తీర ప్రాంతాల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

తుపాన్‌ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష

నెల్లూరు: మాండూస్‌ తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. తుపాన్‌ కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి కాకాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తీర ప్రాంత మండలాల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామని చెప్పారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.  ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

Back to Top