ఆలీబాబా నలభై దొంగల్లా ఆ ముగ్గురు

మంత్రి కన్నబాబు

విజయవాడలో రూ.100లకే పండ్ల పంపిణీ ప్రారంభం

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆలీబాబా నలభై మంది దొంగల్లా తయారయ్యారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. విపత్కర సమయంలో ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టాలని కానీ, రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు. గురువారం విజయవాడ నగరంలోని రెడ్‌జోన్‌ ఏరియాల్లో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ నాలుగు రకాల పండ్లు రూ.100 చొప్పున పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులెవరూ ఇబ్బందులు పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. పండ్లకు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఆక్వారంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే ప్రతిపక్షాలు పని కట్టుకొని మరి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని స్కైప్‌ టీవీల్లో సూక్తులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని కన్నబాబు హెచ్చరించారు.

Back to Top