు.

– వైయస్‌ఆర్‌ పొలం బడి అనే పేరుతో క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయంలో మెలకువలు, సాగులో కొత్త పద్ధతులు నేర్పించడం కోసం నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో రెండు క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

– వ్యవసాయ విస్తరణ ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు వ్యవసాయ అధికారులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పొలాల్లోనే ఉండాలి. రైతులతో కలిసి పనిచేయాలని సూచించారు. సోమవారం స్పందనపై సమీక్ష, సెలవులు మినహాయించి కనీసం వారానికి నాలుగు రోజులు ఫీల్డ్‌లోనే ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచే కార్యాలయాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

– గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల షాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దానికి సంబంధించిన చర్యలు మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,158 సెంటర్లు వస్తాయి.

– ఎరువుల షాపు పక్కనే వ్యవసాయ వర్క్‌షాపును ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఆధునిక పద్ధతులను రైతులకు వివరించడం, ప్రకృతి సేద్యం, అధిక ఆదాయం వచ్చే మెలకువలు ఇవ్వాలని సీఎం సూచించారు.  

– రైతులకు సమస్య వచ్చినప్పుడు తక్షణమే గ్రామ సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఐటీ సొల్యూషన్‌ తీసుకురావాలని ఆదేశించారు.

– పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పొగాకు రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యుల్‌ చేయాలని అడుగుతున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు బ్యాంకు అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులకు బాధ్యతలను అప్పగించారు.

– రైతుల ఆత్మహత్యల మీద కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో చర్చించారు. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం అందకపోయి ఉంటే.. అలాంటి కేసులను వెంటనే పరిశీలన చేసి అందించాలని సీఎం ఆదేశించారు. గతంలో 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా జాబితా ఉంటే వాటిలో 385 కేసులు ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.రైతుకు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా ఉండేందుకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతుకు ఏ కష్టం రాకుండా కష్టపడుతున్నాం. పాత కేసులు కూడా పరిశీలించి సాయం అందించాలని, తక్షణమే ప్రాసెస్‌ను కంప్లీట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. అర్హులని తేలితే ఆ రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందించాలని సూచించారు.

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన 108, 104 ఉద్యోగులు

Back to Top