పొల్యూషన్‌ పేరుతో నిసిగ్గుగా కేంద్రానికి యనమల లేఖ 

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

లేఖతో యనమల రామకృష్ణుడు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు

నాడు సెప్టెంబర్‌1 ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. మళ్లీ అదే తేదీన బల్క్‌ డ్రగ్‌ పార్కు వద్దని రాష్ట్రానికి వెన్నుపోటు

ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాకుండా టీడీపీ అడ్డుపడుతోంది

కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే అనుమతులు ఇస్తారా..?

వైయస్‌ఆర్‌ను దేవుడిలా కీర్తిస్తుంటే చంద్రబాబు చూడలేకపోతున్నాడు

విశాఖపట్నం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజలంతా ఆయన్ను దేవుడిలా కీర్తిస్తుంటే చంద్రబాబు చూడలేకపోతున్నాడని, విస్తృతస్థాయి సమావేశం పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ‘కాకిలా కలకాలం బతికేకంటే.. హంసలా ఆరు నెలలు బతికినా చాలు’ అని పెద్దలు చెప్పారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదని, కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు సువర్ణ పాలన అందించిన వైయస్‌ఆర్‌ను కొనియాడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడన్నారు. విశాఖపట్నం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే.. 
మహానేత వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ప్రజలంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం కోసం ఆయన పడిన తపన,  ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బయల్దేరి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వైయస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఏరకంగా పనిచేస్తున్నారో మనమంతా చూస్తున్నాం. వైయస్‌ఆర్‌ గురించి రాష్ట్రమంతా మాట్లాడుకుంటుంటే చంద్రబాబు చూడలేకపోతున్నాడు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజు సెప్టెంబర్‌ 1. ఆ రోజును గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ పాలన కావాలని 1994లో టీడీపీకి 212 సీట్లు రాష్ట్ర ప్రజలు అందించారు. గుంటనక్కలా చంద్రబాబు కాపుకాసి.. మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన సెప్టెంబర్‌ 1వ తేదీని బ్లాక్‌ డేగా రాష్ట్ర ప్రజలు భావిస్తే.. దాన్ని సంతోషమైన రోజుగా చంద్రబాబు అభివర్ణించి పొంగిపోతున్నాడు. ఆ రోజున చంద్రబాబుకు తోడుగా వచ్చిన పాట్నర్‌ యనమల రామకృష్ణుడు. బాబుకు అధికారం రావడానికి, టీడీపీని, సింబల్‌ను చేజిక్కించుకోవడంలో, అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను కనీసం మాట్లాడనివ్వకుండా చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. 

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఒకటి హిమాచల్‌ ప్రదేశ్, రెండోది గుజరాత్, మూడోది దక్షిణ భారతదేశంలోని ఏపీకి బల్క్‌ డ్రగ్‌ పార్కు మంజూరు చేస్తే.. దాని మీద యనమల అత్యంత అన్యాయంగా లేఖ రాశాడు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేస్తే పొల్యూషన్‌ వచ్చేస్తుంది.. గ్రామాలు నష్టపోతాయి.. పర్యావరణ ఇబ్బందులు వస్తాయి.. మా ప్రాంతానికి నష్టం చేకూరుతుందని నిసిగ్గుగా కేంద్రానికి లేఖ రాశాడు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి.. ఆ జిల్లాకు బల్క్‌ డ్రగ్‌ పార్కు రాకుండా నిసిగ్గుగా అడ్డుపడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే అనుమతులు ఇస్తారా..? అమెరికన్‌ ఎఫ్‌డీఏ ఎంత కఠిన నిబంధనలు పాటిస్తుందో సాధారణ వ్యక్తిని అడిగినా చెబుతారు. 

తూర్పుగోదావరి జిల్లాకు మంచి జరుగుతున్న క్రమంలో కేవలం చంద్రబాబు దగ్గర మార్కులు కొడదామని, టీడీపీ తనను ఎక్కడ మరిచిపోతుందోనని లేఖ రాసినట్టుగా అనిపిస్తుంది. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకుండా చేయాలనే అతి నీచమైన కార్యక్రమం యనమల రామకృష్ణుడు చేశాడు. ఆనాడు సెప్టెంబర్‌ 1న ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే.. మళ్లీ నిన్న సెప్టెంబర్‌ 1న లేఖ రాసి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. పరిశ్రమ ఏదైనా వస్తే మా వళ్లే వచ్చిందని టీడీపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటారు.  కొత్తగా ఏదైనా పరిశ్రమ తీసుకువస్తే కాలుష్యం అంటూ అడ్డుపడుతున్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు కోసం అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి. దక్షిణాదిలో బల్క్‌ డ్రగ్‌ పార్కును మన రాష్ట్రమే దక్కించుకుంది. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వద్దుంటూ యనమల లేఖ రాయడం హేయం. ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. వారికి సహరిస్తాం. వారికి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. దానితో పాటు ప్రజలకు సంబంధించి ఆరోగ్యం గురించి,  పర్యావరణానికి సంబంధించి కూడా ఎక్కడా ఇబ్బంది రానివ్వం.  ఏ పరిశ్రమ అయినా, కచ్చితంగా పర్యావరణ మార్గదర్శకాలను పాటించాల్సిందే. 

అమర్ రాజా బ్యాటరీస్ పై మాట్లాడలేదేం..?
రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్‌కు సంబంధించి ఫిర్యాదు వస్తే, చుట్టుపక్కల గ్రామాల్లో కలుషితం జరుగుతుందని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు దాన్ని ధ్రువీకరిస్తే ఆరోజున మీరెందుకు (చంద్రబాబు, యనమల) మాట్లాడలేదు? మీకు చెందిన కంపెనీ అనా లేక మీ పార్టీకి చెందిన వారిదనా? మీకు చెందిన వారి పరిశ్రమలు నుంచి వచ్చే కాలుష్యం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు కానీ, రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరుగుతుంటేనో, ఏదైనా పరిశ్రమ వస్తేనో మీకు ఎందుకు కడుపుమంట.?

రాష్ట్రం, దేశం నుంచి వీరిని బహిష్కరించాలి
ఈ రకమైన ఆలోచనా విధానాన్నిఇప్పటికైనా మార్చుకుంటే మంచిది.  73 ఏళ్ళు వచ్చినా.. మీలో మార్పు రావడం లేదు. వయసు మీద పడితే సరిపోదు. మనం పుట్టిన ప్రాంతానికి, రాష్ట్రానికి ఏం మంచి చేసేమనే ఆలోచన కూడా లేకుండా నిసిగ్గుగా కేంద్రానికి లేఖ రాయడమా? ఇప్పటికే మిమ్మల్ని రాజకీయంగా రాష్ట్ర ప్రజలు బట్టలు విప్పదీసి నగ్నంగా రోడ్డుమీద నిలబెట్టినా సిగ్గు, శరం లేకపోయింది.  రాష్ట్రానికి మేలు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు, యనమల లాంటి వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వారిని ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి బహిష్కరించాలి. వారికి ఈ రాష్ట్రంలో ఉండే అర్హతే లేదు. ఇలాంటి వ్యక్తులు ఉంటే రాష్ట్రానికి, దేశానికి నష్టం. వీరివల్ల దేశానికి, రాష్ట్రానికి మంచి జరగకూడదు.

కేవలం తామే అధికారంలో ఉండాలి, తమకే మంచి జరగాలి. తమతో ఉన్నవాళ్లకే మంచి జరగాలి అన్నదే  మీ సిద్ధాంతమా...? చంద్రబాబుకు, యనమలకు రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదనే భావన ఉంది. యనమల తనకు తానే అపర మేధావి అని సెల్ప్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటాడు. ఎన్టీఆర్ తన కుమారుడు పేరు ఉందనే ఉద్దేశంతో యనమల రామకృష్ణుడిని తన కేబినెట్‌లోకి తీసుకుంటే... అలాంటి వ్యక్తే మొట్టమొదట ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. చెట్టుకింద ప్లీడర్‌ను తీసుకువెళ్లి రాష్ట్రానికి మంత్రిని చేసి, స్పీకర్‌గా అవకాశం ఇస్తే చివరకు అసెంబ్లీలో ఎన్టీఆర్‌కు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి వెన్నుపోటు దారుడు, ఎన్టీఆర్‌కు మరణానికి కారణం అయిన చంద్రబాబుతో చేతులు కలిపిన వ్యక్తి యనమల.

అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్బీఐకు లేఖలు రాసిన బాబు
ఇక రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో పెడితే, ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయి, అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రావడానికి కారణం చంద్రబాబే. విభజన హామీలు అమలు కాకుండా తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వీళ్లంతా కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఇలాంటి వ్యక్తులంతా మా ప్రభుత్వంపై విమర్శలా? రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐకి లేఖలు రాసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులది. చంద్రబాబుకు కానీ ఆయన పార్టీలోఉన్న నాయకులకు ఎప్పుడు సిగ్గు వస్తుంది. ఎప్పుడు మీరు మారతారు? 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, తాను ప్రజలకు మంచి చేశానని చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు.

జైలుకు వెళితే బాబు పదవులు ఇస్తాడట..
రాబోయే కాలంలో ప్రభుత్వం మీద తిరగబడి ఎవరు జైలుకు వెళతారో వారికే పార్టీలో, పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా చెబుతున్నాడు. శాంతి భద్రతలు అతిక్రమించమని, అసాంఘిక కార్యక్రమాలు చేయమని ప్రోత్సహించడమే ఇది. ప్రభుత్వంపై తిరగబడాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలుకు ఏముందని అడుగుతున్నాం. అలాంటి పరిస్థితులు ఏమున్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా మూడేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా మా పార్టీ నాయకులంతా ప్రతి గడప గడపకు వెళుతున్నాం. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. ప్రజలంతా మా ప్రభుత్వాన్ని స్వాగతించి, ఆశీర్వదిస్తున్నారు.  జైలుకు వెళ్ళాల్సింది... మీ పార్టీ కార్యకర్తలు కాదు, ముందు నువ్వు, నీ కొడుకు జైలుకు వెళ్లాలి. శాంతిభద్రతలను అతిక్రమించేలా ప్రేరేపిస్తున్నందుకు చంద్రబాబును జైలుకు పంపించాలి. ఇదేనా మీ కార్యకర్తలకు నేర్పించే సంస్కారం. చంద్రబాబుకు ఈ జన్మలో సిగ్గురాదు. ఇక నారా లోకేష్‌ ఒక జోకర్‌లాగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. 

చివరకు బాలకృష్ణ సీటుకే తండ్రీకొడుకులు ఎసరు
మీరు చూసే మీ ఎల్లో టీవీల్లో మీ నాన్న శోభన్‌బాబులా కనిపిస్తాడేమో.... మిగిలిన న్యూట్రల్ టీవీ చానల్స్‌ కూడా చూస్తే బాగుంటుంది లోకేష్‌. మిమ్మల్ని అందంగా చూపించడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ గురించి మంచిగా చూపించే టీవీ చానల్స్‌ మాత్రమే మీరు చూస్తారు. మీకున్న రెండు, మూడు ఛానల్స్‌ను చూసుకో తప్పులేదు. రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు. టీడీపీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారనేది కూడా చూస్తే బాగుంటుంది. మేము వచ్చే ఎన్నికల్లో  175కి 175సీట్లు ఎలా గెలవాలని చూస్తుంటే.. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి కుప్పంలో ఎలా గెలవాలని చూస్తున్నారు. మీకు మాకు అదే తేడా.  ఏ నియోజకవర్గంలో గెలుస్తామో అని తండ్రీకొడుకులు ఇద్దరూ నియోజకవర్గం కోసం వెతుకులాడే పరిస్థితికి వచ్చేశారు. చివరకు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపురం అసెంబ్లీ సీటుకే ఎసరు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు. చంద్రబాబు తన కోడలు బ్రహ్మణీతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఆమె అక్కడ నుంచి మాట్లాడకుండా వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.  అది నిజమో కాదో కానీ  ప్రజలు అనుకుంటున్నారు. 

చివరకు నియోజవర్గాన్ని వెతుక్కునే పనిలో పడ్డ మిమ్మల్ని,  మీ ఆలోచనలు, నిర్ణయాలను బట్టే ప్రజలు కూడా మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చి 14ఏళ్లు భరించారు. ఇప్పటికైనా మీ ఉన్మాద చేష్టలను మానుకుంటే మంచిది. రాష్ట్రానికి మంచిచేసే కార్యక్రమాల్లో మీరు భాగస్వామ్యం కాకపోయినా.. కనీసం హాని చేయకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నాం’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top