దురుద్దేశంతో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

టీడీపీ హయాంతో పోలిస్తే మేం చేసిన అప్పులు చాలా తక్కువ

న్యూఢిల్లీ: ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే దురుద్దేశంతో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం జరుగుతోందన‍్నారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్న అడిగితే.. అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే అడిగినట్టుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పులు ఎక్కువగా చేశారని గుర్తు చేశారు మంత్రి. అనవసర అప్పులు ఆ కాలంలోనే ఎక్కువగా జరిగాయన్నారు.

ఎవరిని భయపెట్టాలని?:
    అసలు ఎవరిని భయపెట్టాలని ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు?. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దురుద్దేశంతో కధనాలు రాస్తున్నారు. రాష్ట్ర అప్పులపై ప్రజల్లో భయం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై కాదు. అయినా టీవీ ఛానల్స్‌ స్క్రోలింగ్స్, ఇంటర్వ్యూలు, చర్చల ద్వారా ప్రజల్లో ఒక భయం సృష్టించాలని చూశారు. అసలు ఎవర్ని పెట్టాలని ఇలాంటి కథనాలు నడిపిస్తున్నారు?.

ఆనాడు అవసరం లేకున్నా..:
    నిజానికి 2014–19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక, 2019 నుంచి ఆర్థిక సమస్యలు, ఆ తర్వాత కోవిడ్‌తో మరిన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతో నిబద్ధతతో సామాన్య మానవుడ్ని కాపాడుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ విషయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎంతో నిబద్ధతో ఉన్నారు. 
    2014–19 మధ్యలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అవసరం లేకున్నా, దేశ, రాష్ట్ర పరిస్థితులతో పోల్చుకున్నా విచ్చలవిడిగా అప్పులు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక కోవిడ్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తినడంతో, అనివార్యంగా ఇతర రాష్ట్రాలు, దేశాల మాదిరిగా అప్పు చేయాల్సి వచ్చింది. అయినా నాడు టీడీపీ ప్రభుత్వం కంటే మేము చేసిన అప్పులు చాలా తక్కువ. 

ఇతర రాష్ట్రాల కంటే తక్కువ:
    ఆంధ్రప్రదేశ్‌ అప్పులను ఒకసారి చూస్తే.. 2020లో రూ.3,07,671   కోట్లు, 2021లో రూ.3,60,333 కోట్లు, 2022లో రూ.3,98,903 కోట్లు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల అప్పులు పరిశీలిస్తే..
    కర్ణాటక 2020లో రూ.3.38 లక్షల కోట్లు, 2021లో రూ.4.1 లక్షల కోట్లు, 2022లో రూ.4.61 లక్షల కోట్ల అప్పు చేసింది. అంటే కర్ణాటక అప్పు ఏటా నికరంగా రూ.60 వేల కోట్లు పెరిగింది. 
    అదే కేరళను చూస్తే 2020లో రూ.2.67 లక్షల కోట్లు, 2021లో రూ.3.5 లక్షల కోట్లు, 2022లో రూ.3.35 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే కేరళ అప్పు కూడా ఏటా నికరంగా  రూ.45 వేల కోట్లు పెరిగింది. 
    తమిళనాడులో 2020లో రూ.4.62 లక్షల కోట్లు, 2021లో రూ.5.59 లక్షల కోట్లు, 2022లో రూ.6.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే ఆ రాష్ట్ర అప్పు ఏటా దాదాపు లక్ష కోట్లు పెరిగింది. 
    ఇక పొరుగునే ఉన్న తెలంగాణలో 2020లో రూ.2.25 లక్షల కోట్లు, 2021లో రూ.2.67 లక్షల కోట్లు, 2022లో రూ.3.12 లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే తెలంగాణ అప్పు ఏటా సగటున రూ.45 వేల కోట్లు చొప్పన పెరిగింది. 

ఇది వాస్తవం కాదా?:
    ఇంత స్పష్టంగా లెక్కలుంటే, ఏం తప్పు ఉందని.. ఏపీ అప్పులు ఎక్కువ అని అంటున్నారు?. జనాభా ప్రకారం చూసినా, స్థూల ఉత్పత్తి ప్రకారం చూసినా ఏ విధంగా అప్పు ఎక్కువ అంటున్నారు?. ఏటా తమిళనాడు అప్పు రూ.లక్ష కోట్లు, కర్నాటక అప్పు రూ.65 వేల కోట్లు, కేరళ అప్పు రూ.45 వేల కోట్లు, తెలంగాణ అప్పు రూ.45 వేల కోట్లు ఎందుకు పెరిగింది?. కోవిడ్‌ వల్ల అది అనివార్యమైంది. స్థూల ఉత్పత్తి భాగంగా చూసినట్లైతే ఇది ఏ విధంగా ఎక్కువ?. నిజం చెప్పాలంటే ఏపీ అప్పు తక్కువే అని చెప్పాలి. 

రాష్ట్రంలో అప్పులు:
    విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు 2014లో రూ.1.35 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2019 మే నాటికి అది ఏకంగా రూ.3.27 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 140% అప్పు పెరిగింది. కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (ఇౌఝఞౌunఛీ అnnu్చ∙ఎటౌఠ్టీజి ఖ్చ్ట్ఛ  ఇఅఎఖ) అయిదేళ్లకు 20%గా నమోదైంది. 
    ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చే నాటికి, అంటే 2019 మే నెలలో రాష్ట్ర అప్పు రూ.3.27 లక్షల కోట్లు ఉండగా, అది మూడేళ్ల తర్వాత రూ.4.98 లక్షల కోట్లకు పెరిగింది. అంటే సీఏజీఆర్‌ 52 శాతంగా నమోదైంది. అంటే 16% మాత్రమే పెరిగింది. అదే టీడీపీ హయాంలో 20 శాతం పెరిగిందన్నది వాస్తవం. అయినా దీనిపై టీడీపీ వాళ్లు విమర్శలు చేస్తారు. 

3% పరిమితమైన ద్రవ్యలోటు:
    ద్రవ్యలోటు గురించి టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. 2014–15లో ద్రవ్యలోటు 3.95% కాగా, 2015–16లో 3.65%, 2016–17లో 4.52%, 2017–18లో 4.12%, 2018–19లో 4.06%గా నమోదైంది. 
    2019–20లో మా ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఏడాదిలో ద్రవ్యలోటు 4.11%, 2020–21లో 5.44% నమోదు కాగా, 2021–22లో ద్రవ్యలోటును దాదాపు 3%కి తగ్గించటం జరిగింది.
    వాస్తవానికి 2014–19 మధ్య కాలంలో కోవిడ్‌ వంటి సంక్షోభం లేకపోయినా, చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల 4% ద్రవ్యలోటు  నమోదైంది. ఆ తర్వాత కోవిడ్‌ సంక్షోభంలో కూడా మా ప్రభుత్వం తీసుకున్న సమర్థ చర్యల వల్ల ద్రవ్యలోటును 3% కి పరిమితం చేశాం. 

ఇతర రాష్ట్రాల ద్రవ్యలోటు చూస్తే..:
    తెలంగాణలో ద్రవ్యలోటు 4.13% శాతం ఉండగా, తమిళనాడులో 3.5%, కర్నాటకలో 2.95%, కేరళలో 4.74%గా నమోదైంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు కేవలం 3 శాతం మాత్రమే. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, బాగుందన్నది వాస్తవం.

స్థూల ఉత్పత్తి–దేశం అప్పులు:
    దేశస్థాయిలో స్థూల ఉత్పత్తి–అప్పులను పరిగణించి చూస్తే.. 2014–15లో 50%గా ఉంటే, 2015–16లో 50%, 2016–17లో 48%, 2017–18లో 48%, 2018–19లో 48%, 2019–20లో 50%, 2020–21లో 61%, 2021–22లో 57%గా ఉంది. మరి, స్థూల ఉత్పత్తి మీద భారత దేశం అప్పు ఎందుకు పెరిగిందంటే, అందుకు కోవిడ్‌ కారణం. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అప్పులు అని అన్యాయంగా రాస్తున్నారు. 

స్థూల ఉత్పత్తి–రాష్ట్రాల అప్పులు:
    స్థూల ఉత్పత్తి మీద రాష్ట్రాల అప్పు నిష్పత్తిగా చూస్తే, ఏపీలో 2014–15లో 28%గా మొదలై 2021–22 నాటికి 32% కు చేరింది. అయితే అది కూడా తప్పంటున్నారు.
    మరి కేరళను చూస్తే.. 2014–15లో 27%తో మొదలై.. 2021–22లో 37%కి చేరింది. అంటే 10% పెరిగింది. తమిళనాడును చూస్తే 2014–15లో 18% నుంచి 2021–22 నాటికి 26%. అంటే 8% పెరిగింది. కర్నాటక 2014–15లో 18% నుంచి 2021–22 నాటికి 22%కు చేరింది. పంజాబ్‌ను చూస్తే.. 2014–15లో 31% నుంచి 2021–22 నాటికి 47.5%కి చేరగా, తెలంగాణలో 2014–15లో 16% నుంచి 2021–22 నాటికి 25%కు  చేరింది.
    అంటే తెలంగాణలో 9%, పంజాబ్‌లో 15%, తమిళనాడులో 7%, కేరళలో 9% నమోదు కాగా, కర్నాటక, ఏపీలో అది 4% మాత్రమే. అయినా దాన్ని కూడా తప్పు పడుతూ, ప్రజల్ని భయపెట్టాలని ఇలా వ్యవహరిస్తారా?.

ద్రవ్యలోటు–గణాంకాలు:
    ద్రవ్యలోటు చూసినట్లైతే.. ఏపీలో 2014–15లో రూ.20,745 కోట్లు  నుంచి 2021–22 నాటికి రూ.25,195 కోట్లకు చేరింది. హెచ్చుతగ్గులు పోయిన తర్వాత 2020–21లో రూ.55 వేల కోట్ల నుంచి 2021–22 నాటికి రూ.25,195 కోట్లకు తగ్గించడం జరిగింది.
    అదే సమయంలో కర్నాటకను పోల్చి చూసుకుంటే.. 2014–15లో రూ.20 వేల కోట్ల నుంచి 2021–22 నాటికి రూ.49 వేల కోట్లకు చేరింది. మహారాష్ట్రలో 2014–15లో రూ.32 వేల కోట్ల నుంచి 2021–22 నాటికి  రూ.89 వేల కోట్లకు పెరిగింది. తమిళనాడులో 2014–15లో రూ.27వేల కోట్లు నుంచి 2021–22 నాటికి రూ.50 వేల కోట్లకు చేరింది. తెలంగాణలో 2014–15లో రూ.9,500 కోట్ల నుంచి 2021–22 నాటికి రూ.44 వేల కోట్లకు పెరిగింది. 
    వీటన్నింటిని బట్టి ఎవరి పనితీరు బావుంది అన్నది అర్ధమవుతుంది. అయినా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వారి అసత్య  కథనాలు చూస్తే చాలా బాధ అనిపిస్తోంది.     

రెవెన్యూ లోటు–వాస్తవాలు:
    రెవెన్యూ లోటు విషయానికి వస్తే.. ఏపీకి సంబంధించి 2014–15లో రూ.13,776 కోట్లు నుంచి 2021–22 నాటికి రూ.8,500 కోట్లకు తగ్గింది.  అదే కర్నాటకలో చూస్తే.. 2014–15లో మైనస్‌ రెవిన్యూ సర్‌ప్లస్‌ (రూ.500 కోట్లు)లో ఉండగా, 2021–22 నాటికి రూ.6,200 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. మహారాష్ట్రలో 2014–15లో రెవెన్యూ లోటు రూ.12,138 కోట్లు నుంచి 2021–22 నాటికి రూ.30,700 కోట్లకు చేరింది. తమిళనాడులో రెవెన్యూ లోటు 2014–15లో రూ.6,400 కోట్ల నుంచి 2021–22 నాటికి రూ.55,000 కోట్లకు పెరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2014–15లో రెవిన్యూ సర్‌ప్లస్‌ నుంచి 2021–22 నాటికి  మైనస్‌ రూ.4,400 కోట్ల రెవిన్యూ లోటు నమోదైంది.

గర్వంగా చెప్పొకోవచ్చు:
    చంద్రబాబు చెప్పింది ఎల్లో మీడియాలో రాస్తారు.. చూపిస్తారని ఇంత అన్యాయంగా ఎలా రాస్తారు. ప్రతిరోజూ ఇదే పనిగా బురద చల్లటం ఏంటి? చంద్రబాబు హయాంలో స్థూల ఉత్పత్తి బావుందని అంటున్నారు. 2017–18, 2018–19 చూసుకున్నట్లైతే స్థూల ఉత్పత్తిలో పెరుగుదల 11%గా ఉంటే.. ఇప్పుడు 18%గా నమోదైంది. ఇంచుమించు దేశంలో బాగా పని చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా గర్వంగా చెప్పవచ్చు.

ఎల్లో మీడియా–అసత్య ప్రచారం:
    ఫైనాన్స్‌ కమిషన్‌ కొన్ని నిబంధనలు పెడితే, వాటిని అతిక్రమించారని ఎవరెవరో వచ్చి చెబుతారు. వారు ఎవరో వారి అర్హతలు ఏమిటో, దేని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారో, మాట్లాడిస్తున్నారో వాటిని ఏ విధంగా పత్రికలు ప్రచురిస్తున్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తోంది. 
    14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు స్థూల ఉత్పత్తిలో 3% వరకే అప్పులు చేయాల్సి ఉంది. కానీ 2021–22లో 5.5% అప్పులు చేశారని, అది ఎక్కువ అంటున్నారు. ఆరోజు నిబంధనల ప్రకారం 5% వరకు అప్పులు చేయెచ్చు. కానీ 0.6% ఎక్కువ అప్పు చేశాము. అది వాస్తవమే. కానీ 2016–17లో అప్పుల పరిమితి స్థూల ఉత్పత్తిలో 3% మాత్రమే కాగా, 4.42% అప్పు ఎక్కువ చేశారు. మరి అది కరెక్టా? కోవిడ్‌ సమయంలో 0.6% అప్పు ఎక్కువ చేశామని ప్రశ్నిస్తున్న వారు.. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేని 2016–17లో 1.42% ఎక్కువ అప్పు చేశారు. అయినా దాన్ని గుర్తు చేయరు. ఇది ఎంత అన్యాయమో చూడండి. 

ఎక్కువ వడ్డీ రేటుకు తెస్తున్నామా?:
    ఇటీవల అప్పులు ఎక్కువ వడ్డీకి తెస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. 2014–15లో సగటున 8.49%, 2015–16లో 8.28%, 2016–17లో 7.45%, 2017–18లో 7.46%, 2018–19లో 8.46%కి అప్పు తెచ్చారు. 2019–20లో టీడీపీ ప్రభుత్వం ఏప్రిల్‌–మే దాదాపు 8 శాతానికి అప్పు తెస్తే.. 2019 మే నెలలో శ్రీ జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వడ్డీని 7.2%కి తగ్గించాం. 
    ‘అంటే మా మీద నమ్మకం లేకపోవటం వల్లనే మాకు ఒక్క శాతానికి తక్కువకు అప్పు ఇచ్చారు. మీ మీద నమ్మకం ఉండటం వల్లనే ఒక శాతానికి అప్పు ఎక్కువ ఇచ్చారా?’.. ఇంకా చెప్పాలంటే మధ్యలో ఆ ఒక్క శాతం మీరు ఏమైనా కొట్టేశారా అని అడ్డగోలుగా అడగొచ్చు కూడా. ఏమైనా అర్థం ఉందా? ఏదైనా మాట్లాడేటప్పుడు గణాంకాలు ఉండాలి. 

ఇది కూడా తప్పేనా?:
    2018–19లో స్థూల ఉత్పత్తి రూ.9.18 లక్షల కోట్లు ఉన్నప్పుడు అప్పు రూ.38,283 కోట్లు. కోవిడ్‌ తర్వాత 2021–22లో స్థూల ఉత్పత్తి రూ.12 లక్షల కోట్లుగా ఉంటే, చేసిన అప్పు రూ.40 వేల కోట్లు. అంటే అది 3 శాతం పరిమితికి లోబడి చేసింది. అయినా దాన్ని కూడా తప్పు పడుతూ, దుష్ప్రచారం చేస్తున్నారు. 

కాగ్‌ నివేదికపైనా విమర్శలా?:
    కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి డీడీఓ కోడ్‌లు మారాయి. అందువల్లే కాగ్‌ రిపోర్టు ప్రచురించలేదు. ఇది కూడా విష ప్రచారమే. 
ఏది పడితే అది మాట్లాడతారు. మావైపు దున్నపోతు ఈనితే గాడికి కట్టేయ్‌ పో అన్నట్లుంది. దున్నపోతు అసలు ఈనుతుందా. సీఏజీ రిపోర్టు ఇవ్వలేదు అంటారు. సీఏజీ రిపోర్టు కానీ సీబీఐ కానీ కేంద్రం కానీ మీకు అనుకూలంగా చెబితే మంచిది. కేంద్రం, సీబీఐ మీకు అనుకూలం కాకపోతే వద్దు అంటారు. సీఏజీ ఏపీది మాత్రమే పెట్టడం లేదా? 30 రాష్ట్రాలకు సంబంధించి ఏపీ మాత్రమే పెట్టదా. ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు అర్థం ఉండొద్దా? 
    కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి డీడీఓ కోడ్‌లు మారాయి కాబట్టి.. డీడీఓ కోడ్‌లు ఫైనల్‌ చేసేవరకు కాగ్‌ రిపోర్టు ప్రచురించలేదు. ఎంత అన్యాయమో చూడండి. దాన్ని కూడా తప్పు చేశామంట. 

ఆ అప్పు ఎందుకు రాలేదంటే..:
    రూ.17 వేల కోట్ల అప్పు రాకుండా పోయిందట. అప్పు రాకుండా పోయేది ఏముంటుంది? ఇలాగే అన్యాయమైన ఆరోపణ చేశారు. దీనికి కారణం 2014–19 మధ్య చేయాల్సిన అప్పు కన్నా ఎక్కువ అప్పు టీడీపీ చేసింది కాబట్టి అది రాలేదు. రూ.16,500 కోట్లు చంద్రబాబు హయాంలో ఎక్కువ చేసింది. 

రూ.48 వేల కోట్లకు లెక్క లేదా?:
    ఇప్పటికే ఎన్నోసార్లు అడిగాను. రూ.480లు నా డబ్బులు మీ ఖాతాలో పడ్డా, మీ డబ్బులు నా ఖాతాలోకి వచ్చినా బ్యాంకు వెంటనే సరి చేస్తుంది. రూ.48 వేల కోట్లు కనపడకుండా పోయాయంటే అందరూ కళ్లు మూసుకొని కూర్చుంటారా. దానికి 15 రకాల లిస్టు ఇచ్చాము. అదీ టీడీపీ చేసిన పాపమే. శాప్, సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ మాడ్యుల్‌ పెట్టడం వచ్చిన సమస్యలే. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ వల్ల పీడీ అకౌంట్స్‌ ఫండ్స్‌ మార్చి 31కి వాటిని రివర్స్‌ చేస్తారు. రూ.10వేల కోట్లు. ఈ–కుబేర్‌లో ఒకసారి రైతు భరోసా అప్‌లోడ్‌ చేసినప్పుడు అదీ రీరివర్స్‌ అయింది. రెండు ఎంట్రీలతో రూ.2722 కోట్లు. ఒక కార్పొరేషన్‌ నుంచి మరో కార్పొరేషన్‌కు మార్చినందుకు రూ.10వేల కోట్లు. రూ.48 వేల కోట్లకు 15 హెడ్‌ ఆఫ్‌ అకౌంట్ల కింద వివరాలు ఇస్తే సీఏజీ అనుమతి ఇచ్చింది. దానిపై ఇప్పుడు టీడీపీ మౌనంగా ఉంది. అన్నీ సెల్ఫ్‌ గోల్స్‌ వేసుకున్నారు. సెల్ఫ్‌ గోల్స్‌ వేసుకోవటం మీడియా ద్వారా విష ప్రచారం చేస్తారు. 

టీడీపీ సెల్ప్‌ గోల్‌:
    అంతెందుకు ఇటీవల రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఒక ప్రశ్న వేశారు. కేంద్రానికి తెలియకుండా రాష్ట్రం రూ.1.10 లక్షల కోట్లు అప్పు చేసిందా అని ఆయన రాజ్యసభలో అడిగారు. దానికి కేంద్రం సమాధానం ఇస్తూ.. 2014–19 మధ్యలో రూ.1.62 లక్షల కోట్ల అప్పుకు రూ.51 వేల కోట్లు మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారని మిగతా మొత్తానికి లెక్కలు లేవని సమాధానం ఇచ్చింది. 

చంద్రబాబు–విపరీత పబ్లిసిటీ:
    గతంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పినట్లు.. పి.వి.సింధుకి బ్యాడ్మింట్, సచిన్‌ టెండుల్కర్‌కి క్రికెట్, అమెరికన్లకు ఇంగ్లీషు నేర్పించిందీ చంద్రబాబే. ఏదైనా సరే.. మీడియాలో చంద్రబాబుకు రుణపడి ఉండండి అన్నట్లు ప్రచారం చేస్తారు. ఎదుటివారిపై బురద జల్లటమైనా, ఏదైనా విషయంలో గొప్పతనమైనా చంద్రబాబే అన్నట్లు మీడియాలో ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు రాకముందు ఇంగ్లీషు లేదు.. ఆయన వచ్చిన తర్వాతే బ్రీఫ్డ్‌ మీ అని నేర్చుకున్నామట. అంతవరకు మనకు బ్రీఫ్డ్‌ మీ అన్నది రాదు. 

ఐటీలో ఏపీ వెనకబాటుకు చంద్రబాబే కారణం:
    చివరకు కంప్యూటర్‌ రంగంలో ఏపీ వెనకబడింది. కంప్యూటర్లు స్టార్ట్‌ అయినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలే కంప్యూటర్‌ ప్రోగ్రామర్లను వాడేవారు. ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వాడేవారు. మనకంటే ముందు కర్నాటక, తమిళనాడు ముందున్నాయి. చంద్రబాబు కంప్యూటర్‌ కనిపెట్టి బిల్‌గేట్స్‌కు నేర్పించినట్లు మాట్లాడతారు. 
    చివరకు సత్య నాదెళ్లకు కంప్యూటర్‌ చదువుకోమని చంద్రబాబు చెప్పారంట. ఇదెంత అన్యాయం. ఐటీ అంటే.. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కాదు.. ఇన్‌కంట్యాక్స్‌ అని చంద్రబాబు భావించే రోజుల్లోనే సత్యనాదెళ్ల అమెరికాలో పని చేస్తున్నారు.

    మనం ఐటీలో ఎందుకు వెనుకబడ్డామో ఓ ఉదాహరణ..
కెఎస్‌ఆర్‌టీసీ రెండు కోట్ల ఐటీ ఆర్డర్‌ను రూ.20 లక్షల చొప్పన బిట్లు బిట్లుగా చేయటం వల్ల 10 సంస్థలు ఏర్పాటయ్యాయి. అదే చంద్రబాబైతే రూ.8–10 కోట్ల ఆర్డర్‌ చేసి టైలర్‌మేడ్‌ చేసి నచ్చిన వారికి పెట్టి సంస్థలు పెరగకుండా చేశారు. ఇది వాస్తవం. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, సాప్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా రెండు సంస్థలు చేతిలో పెట్టుకొని ఆనాడు ఎవ్వరూ పెరగకుండా చేశారు. హైటెక్‌ సిటీ రహేజా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో పెట్టారు. ఇలా ఏ ఇతర రాష్ట్రాల్లోనూ జరగలేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి భూమి ఇవ్వాలి కానీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ద్వారా పెట్టింది ఎక్కడా లేదు. 
    దేశంలో ఐటీ ఎగుమతుల్లో కర్ణాటక వాటా 40–50% ఉందంటే వారి ప్రోత్సాహం. ఆరోజున కర్నాటక సీఎంగా జె.హెచ్‌.పటేల్‌ ఉన్నారు. ఆయనకు కంప్యూటర్‌ గురించి తెల్సా? అంతకు ముందు ఎంతెంతో పెద్దలు కర్నాటక సీఎంగా ఉన్నారు. 10% ఐటీ ఎగుమతులు ఉండే ఏపీ చంద్రబాబు వల్లే పెరిగితే.. 50% ఉండే కర్నాటకలో ఎవరి వల్ల ఐటీ ఎగుమతులు పెరిగినట్లు. 15% ఐటీ ఎగుమతులు ఉండే గుర్‌గావ్‌ ఎవరి వల్ల పెరిగినట్లు? 15% వాటా ఉండే తమిళనాడులో ఐటీ ఎగుమతులు ఎవరి వల్ల పెరిగినట్లు. మొన్న కేసీఆర్‌ గారు మాట్లాడుతూ.. సైబర్‌ టవర్స్‌కు పునాది వేసింది నేదురమల్లి జనార్థన్‌ రెడ్డి గారు. ఇవాళ మొత్తం చంద్రబాబే అన్నట్లు మాట్లాడతారు. 

ఎనర్జీ సెక్టర్‌–డిస్కమ్‌ల అప్పులు:
    ఎనర్జీ సెక్టార్‌ విషయానికి వస్తే.. 2014–15లో గవర్నమెంట్‌ డిమాండ్‌ రూ.4,100 కోట్లైతే ప్రభుత్వం డిస్కంలకు కట్టింది రూ.3,950 కోట్లు. 2015–16లో గవర్నమెంట్‌ డిమాండ్‌ రూ.5,300 కోట్లైతే ప్రభుత్వం డిస్కంలకు రూ.4500 కోట్లు కట్టింది. 2016–17లో గవర్నమెంట్‌ డిమాండ్‌ రూ.6,500 కోట్లైతే ప్రభుత్వం డిస్కంలకు కట్టింది రూ.4,000 కోట్లు. 2018–19లో గవర్నమెంట్‌ డిమాండ్‌ రూ.9,600 కోట్లైతే.. ప్రభుత్వం డిస్కంలకు కట్టింది రూ.3,500 కోట్లు. (2014–19) ఐదేళ్లకు కలిపి టీడీపీ హయాంలో డిస్కంలకు ప్రభుత్వం కట్టింది రూ.20 వేల కోట్లు.  
     శ్రీ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019–20లో డిమాండ్‌ రూ.12,000 కోట్లైతే, ప్రభుత్వం డిస్కంలకు కట్టింది రూ.17,000 కోట్లు. 2020–21లో డిమాండ్‌ రూ.15,000 కోట్లైతే కట్టింది రూ.11,000 కోట్లు. 2021–22లో డిమాండ్‌ రూ.13,400 కోట్లైతే కట్టింది రూ.14,400 కోట్లు. మూడేళ్లలో రూ.44 వేల కోట్లు డిస్కంలకు కట్టడం జరిగింది. ఇవాళ విద్యుత్‌ అంటే చంద్రబాబు. చంద్రబాబు అంటే విద్యుత్‌ అట. అప్పుల విషయంలోనూ.. 2014–15లో రూ.31,500 కోట్ల అప్పుల్ని ఐదేళ్లలో రూ.62,500 కోట్లకు పెంచారు.  

పారిశ్రామిక రంగం:
    పరిశ్రమలు ఏవీ రాలేదని దుష్పప్రచారం చేస్తున్నారు. 2019–22కి లార్జ్‌ అండ్‌ మీడియం స్కేల్‌ పెట్టుబడులు రూ.13,200 కోట్లు వచ్చాయి. అదే చంద్రబాబు హయాంలో రూ.11–12 వేల కోట్లు వచ్చాయి. స్టార్టప్స్‌ విషయంలో ఏపీ నెంబర్‌ వన్‌ అని కేంద్రమే చెప్పింది. జనవరి – మార్చి మధ్యలో ఏపీలో రూ.19,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మన తర్వాత మహారాష్ట్ర రూ.11,800 కోట్లు, గుజరాత్‌ రూ.6,400 కోట్లు, కర్నాటక రూ.2,300 కోట్లు, తమిళనాడు రూ.1500 కోట్లు, తెలంగాణ రూ.300 కోట్లు. ఏ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇవి కూడా పార్లమెంట్‌లో మేమే చెప్పి రాయించుకున్నామా అని బుగ్గన ప్రశ్నించారు. 

స్టార్టప్స్‌:
    స్టార్టప్స్‌ విషయంలోనూ ఏపీ ముందంజలో ఉంది. చంద్రబాబు హయాంలో 268 స్టార్టప్స్‌ ఏర్పాటైతే.. శ్రీ జగన్‌ వచ్చిన తర్వాత 869 స్టార్టప్‌లు వచ్చాయట. 

ఉద్యోగాల కల్పన:
    నిరుద్యోగం విషయంలోనూ ఏపీలో అత్యధిక తక్కువగా 100 మందిలో 4.4 గురు మాత్రమే నిరుద్యోగులున్నారని సెంటర్‌ ఫర్‌ మానిటర్‌ ఇండియన్‌ ఎకానమీ తెలిపింది. హర్యానా, రాజస్థాన్, అస్సాం, జమ్ము కశ్మీర్, బీహార్, సిక్కిం, జార్ఖండ్, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, కేరళలో మనకంటే నిరుద్యోగం ఎక్కువ ఉంది. అయినా తెలుగుదేశం నాయకులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.

ఇవన్నీ విజయాలు కావా?:
    వరుసగా మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌.  అయినా విమర్శలు చేస్తారు. 
    ఇక రోడ్ల విషయానికి వస్తే 2014–19 మధ్యన రూ.25,213 కోట్లు ఖర్చు చేసి 28,936 కి.మీ చేశారు. 2019–22 మధ్య రూ.21,226 కోట్లు ఖర్చు చేసింది. అయినా అన్యాయంగా విమర్శలు చేస్తారు. 
    పౌరసరఫరాల పీడీఎస్‌ బియ్యం, ఇతర వస్తువుల సరఫరాలోనూ మూడు రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఏపీ ఉంది. రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్‌ ఉంది. ఉత్తర ప్రదేశ్‌కు ఏపీకి మధ్య 0.1% మాత్రమే. 
    పోలవరం ప్రాజెక్టు చేతికి రావాలని 2013 రేట్లకే కడతామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకొన్నారు. ఎలా కడతారు. ఇప్పటికీ పోలవరం సమస్యల్లో పెట్టారు. దాన్ని సరిచేస్తున్నాం.
    ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు రాష్ట్రంలో ప్రగతే లేదని విమర్శలు చేస్తున్నారు. శ్రీ జగన్‌ గారు సీఎం అయ్యాక రూ.25 వేల కోట్ల ఖర్చుతో భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం నాలుగు పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నారు. రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలకు అదనంగా రూ.14 వేల కోట్లతో 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాము. 14 వైరాలజీ ల్యాబ్‌లు, 40 వేల మంది వైద్య ఆరోగ్య శాఖలో తీసుకోవటం జరిగింది. 

ఆ పుస్తకం చదవండి:
    ఉద్యోగులు ఒక్కసారి చంద్రబాబు ‘మనసులో మాట’ పుస్తకాన్ని చదవాలి.
    చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో శాశ్వత ఉద్యోగాలు వద్దు అని రాశారు. చంద్రబాబు చెప్పినట్లైతే.. సెక్రటేరియట్‌ ఉద్యోగాలు, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు తీసుకోవటం తప్పు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగులు అంతా చంద్రబాబు మనసులో మాట పుస్తకం చదవాలి. అందులో శాశ్వత ఉద్యోగాలు వద్దు. కాంట్రాక్టే ముద్దు అని చంద్రబాబు పుస్తకంలో రాశారు. పైగా 60% ఉద్యోగులు అవినీతి పరులని చంద్రబాబు మనసులో మాట పుసక్తంలో రాశారు. ప్రాజెక్టులు కడితే లాభం లేదు అట. ప్రాజెక్టులో రూ.1,094లు ఖర్చు అయితే.. రూ.60లు మాత్రమే రాబడి వస్తాయట. సబ్సిడీలు పులి మీద సవారీ అట. వద్దే వద్దు అట. పైగా ఎన్టీఆర్‌ రూ.2లు ఉచిత బియ్యం ఇచ్చినా ఓడించారు కాబట్టి వద్దే వద్దు అన్నారు. ఉచిత సేవలు వద్దే వద్దని చంద్రబాబు తన మనసులోని మాట పుస్తకం ద్వారా చెప్పారు.

బాబు గొప్పలు అంతా ఇంతా కాదు:
    చంద్రబాబు ఉన్నట్లైతే హుద్‌హుద్‌ వచ్చేది కాదని.. కోవిడ్‌ భయపడి వచ్చేది కాదట. కెప్టెన్‌ పట్టాభి ద్వారా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో మానిటర్‌ చేస్తాడంట. ఇలాంటివి కూడా ఆయన అనుకూల మీడియా రాయాలి కదా.
    రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొని సామాన్య మానవుడికి చక్కటి పరిపాలన అందిస్తున్నాం. ప్రతిపక్షాలు ఏవైనా సలహాలు ఇవ్వండి తప్ప అన్యాయమైన ఆరోపణలు చేయెద్దు. ఈ ఆరోపణల ద్వారా ఏపీకి చెడ్డపేరు తీసుకురావొద్దని బుగ్గన రాజేంద్రనాథ్‌ సూచించారు. 

    పోలవరం ప్రాజెక్టును 2009 నాటి నిర్మాణ సామాగ్రి (క్వాంటిటీ) ధరలకే చేస్తామని చంద్రబాబు ఒప్పుకున్నారు. దాని వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 
    ఏపీఎస్‌డీసీ రుణంపై చట్టం చేయటం జరిగింది. ఇందులో దాపరికం ఏమీ లేదు. ఆ చట్టంలో వచ్చే ఆదాయంతో రైతు భరోసా, ఆసరా, చేయూత, అమ్మ ఒడి నాలుగు పథకాలకు వాడతామని చెప్పటం జరిగింది. సిండికేట్‌ ద్వారా అమ్మాల్సిన ఎంఆర్‌పీ కన్నా అమ్మేవారు. కానీ దాన్ని చట్టపరంగా ఒక ఆదాయంగా తీసుకొచ్చి ఈ నాలుగు స్కీంల కిందకు తేవటం జరిగింది. 

ఏ తప్పు చేయలేదు:
    ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదు. స్థూల ఉత్పత్తిలో 25% దాటితే ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం ఉల్లంఘన. కానీ కేంద్రం 50% దాటింది. కేంద్రానికి వేరు బాధ్యతలు ఉంటాయి. కేంద్రం అవసరమైతే నగదు ముద్రిస్తుంది. రాష్ట్రం ఆ పని చేయలేదు. కేంద్రానికి అప్పుల మీద పరిమితి లేదు. రాష్ట్రాలకు ఉంది. కోవిడ్‌ సమయంలో రాష్ట్రాలూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మన రాష్ట్రం ఉద్దేశపూర్వకంగా ఏ తప్పూ చేయలేదు. చట్టం ప్రకారం మత్తు పదార్థాల మీద ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆ డబ్బుతో ఒక అప్పు చేసి.. రైతు భరోసా, ఆసరా, చేయూత, అమ్మ ఒడి వంటి నాలుగు పథకాలు అమలు చేస్తామని చట్టం చేశాము. 
    ఇప్పుడు రూ.1.17 లక్షల కోట్ల రుణాలు తప్పు అంటే.. 2019కు ముందు రూ.65 వేల కోట్లకు టీడీపీ ప్రభుత్వమూ గ్యారంటీలు ఇచ్చారు. మరి దాని సంగతేంటి?

ఇదీ మా అభ్యర్థన:
    సమాఖ్య వ్యవస్థలో కొన్ని అధికారాలు కేంద్రం వద్ద ఉంటాయి. మేము ఎక్స్‌ట్రా పన్ను (ఏపీఎస్‌డీసీ) మీద మాత్రమే అప్పు చేశాం. అది సరికాదని కేంద్రం అంటోంది. కాబట్టి మా అభ్యర్థన ఏమిటి అంటే.. ఆ పన్నే తీసుకురాకపోతే మాకు ఆదాయమే ఉండదు కదా. కాబట్టి కోవిడ్‌ పరిస్థితుల్లో మాకు వెసులుబాటు కల్పించాలని కోరాం. 
    ఇప్పటికైనా ప్రతిపక్షం ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం మానుకుని, తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రం విషయంలో పరస్పరం సహకరించుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరుతున్నాం.

Back to Top