నారాయణరెడ్డి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ ఆర్థిక సాయం 

వైయ‌స్ఆర్‌ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైయ‌స్ఆర్‌సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు  పరామర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైయ‌స్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.

మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు.

..కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. 

Back to Top