విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైయస్సాస్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు ఆక్షేపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా... రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జీవీఎంసీ స్డాండింగ్ కమిటీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ వివరాలు బయటకు రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యస్ఫూర్తికి విఘాతం కలిగించేలా సీక్రెట్ బ్యాలెట్ వివరాలను వెల్లడించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలకు కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 14 నెలలుగా అడ్డగోలు పాలన 14 నెలలుగా కూటమి ప్రభుత్వం.. తమకు బలం లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలపై పట్టు సాధించడం కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొన్నిచోట్ల వాటిని కైవసం చేసుకుంది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విశాఖలో మేయర్ పీఠాన్ని సంపూర్ణమెజార్టీతో కైవసం చేసుకోగా... వెనుకబడిన వర్గానికి చెందిన బీసీ మహిళను జగన్మోహన్ రెడ్డి మేయర్ గా అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే... గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికల నుంచి తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు జరిగిన పరిణామాలను ప్రజలంతా గమనించారు. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లను అనేక రకాలుగా ప్రలోభపెట్టి, బెదిరించి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి... 27 మందిని తమవైపు తిప్పుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 32 మంది వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు.. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు లొంగకుండా పార్టీని అంటిపెట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. ఆ బలంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసింది. అంతే కాకుండా ఆ రోజు మా మేయర్ గారి అవిశ్వాస తీర్మానంలో పార్టీ విప్ ని ధిక్కరించి, వైయస్ఆర్‌సీపీ పార్టీ గుర్తు మీద గెలిచి, మాకు వ్యతిరేకంగా, కూటమికి అనుకూలంగా ఓటు వేసిన 27 మందిపై అనర్హత వేటు వేయమని కోర్టుని ఆశ్రయించాం. కోర్టు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ప్రకారం అప్పటి ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆ 27 మందికి నోటీసులు జారీ చేసి, వివరణ ఇమ్మన్నారు. అయితే వివరణ ఇమ్మన్న తేదీ గడువు లోగానే...వివరణ ఇస్తే ఏమవుతుందోనన్న ఉద్దేశ్యంతో, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ...న్యాయవస్ధవస్ధలో లొసుగులు ఆసరాగా చేసుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 97 మంది కార్పొరేటర్లను ఓటర్లుగా వివరణ ఇస్తూ.. ఈ 27 మంది పార్టీ ఫిరాయించిన వారికి కూడా ఓటు హక్కు కల్పించారు. దీనిపైనా మేం కోర్టును ఆశ్రయించాం. అయినా ఎన్నికలు జరిపించారు. మేం ప్రజాస్వామ్యంలో గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేశాం. కూటమికి చెంప పెట్టులాంటి తీర్పు. పోటీ చేసినప్పుడు ప్రత్యర్థిని కూడా ఓటు అడిగే హక్కు రాజ్యాంగం కల్పించింది. కూటమి పార్టీకి చెందిన కార్పొరేటర్లు, వైయస్ఆర్‌సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లు మేయర్ మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వైయస్ఆర్‌సీపీని వీడి వెళ్లినందుకు పశ్చాత్తాపపడి... వైయస్ఆర్‌సీపీకి ఉన్న 32 మందితో పాటు మరో 18 మంది కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి మద్ధతు తెలపడం ద్వారా విశాఖ చరిత్రలో ఓ మంచి సందేశాన్ని అందించారు. కూటమి తరపున 10 మంది పోటీచేస్తే... ప్రతి ఒక్కరూ కొంత మొత్తం డిపాజిట్ చేయాలని నిబంధన విధించి ఆ డబ్బును అందరికీ పంచిపెట్టారు. కార్పొరేటర్ల అందరినీ క్యాంపు రాజకీయాల్లో భాగంగా రిసార్టులకు తరలించారు. ఇంత చేసినా... ధర్మం గెలిచింది. వైయస్ఆర్‌సీపీ నైతికంగా విజయం సాధించింది. దీంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ... సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ ను బహిరంగం చేస్తూ... వైయస్ఆర్‌సీపీకి ఓటు వేసిన వారిని బెదిరిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. దురదృష్టకరం. 1951 పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, 1955 మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు ప్రకారం.. ఈ రకంగా ఓటింగ్ ను బహిరంగపరచడం తప్పుడు చర్య, నేరం. దీని పై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేస్తాం. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికను బహిరంగం చేసిన.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా ఎన్నికల ప్రకియను అపహాస్యం చేయడమే. రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడమే. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులకు పాల్డడ్డం, వారిపై దాడులు చేయడంతో పాటు, తప్పుడు కేసులు కూడా బనాయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించిన అధికార్లు పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారా ? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. నిర్భయంగా ఓటు వేసుకునే స్వేచ్ఛను హరించడాన్ని తీవ్రంగా ఖండించిన కేకే రాజు... దీనిపై న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు.