విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధిబృందం సోమవారం విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి ఓటర్లను బూత్ లలోకి వెళ్లనివ్వకుండా, దొంగ ఓట్లతో దొడ్డిదోవన గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. పోలీసులు సైతం అధికారపార్టీకి చెందిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని వైయస్ఆర్‌సీపీ నేతలు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, హఫీజ్ ఖాన్, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, అంకంరెడ్డి నారాయణమూర్తి, ఇతర పార్టీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్‌ఈసీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే... ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారు : అంబటి రాంబాబు, మాజీ మంత్రి పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పొలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అధికార పార్టీ అరాచకం రాజ్యమేలుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఓటర్లను పోలింగ్ బూత్ లలోకి వెళ్లకుండా చేయడానికి పోలీసులు, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఒకటి రెండు చోట్ల మా ఏజెంట్లు వెళ్లిన తర్వాత కూడా వారిని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు, కార్యకర్తలు పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా బయటకు లాగివేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికతో సంబంధం లేని జమ్ములమడుగుతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వందలాదిగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. పులివెందుల మాజీ ఎంపీపీ వైయస్ఆర్‌సీపీ తరపున ఏజెంటుగా వెళ్తే ఆయనను కూడా బయటకు లాగేశారు. ఏజెంటు లేకుండానే పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఓటరు వైయస్ఆర్‌సీపీఅని తెలిస్తే, వెళ్లకుండా అడ్డుకుని.. వారి స్లిప్పులు బలవంతంగా లాక్కుంటున్నారు. వాటిని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. అలా అనుమతించడానికి లేకపోయినా స్థానికంగా ఉన్న ఎన్నికల సిబ్బంది వారిని అనుమతిస్తున్నారు. ఇదొక దురదృష్ఠకర పరిణామం. ఎంపీ వైయస్.అవినాష్ రెడ్డి ఇంట్లోకి చొరబడి అరెస్టు చేసారు. ఎర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుపడ్డంతో... గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఎర్రగుంట్లలో సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ప్రజలు తిరగబడితే అప్పుడు పోలీసులు దిగి వచ్చారు. కేవలం టీడీపీ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. మా పార్టీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. వైయస్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి హేమంత్ రెడ్డిని సైతం హౌస్ అరెస్టు చేశారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్ధిని సైతం తిరగడానికి వీల్లేకుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి లతారెడ్డి గారిని యధేచ్చగా తిరగనిస్తున్నారు. చివరకు ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో నల్లగొండువారిపల్లె ఓటర్లు వెళ్లి పోలీసులు కాళ్లు పట్టుకుని ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించమని ప్రాధేయపడుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా... కుట్రపూరితంగా కేవలం ఒంటిమిట్ట, పులివెందులలో మాత్రమే ఎన్నికలు ప్రకటించారు. ఈ రెండింటిలోనూ ఈ విధంగా అడుగుడునా అక్రమాలకు పాల్పడుతూ గెలవడం ద్వారా... జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలని కుట్ర చేస్తున్నారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవాలను గ్రహించాలి. ఈ నెల 5వ తేదీన దాడి చేసి.. చంపడానికి ప్రయత్నించారు. ఓటర్లకు తెలియకుండానే పోలింగ్ బూత్ లను మార్పు చేశారు. దీని ద్వారా వేరే ఊరుకు వాహనాల్లో ఓటు వేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకుని వారి వద్ద ఉన్న స్లిప్పులు లాక్కుంటున్నారు. ఆ స్పిప్పులను తెలుగుదేశం పార్టీకి చెందిన వేరొకరికి ఇస్తున్నారు. వారు వెళ్లి ఓటు వేస్తుంటే... ఎవరూ అభ్యంతరం చేయడం లేదు. కేవలం టీడీపీకి చెందిన వాళ్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నిక ఎప్పుడూ జరగలేదు. 2017 లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఇలానే చేశారు. డబ్బులు పంచారు, ఓటింగ్ కు వెళ్లకుండా ఆపారు. తర్వాత నంద్యాల మేం గెలిచాం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: ఇవాల కూడా చంద్రబాబు తన చర్యలతో ప్రజాస్వామ్యాన్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం పులివెందులలో గెలిచాం అని చెప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి గెలివాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారు. మహిళలు సైతం మా ఓటు వేసుకోనివ్వండని పోలీసులను వేడుకుంటున్నారు. పులివెందుల సెగ్మెంట్ పరిధి లోని ఖానంపల్లెలో వైయస్ఆర్‌సీపీ సర్పంచ్ రామాంజనేయలుని తుపాకీ పెట్టి బెదిరించి ఓటింగ్ కు పోకుండా నిరోధించారు. అధికార పార్టీకి చెందిన జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి మాత్రం యధేచ్చగా పులివెందులలో తిరుగుతున్నారు. జమ్మలమడుగు వైయస్ చైర్మన్ ఓటేయడానికి క్యూలైన్ లో నిల్చనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అత్యంత దారుణమైన విధానంలో పులివెందుల, ఒంటిమెట్ట ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. అయినా మా బాధ వారికి వినిపించడం లేదు. ఎన్నికల సంఘం, పోలీసులు, తెలుగుదేశం గూండాలు ఏకమైపోయారు. ఇంత దారుణమైన ఎన్నిక చేసి ఏం సాధిస్తావ్ చంద్రబాబు. కేవలం వైయస్ఆర్‌సీపీని అణగద్రొక్కడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి తగిన మూల్యం కచ్చతంగా చెల్లించకతప్పదు. పులివెందుల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ప్రజలముందుంచడమే మా ముందున్న ప్రత్యామ్నాయమని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంత దిగజారి ప్రవర్తిస్తున్న చంద్రబాబు రానున్న రోజుల్లో దీనికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఆయన హెచ్చరించారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట: వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి. ఇవాళ ఉదయం నుంచి పులివెందుల, ఒంటిమిట్టలో ఓటర్లను కూడా బయటకు రానివ్వకుండా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుంది. రాష్ట్ర చరిత్రలో ఈ తరహా ఎన్నికలు మునుపెన్నడూ లేవు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేక..డబ్బు, అధికారాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవడానికి అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతోంది. వైయస్ఆర్‌సీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తూ... స్థానికేతరులను బయట నుంచి రప్పించి అధికార పార్టీ అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతుంది. మీరు అక్రమాలతో ఈ ఎన్నికను గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వానికి డిపాజిట్ కూడా దక్కదు. జరుగుతున్న అక్రమాలపై పలుమార్లు ఎన్నికల అధికారులను కలిసి విజ్ఞప్తి చేశాం. ఓటర్లను బూత్ లకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు: మల్లాది విష్టు, మాజీ ఎమ్మెల్యే. ఇవాల రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని కలిశాం. మేం పలుమార్లు పులివెందులలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఈసీ తగిన విధంగా స్పందించలేదు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికార్లను ఏకపక్షంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఓటర్లను కనీసం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. పోలీసులు అత్యంత దుర్మార్గంగా ప్రజల ఓటు హక్కును హరిస్తున్నారు. ఇది ముమ్మూటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. వైయస్ఆర్‌సీపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం యధేచ్చగా తిరుగుతున్నారు. ఇది పూర్తి బోగస్ ఎన్నిక. కనీసం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పంచని ఈ ఎన్నికకు అర్ధం లేదు. కేవలం పులివెందులలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అన్నిరకాల అక్రమాలకు తెరలేపారు. ఎన్నికల కమిషన్ కు స్థానికంగా ఉన్న ఎన్నికల యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తోంది. దీనిపైనే మరోసారి ఫిర్యాదు చేశాం. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు: మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోంది. ఎమర్జెన్సీ రోజుల కంటే ఘోరంగా పులివెందుల ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరిస్తోంది. కళ్లు, చెవులు ఉండి కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరగడం లేదని వైయస్సార్సీపీ పలుమార్లు విజ్ఞప్తి చేసినా... కనీస స్పందన లేదు. సజావుగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు, పోలీసులే టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. పులివెందులలో ఏం చేసైనా తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పుకోవడానికి కూటమి పార్టీ అక్రమాలకు తెరతీసింది. చివరికి వైయస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధిని సైతం ఓటు వేయకుండా హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గం. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగా.. ఇవాళ ఆయనతో కలిసి ఎన్నికల అధికారులు, పోలీసులు సైతం భాగస్వామ్యులయ్యారు. ఇవాళ పులివెందుల జడ్పీ ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో సగం మంది జమ్మలమడుగు ఓటర్లు, ఆదినారాయణరెడ్డి మనుషులే ఉన్నారు. ఎన్నికలతో సంబంధం లేని జమ్మలమడుగుకు చెందిన అనేక మంది సర్పంచ్ లు.. ఇతర నేతలు పులివెందుల వచ్చి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం. అడుగడుగునా అక్రమాలే. కేవలం పులివెందులలో గెలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఇంతటి దుర్మార్గాలకు తెగించాడు. మీ అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పోలీసులపై చర్యలు తీసుకోవాలి: హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ, పోలీసులు చేస్తున్న అక్రమాలపై మరోసారి ఎన్నికల సంఘాన్ని కలసి తగిన చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేసాం. వైయస్సార్సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లను అనుమతించడం లేదు. చివరకి ఓటర్లను కూడా ఓటు వేసుకునే అవకాశం ఇవ్వడం లేదని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం. ఈ అక్రమాలకు కారణమైన ఎన్నిక అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరాం.