తాడేపల్లి: పెడనలో అల్లర్లకు పవన్‌కళ్యాణ్ కుట్రపన్నారని మంత్రి జోగి రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. వారాహిని అడ్డుకునే అవసరం మాకేంటి? ఆయన ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు.
అంగళ్లు తరహాలో..:
వారాహి యాత్రపై దాడి చేసే అవకాశం ఉందంటూ పవన్‌కళ్యాణ్ నిస్సిగ్గుగా చేసిన పిచ్చి వ్యాఖ్యలను పెడన ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారు. నాడు అంగళ్లు సెంటర్‌లో దత్తతండ్రి చంద్రబాబు ఏవిధంగానైతే కుట్ర చేసి కుయుక్తులతో అల్లర్లు సృష్టించాడో.. అదే తరహాలో పెడనలో కూడా çఘటనలకు పవన్ పార్టీ కార్యకర్తలను పురి గొల్పుతున్నాడు. నాడు అంగళ్లులో పోలీసులపై చంద్రబాబు మనుషులు ఏ విధంగా దాడులు చేశారో.. వారి వాహనాలను తగలబెట్టారో అందరూ చూశారు. ఆ దత్తతండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆయన మాస్టర్‌ప్లాన్ స్కెచ్ ప్రకారమే.. పవన్‌కళ్యాణ్ ముందస్తు హెచ్చరికలకు పాల్పడ్డారనేది అందరికీ అర్ధమౌతుంది.
వారి దుష్టాలోచన ప్రకారం పెడనలో గొడవలు సృష్టించి, శాంతిభద్రతల సమస్యల్ని లేవనెత్తి కొందరు అమాయక జనసేన కార్యకర్తల్ని గాయపరచాలనే కుట్రపూరిత ఆలోచన పవన్ మాటల్లో కనిపిస్తోంది.
పెడన ప్రజలు శాంతికాముకులు:
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాదిరిగా పార్టీ కేడర్‌ను హింసకు ప్రోత్సహించే మనస్తత్వం మాది కాదు. దమ్ము, ధైర్యం ఉన్న జగన్‌గారి నాయకత్వంలో నీతిమంతమైన రాజకీయం నేర్చుకున్న వాళ్లం. మాకు కుట్రలు, కుతంత్రాలు చేయడం రాదు. కేవలం, ప్రజలకు మంచి చేయడం, వారి దగ్గర్నుంచి ఆదరణ పొందడమే మాకు తెలిసిన విద్య.
డెల్టా ప్రాంతమంటే నీకెలా కనిపిస్తున్నారు పవన్‌కళ్యాణ్? పెడన నియోజకవర్గం ప్రజలంటే శాంతికాముకులు. అలాంటి వాళ్లు నిన్ను అడ్డుకోవడానికి, నీ సభను చెదరగొట్టడానికి కత్తులు, రాడ్లతో దాడులు చేస్తారని అంటావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది?
ఆ దమ్ముందా పవన్?:
అనిగడ్డలో సభ ఎటూ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది కనుక పెడనలోనూ అదే పరిస్థితి ఉంటుందేమోనని ఊహించి జనాల్ని రెచ్చగొట్టే సినిమా స్కెచ్ వేస్తున్నావా..? లేకపోతే, పెడన నియోజకవర్గ ప్రజలపై ఈ నిందలేంటి..? నీ రెచ్చగొట్టే రాజకీయాల్ని పెడనలో చూపించాలనుకుంటే, అది సాధ్యం కాని పని. ఈ విషయం పవన్ తెలుసుకోవాలి.
రేపు (బుధవారం) పెడన సభలో తనపై దాడి జరిగే అవకాశం ఉందంటున్న పవన్‌కళ్యాణ్.. అందుకు ఆధారాలు ఉంటే చూపించగలరా? ఆ దమ్ము నీకుందా పవన్?.
ఇదే నా సవాల్:
పవన్‌కళ్యాణ్‌ను నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీవు చేస్తున్న ఆరోపణలను నిరూపించి చూపితే.. నీ వారాహి యాత్రకు నేనే స్వయంగా వచ్చి వీధి వీధి తిరిగి నీమీద చిన్న ఈగ కూడా వాలకుండా చూస్తాను. నా నియోజకవర్గం నుంచి నిన్ను పూర్తి సేఫ్‌గా దాటిస్తాను. మరి నా సవాల్ స్వీకరిస్తావా?.
చాపా దిండు సర్దుకున్న పవన్:
జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చాపాదిండు సర్దుకుని హైదరాబాద్‌కు వెళ్లడమే ఇక తరువాయిగా మారింది. అవనిగడ్డలో ఆయన వారాహి యాత్ర సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. మూడు గంటలసేపు కష్టపడి మీటింగ్ కొనసాగిస్తే కేవలం 300 మంది మాత్రమే సభాస్థలిలో ఉన్నారు. అది కూడా.. టీడీపీ, జనసేన జతకట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి సభలో!.
నిస్తేజమైన జనసేన:
పార్టీ పరువు పోతుందని జనసేన, టీడీపీ నాయకులు తమ కేడర్‌కు ఫోన్లు చేస్తేనే.. కేవలం అంత మందే వచ్చారు. ఆ స్థాయిలో జనసేన చతికిల పడడానికి కారణం.. టీడీపీతో జత కట్టడం జనసేన కేడర్‌కు అస్సలు ఇష్టం లేదు. అధినేత తీరు వారికి నచ్చడం లేదని తేలిపోయింది. నేనెటూ చంద్రబాబు దత్తపుత్రుడ్ని కాబట్టి టీడీపీ చంకనెక్కి కూర్చున్నాను. మీరూ అలాగే రావాలన్న పవన్ పిలుపు కార్యాచరణలో అభాసుపాలైంది.
మనసు లేని దద్దమ్మ..పవన్:
2014 ఎన్నికల్లో పవన్‌ను నమ్మిన ఆయన అభిమానులు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే బాబు, ఆయన కొడుకు ఇద్దరూ జనసేన పార్టీని, కేడర్‌ను ఎన్నెన్ని మాటలన్నారు.. పవన్ కుటుంబాన్ని రోడ్డుకీడ్చే వ్యాఖ్యలు చేశారు. ఆయన తల్లిని అనరాని మాటలు అన్నారు. పవన్ ముఖ్యమంత్రి కావాలంటే.. బాబు సామాజికవర్గ బ్లడ్ ఎక్కించుకోవాలని నోటికొచ్చినట్లు వాగారు.
పవన్ ఇప్పుడు వాటన్నింటినీ మర్చిపోయారు. కానీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం మరవలేదు. అందుకే ఈరోజు వారు పవన్‌ను నిలదీస్తున్నారు. చంద్రబాబు ప్యాకేజీకి పవన్ అమ్ముడు పోయినంత మాత్రాన, తాము టీడీపీకి గులాంగిరి చేయడానికి సిద్ధంగా లేమని జనసేన కేడర్..తమ అధినేతకు షాక్ ఇస్తోంది. తిట్టినోళ్లనే పొగిడే మనసు లేని ఒక దద్దమ్మ.. తమ అధినేత అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణాల వల్లనే నిన్న (సోమవారం)టి అవనిగడ్డ సభ అభాసుపాలైంది.
పవన్‌కళ్యాణ్‌ను నమ్మొద్దు:
గతకాలపు అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత కూడా టీడీపీతో జతకట్టి చంద్రబాబును మరోమారు గద్దెనెక్కించేందుకు జనసేన కేడర్ సిద్ధంగా లేరు. ఇదే విషయంపై బాహాటంగానే ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు, పవన్‌కళ్యాణ్ అభిమానులకు కూడా మీడియా ద్వారా చెప్పేదేమంటే.. ఇప్పటికైనా ఆయన మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకోవాలి. పవన్‌ను నమ్మితే మీరు నట్టేట మునిగినట్టే.. అని మంత్రి జోగి రమేశ్ హితవు చెప్పారు.