స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుకూలమా..? వ్యతిరేకమా..?

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విజయవాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. మొన్నటి వరకు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. నేడు బిడ్డింగ్‌లో పాల్గొంటాం అంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నట్టే కదా అని ప్రశ్నించారు. విజయవాడలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి అనేక రకాల సూచనలు, సలహాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం వైయస్‌ జగన్‌ అనేక సందర్భాల్లో వివరించారన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. విశాఖలో నాలుగు లక్షల మందితో బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మంత్రి అమర్‌నాథ్‌ నినదించారు. 

 మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..:

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం:
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఉన్న అంశాలను సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రధాని మోదీ గారికి మూడు, నాలుగు సందర్భాలలో చెప్పడం జరిగింది. క్యాపిటివ్‌ మైన్స్‌ ఇవ్వాలని, రుణాలు సేకరించి పునరుద్ధరణ చేయొచ్చని చెప్పాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్నదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దని గట్టిగా చెప్పాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మా విధానం అయితే.. అమ్మటం-కొనటం... ఆ పార్టీల విధానాలు. 
    విశాఖ స్టీల్స్‌ను ప్రైవేటుపరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. అలాగే విశాఖలో 4 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి స్టీల్‌ ప్లాంట్‌ వ్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాం.
మా ప్రభుత్వ విధానం, వైఖరి ఒక్కటే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దు అన్నదే. అదే రాష్ట్ర ప్రజల అభిమతం కూడా. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు.

వారి వైఖరి ఏమిటి?:
    తెలంగాణ ప్రభుత్వం ఇంకా బిడ్‌లో పాల్గొనలేదు. ఒక బృందాన్ని పంపించి, ప్లాంట్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమా? కాదా? ఒకవేళ ప్రైవేటీకరణకు అనుకూలం అనుకుంటే, ఇలా ప్రైవేటీకరణ చేస్తున్న ప్రతి చోటా తామూ బిడ్‌లో పాల్గొంటామని చెబుతారా? 
    ఒకవేళ అలాంటి ఉద్దేశం, ఆలోచన లేనప్పుడు, ఏ విధంగా ఇప్పుడు బిడ్‌లో పాల్గొంటారనేది వారే చెప్పాలి. నిజానికి ప్రైవేటీకరణ వద్దని మొన్న వారే చెప్పారు. మరి ఈరోజు బిడ్‌లో పాల్గొంటున్నారంటే.. ప్రైవేటీకరణకు వారు అనుకూలంగా ఉన్నట్లే కదా? కాబట్టి ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నదానికి ముందుగా వారు సమాధానం చెప్పాలి. వారి వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలి. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే, కేంద్రానికి లేఖ రాయొచ్చు కదా? సంస్థకు క్యాపిటివ్‌ మైన్స్‌ ఇవ్వమని కోరవచ్చు కదా?

ఆ అర్హత లేదు:
    ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ గత ఏడాది ఏప్రిల్‌ 19,2022న మెమో ద్వారా నియమావళి ప్రకటించింది. 51 శాతం, అంతకంటే ఎక్కువ వాటా కలిగిఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగానీ, లేదా సంయుక్త భాగస్వామ్య సంస్థగానీ, మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్ యూ), ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనరాదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 
- మరి రూల్స్ ఇలా ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత శక్తే ఉండదని తెలిసినప్పుడు.. తెలంగాణ గవర్నమెంటు వచ్చేస్తుందని చెప్పటం ఏమిటి?
- కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అనుమతి ఇస్తే తప్ప, అలా పాల్గొనే వీలు లేదు. 

కేంద్రానికే సాధ్యం కానప్పుడు!:
    మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది. అయినా కేంద్రం నడపలేని ఒక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నడపగులుగుతుందా?
కేంద్రమే ఆ ప్లాంట్‌ను నడపలేకపోయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్వహించగలుగుతుంది?. అందుకే తెలంగాణకు కూడా అది సాధ్యం కాదు.
    మేము స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. అలాంటప్పుడు కొనడం అనే మాటే ఉత్పన్నం కాదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌.. రాజకీయాల్లో భాగంగా, వారు చేసేది చేస్తున్నారు. నాడు చంద్రబాబు ఏకంగా 54 పరిశ్రమలను అమ్మేస్తే.. ఇదే ఈనాడు ఏం చేసింది? కనీసం ఒక్క వార్త అయినా రాసిందా? ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేస్తామని కేంద్రం చెబుతోంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయినా అదే పనిగా మాపై దుష్ప్రచారం చేస్తూ.. బురద చల్లుతున్నారు.

ఆ పని చేస్తే ప్రజాగ్రహం తప్పదు:
    స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా చెప్పాం. ఏయే చర్యలు తీసుకుంటే, ప్లాంట్‌ను తిరిగి నిలబెట్టవచ్చన్న వాటిపై కేంద్రానికి చాలా స్పష్టంగా చెప్పాం. పైగా స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్రానికి సెంటిమెంట్‌ అని, 32 మంది బలిదానంతో సంస్థ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేశాం.
    అందుకే స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రానికి నివేదించాం. సంస్థను కాపాడుకోవడానికి ఉన్న అన్ని మార్గాలు ఉపయోగించుకుంటాం. ఇంత వ్యతిరేకత ఉన్నా, ఒకవేళ కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేస్తే, వారు తీవ్ర ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. ఎందుకంటే అది ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్నది. ప్రజల సెంటిమెంటును గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top