అప్పులపై ఎల్లోమీడియా దుష్ప్రచారం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ప్రభుత్వంపై టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం

గత ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితం 

మేం వచ్చాక పాత బకాయిలను చెల్లిస్తూ వస్తున్నాం

 అమరావతి: అప్పులపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల అప్పులు, బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలను చెల్లిస్తూ వస్తోందని తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

యనమల–అవాస్తవాలు:
    రెండు రోజుల క్రితం రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక పత్రికా ప్రకటన చేశారు. అందులో అన్నీ అవాస్తవాలే. ఏ నివేదిక తీసుకున్నా, అందులో తమకు అనుకూలమైన అంశాన్ని తీసుకుని ఒక ప్రకటన చేస్తున్నారు. గత ప్రభుత్వం దిగిపోతూ, మొత్తం రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు పెట్టి పోయారు. చివరకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి పోయారు. కరెంటు బిల్లులు కూడా ఇవ్వకుండా బకాయిపెట్టి పోయారు. ఇక పౌర సరఫరాల శాఖలో కూడా వేల కోట్ల అప్పులు, బకాయిలు వదిలిపెట్టి పోయారు. యనమల ప్రకటనలో ఒక్క వాస్తవం లేదు.

సున్నా వడ్డీ. పంట రుణాలు–వాస్తవాలు:
    గతంతో తాము ఇచ్చినట్లు సున్నా వడ్డీ, పావలా వడ్డీని సక్రమంగా అమలు చేయడం లేదని యనమల విమర్శించారు. ఇది దారుణం. వాస్తవానికి వారు సున్నా వడ్డీ, పంట రుణాల బకాయిలు 39.06 లక్షల రైతులకు సంబంధించి బకాయి పెట్టిన మొత్తం ఏకంగా రూ.784.71 కోట్లు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. 2019–20లో రూ.96.43 కోట్లు. 2020–21కి సంబంధించి రూ.688.28 కోట్లు.. అలా మొత్తం పెండింగ్‌లో పెట్టి పోయారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఖరీఫ్‌కు సంబంధించి రూ.289.66 కోట్లు, అదే ఏడాది రబీకి సంబంధించి దాదాపు రూ.2007 కోట్లు చెల్లించాం. ఇంకా 2020–21 ఖరీఫ్, రబీకి సంబంధించిన సున్నా వడ్డీ రాయితీని ఈనెల చెల్లించాల్సి ఉంది. 
    ఖరీఫ్‌ 2019. రబీ 2019–20, 2020–21 ఖరీఫ్‌ మూడు సీజన్లకు సంబంధించి 26.57 లక్షల రైతులకు రూ.497 కోట్లు కడుతున్నాం. పాత బకాయిలు కూడా రూ.744 కోట్లు కడుతున్నాం. అదే విధంగా 2020–21 లో ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి కూడా కట్టబోతున్నాం. వారు పెండింగ్‌లో పెట్టిన బకాయిలతో పాటు, అప్‌డేట్‌ చేయడం కోసం ఎప్పటికప్పుడు అన్నీ కడుతున్నాం.

ఇన్‌పుట్‌ సబ్సిడీ–కౌలు రైతులు:
    అదే విధంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ. రూ.1795.45 కోట్లు విడుదల చేశాం. 2019–20లో రూ.116 కోట్లు, 2020–21లో రూ.932 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.746 కోట్లు మొత్తం విడుదల చేయడం జరిగింది.
    ఇంకా కౌలు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇంత వరకు 8.76 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల ఇచ్చి, బ్యాంకుల ద్వారా రూ.5915 కోట్ల పంట రుణాలు ఇప్పించాం. అయినా అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు.

ఆ మీటర్లు ఇందు కోసం..:
    ఏమైనా అంటే, వ్యవసాయానికి మీటర్ల బిగింపును ప్రస్తావిస్తున్నారు. అవి ఎందుకంటే, వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌కు సంబంధించి డిస్కమ్‌ల వద్ద  ఎలాంటి లెక్కలు లేవు. అంచనాలు కూడా దొరకడం లేదు. దీంతో డిస్కమ్‌లకు 20 శాతానికి పైగా ఎఫీషియన్సీ లాస్‌ కనిపిస్తోంది. దాన్ని మొత్తం ఫ్రీ కింద రాస్తున్నారు.
    అయితే వాస్తవంగా దాని వల్ల నష్టం జరుగుతోందా? సరఫరా విధానంలో లోపం ఉందా? అనేది తెలియడం లేదు. అందుకే వారు మీటర్లు పెడితే, అన్నింటికీ పక్కాగా లెక్క తేలుతుందని భావిస్తున్నారు. అంత లాస్‌ వస్తున్నా వారు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు మాత్రం బిల్లుల కడుతూనే ఉన్నారు. ఆ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వల్ల నష్టం ఎక్కడ జరుగుతోందన్న విషయం తెలుస్తుంది. అయినా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.

ఆరోగ్య సూచిక–వాస్తవం:
    జాతీయ ఆరోగ్య సూచికలో 2017–18లో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో ఉండగా, ఇవాళ 10వ స్థానంలో ఉందని యనమల తన ప్రకటనలో పేర్కొన్నారు. కానీ అది పచ్చి అబద్ధం. వాస్తవానికి 2019–20లో మన రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. అప్పుడు మనకు వచ్చిన స్కోర్‌ 69.95. అదే 2017–18లో మనకు వచ్చిన స్కోర్‌ 65.13 మాత్రమే. అంటే అప్పటి కంటే మార్కులు, స్కోర్‌ పెరిగాయి. మనం 4వ స్థానంలో ఉన్నాం. అయితే కొన్ని రాష్ట్రాల మార్కులు ఎక్కువ పెరిగాయి. వాటితో పోల్చి, మనం 10వ స్థానంలో ఉన్నామని అన్యాయంగా విమర్శలు చేశారు.
    సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ)లో 2018–19లో టీడీపీ హయాంలో మన మార్కులు 68 కాగా, ఇవాళ 2020–21లో 77 మార్కులు వచ్చాయి. అయినా పచ్చి అబద్ధాలు చెబుతూ, విమర్శలు చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ ఓ రికార్డ్‌:
    ఇక ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందడం లేదని కూడా యనమల ఆరోపించారు. ఇవాళ నిజానికి ఆరోగ్యశ్రీలో ఏకంగా 3255 చికిత్సలకు సేవలందుతున్నాయి. అదే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 వైద్య చికిత్సలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు బోన్‌ మ్యారో వంటి చికిత్సలు కూడా చేర్చడం జరిగింది. పైగా వారు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి పోయారు.
    ఆరోగ్యశ్రీ పథకంలో 2021–22లో 8,94,636 మందికి రూ.1920 కోట్లతో వైద్య సేవలు అందించాం. 2022–23లో ఇప్పటికే 6,81,527 మందికి రూ.1477 కోట్లతో వైద్య సేవలు అందించాం.
    ఇంకా సీఎం రిలీఫ్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. నిజానికి టీడీపీ హయాంలో బ్రోకర్లు యథేచ్ఛగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ దోచుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో 3255 చికిత్సలు ఉన్నాయి కాబట్టి, పథకంలో లేని చికిత్సలకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సహాయం చేయాలని సీఎంగారు నిర్దేశించారు. అలాంటప్పుడు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తోంది?.

108. 104 సర్వీసులు:
    ఇక 108, 104 సర్వీసులు. మృతదేహాలను ఎక్కడైనా వాటిలో తీసుకుపోతారా? 108 సర్వీస్‌ అత్యవసర చికిత్స కోసం, 104 సర్వీస్‌ వైద్య పరీక్షల కోసం వినియోగిస్తారు. మృతదేహాలను తీసుకుపోయేందుకు వేరే వాహనాలు ఉన్నాయి.
    ఇంకా ఆ సర్వీసులు కూడా చూస్తే.. టీడీపీ హయాంలో 108 సర్వీస్‌ల కోసం 292 డొక్కు, టెర్లు, ట్యూబులు లేని అంబులెన్సులు ఉండగా, మా ప్రభుత్వం వచ్చాక కొత్తవి 432 అంబులెన్సులు కొన్నాం. అదే విధంగా 104 సర్వీస్‌ల కోసం 676 అంబులెన్సులు కొన్నాం. రెండూ కలిపి 1108 కొత్త వాహనాలు కొని, సేవలందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో ఇంటింటికీ డాక్టర్‌ వెళ్తున్నారు.
    ఇక మహా ప్రస్థానం వాహనాలు. ఒక్కో ఆస్పత్రికి 4 ఉన్నాయి.
ఇంకా గ్రామ స్థాయిలో అత్యంత మెరుగైన వైద్య సేవలు అందుతున్నా, టీడీపీ అర్ధం లేని విమర్శలు చేస్తోంది. నాడు–నేడు కింద సమూల మార్పులు చేస్తున్నాం.

హెల్త్‌ క్లినిక్స్‌. ఆస్పత్రులు:
    వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు రూ.1692 కోట్లతో 10,032 ఏర్పాటు చేస్తున్నాం. రూ.670 కోట్ల వ్యయంతో పీహెచ్‌సీల్లో సమూల మార్పులు చేస్తూ, మొత్తం 1126 కడుతున్నాం. అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు. రూ.402 కోట్లతో 184 కట్టాం. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రుల (ఏహెచ్‌) కోసం రూ.1223 కోట్లు ఖర్చు చేశాం. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం ఏకంగా రూ.12,268 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
    గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల అభివృద్ధి, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, క్యాన్సర్‌ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది.

విద్యా రంగం:
    ఇక విద్యా రంగం. దీనిపైనా అవాస్తవాలే చెబుతున్నారు. టీడీపీ హయాంలో హయాంలో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 6 శాతం నుంచి 8 శాతం పెరిగిందట. అది ఇప్పుడు లేదని విమర్శిస్తున్నారు.
    కానీ వాస్తవాలు చూస్తే.. 2014–15లో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లలో చేరుతున్న విద్యార్థుల సగటు సం«ఖ్య చూస్తే, ఆనాడు 81.96 శాతం కాగా, ఇవాళ అది 94.87 శాతం. ఇది నాడు–నేడు కార్యక్రమం ద్వారా సా«ధ్యమైంది. నాడు–నేడు ద్వారా స్కూళ్లలో సమూల మార్పులు చేస్తున్నాం.

మూడేళ్లలో రూ.53 వేల కోట్లు:
ఇంకా వివిధ పథకాల ద్వారా విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. పథకాల వారీగా చూస్తే..
అమ్మ ఒడి కింద ఇప్పటి వరకు రూ.19,617 కోట్లు, విద్యాదీవెన కింద రూ.8,365 కోట్లు, వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు, గోరుముద్ద కింద రూ.3,117 కోట్లు, విద్యా కానుక కింద రూ.2,324 కోట్లు, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ కింద రూ.4,895 కోట్లు. ఇంకా మనబడి నాడు–నేడు తొలి దశ కింద రూ.3,699 కోట్లు, రెండో దశ కింద మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అంటే మొత్తం ఈ మూడేళ్లలో విద్యా రంగంపై రూ.53,337 కోట్లు ఖర్చు చేశాం. 
    ఇది గతంలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? అదే విధంగా ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఏకంగా 94 శాతం. అయినా దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

తమకు అనుకూలంగా యనమల లెక్కలు:
    ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం 2017తో పోలిస్తే 2021లో విద్యా రంగంపై ప్రభుత్వం తక్కువ వ్యయం చేసిందని యనమల ఆరోపించారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఏదీ సగటు తీసుకోడు. వారి పాలనలో బెస్ట్‌ ఫిగర్‌ ఉన్నది తీసుకుంటాడు. మనకు సంబంధించి కోవిడ్‌ పీరియడ్‌ను తీసుకుని లెక్కలు చెబుతాడు.
    అదే విధంగా స్థూల ఉత్పత్తిలో కూడా పెరుగుదలకు సంబంధించి, తనకు ఏది సూటబుల్‌ (కరెంటు, కాన్‌స్టాంట్‌) అయితే అది చూపుతాడు. మనకు సంబంధించి చెప్పినప్పుడు కాన్‌స్టాంట్‌ చూపి చెబుతాడు. ఎందుకంటే కరెంటు అనేది అప్పటికప్పుడు ఉంటుంది. అలా కోవిడ్‌ ఏడాదిని చూపి, విమర్శలు చేశారు.

వారే స్కూళ్లు మూసేశారు:
    మేము స్కూళ్లు ఎత్తివేశామని ఆరోపించారు. కానీ ఆ పని చేసింది వారు. టీడీపీ హయాంలో 2017లో వారు 2906 స్కూళ్లు మూసివేశారు. అందులో 1759 ప్రైమరీ స్కూళ్లు కాగా, 1147 మిగిలిన స్కూళ్లు.
    అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో కొత్తగా 87 స్కూళ్లు ఏర్పాటు చేశాం. అదే విధంగా 2020–21లో మరో 123 కొత్త స్కూళ్లు ప్రారంభించాం. మేము ఒక్క స్కూల్‌ కూడా మూసివేయలేదు.

అమ్మ ఒడి. తల్లులకు:
    అమ్మ ఒడి. 82 లక్షల పిల్లలకు ఇవ్వాలి కదా? కేవలం 43 లక్షల పిల్లలకే ఇస్తున్నారని యనమల ప్రశ్నించారు. ఈ పథకంలో డబ్బులు ఇస్తోంది తల్లులకు. అందుకే పిల్లల సంఖ్య చెప్పకుండా, తల్లుల సంఖ్యను చెబుతున్నాం. ఇంకా రూ.15 వేలల్లో రూ.2 వేల తగ్గిస్తున్నారని ఆరోపించారు. అది దేని కోసం తీసుకుంటున్నారు. కేవలం స్కూల్, టాయిలెట్ల నిర్వహణ కోసమే కదా?

జీఎస్‌డీపీపైనా తప్పుడు లెక్కలే:
    ఇంకా రాష్ట్ర స్థూల ఉత్పత్తి. జీఎస్‌డీపీ. వారి హయాంలో ఘనంగా రూ.6,80,332 కోట్లు సాధిస్తే, ఈ ప్రభుత్వ హయాంలో అది రూ.6,26,000 కోట్లు మాత్రమే అని చెబుతున్నారు. అసలు జీఎస్డీపీ అనేది ఏదైనా 9 నెలల ముందస్తు అంచనా వేస్తారు. ఆ తర్వాత మూడు సార్లు రివైజ్జ్‌ అంచనాలు వేస్తారు. అంటే రెండేళ్ల తర్వాత యాక్చువల్‌ ఫిగర్స్‌ వస్తాయి. అది కూడా ఎలా? కేంద్ర ప్రభుత్వ గణంకాల శాఖ ఇస్తుంది. అయితే ఏం తెలియనట్లు చాలా అన్యాయంగా ఆ ఫిగర్స్‌ చెబుతున్నారు. 
    వాస్తవానికి వారేం చేశారంటే, 2018–19లో వారు ఇచ్చిన అడ్వాన్స్‌ ఎస్టిమేట్స్‌ రూ.6,80,332 కోట్లు. అదే మూడో రివైజ్డ్‌ అంచనాలకు వచ్చే సరికి అది రూ.6,26,614 కోట్లకు వచ్చింది. అంటే రూ.53,837 కోట్లు తగ్గింది. అంటే వారు చూపించిన దాని కంటే తగ్గింది. ఇంకా చెప్పాలంటే వారు 11 శాతం గ్రోత్‌ రేట్‌ అని చెప్పినా, అది వాస్తవానికి 5.66 శాతం మాత్రమే.

అప్పటి కంటే తక్కువ అప్పులు:
    ఇంకా ఏమన్నా అంటే అప్పులు అంటారు. దీంట్లో వారికి తోచిన ఫిగర్‌ చెబుతున్నారు. అప్పులు అంత ఈజీగా ఉంటాయా? అప్పుల మొత్తం లెక్కల కంటే, ఎంత శాతం పెరిగాయనేది చూస్తే.. 2014లో పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.1,34,584 కోట్లు కాగా, అది మే, 2019 నాటికి రూ.3,28,719 కోట్లు. అంటే 5 ఏళ్లలో ఏటా సగటు చూస్తే, 19.55 శాతం అప్పులు పెరిగాయి.
    అదే మన ప్రభుత్వం వచ్చే నాటికి, అంటే మే, 2019 నాటికి రాష్ట్ర అప్పు రూ.3,28,719 కోట్లు కాగా, ఇప్పుడు రూ.4,99,895 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో ఏటా సగటున పెరిగిన అప్పు కేవలం 15.46 శాతం మాత్రమే. అంటే టీడీపీ హయాంలో ఏటా 19.55 శాతం చొప్పున అప్పులు పెరిగితే, మన హయాంలో అది కేవలం 15.46 కోట్లు మాత్రమే. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఈ మూడేళ్లలో రెండేళ్లు కోవిడ్‌ ఉంది.

సాగునీటి రంగం:
    ఇంకా సాగునీటి రంగం గురించి కూడా మాట్లాడారు. అర్థం లేని విమర్శలు చేశారు. వారి హయాంలో 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. కానీ వారు పూర్తి చేసినవి పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు. అందరికీ తెలుసు. అవి వేగంగా పూర్తవుతాయి. నిజానికి నీటి పారుదల రంగంపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. కేవలం వైయస్సార్‌గారికి మాత్రమే ఆ హక్కు ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వానికి ఉంది.
    టీడీపీ హయాంలో తాము 10 లక్షల ఎకరాలకు కొత్తగా నీరిచ్చామని చెబుతున్నారు. కానీ వాస్తవానికి అది కేవలం 2,13,623 ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు:
    పోలవరం ప్రాజెక్టును వారు భ్రష్టు పట్టించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాజెక్టును కేంద్రానికే అప్పగించి పనులు జరగనీయకుండా, మీరు సొంతం చేసుకోవాలని ఆపారు. అది కూడా ఎందుకు చేశారంటే పట్టిసీమ కోసం. ఎందుకంటే ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేస్తే, ముడుపులు ముడతాయని. పోలవరం కుడి కాల్వ చేసే పనే పట్టిసీమ చేస్తుంది కాబట్టి, దాన్ని గ్రావిటీ ద్వారా నీరు పారేలా చేయకుండా, లిఫ్ట్‌ పథకం చేపట్టారు. అందుకే పట్టిసీమ పూర్తయ్యే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులు చేసినా అన్నీ అరకొరే. మీరు చేసిన అన్యాయమైన పనుల వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. కాఫర్‌ డ్యామ్‌ కూలి పోయింది.

ఎన్నికలు–మీ పథకాలు:
    పసుపు కుంకుమ గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ఒకటి, రెండు వారాల ముందు పౌర సరఫరాల శాఖ ద్వారా అప్పులు తెచ్చి, వాయిదా పద్దతిలో రెండుసార్లు రూ.3 వేలు, మరోసారి రూ.4 వేలు.. చెక్కుల రూపంలో ఇచ్చారు. ఎక్కడైనా అలా చేస్తారా?
    ఇక అన్నదాత సుఖీభవ. దీనికి 2018–19 బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు 2018 డిసెంబరులో అప్పటికప్పుడు సప్లిమెంటు పెట్టి, రూ.500 కోట్లు ఒకసారి, మరోసారి రూ.1500 కోట్లు పెట్టి, రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. అది కూడా కొందరికే ఇచ్చారు. అది ఎంతో బాగా చేశామని ప్రచారం చేసుకున్నారు.

పెన్షన్లు పెంచి ఇస్తున్నాం:
    పెన్షన్‌ సరిగ్గా ఇవ్వడం లేదని యనమల విమర్శిస్తున్నారు. నిజానికి వారి హయాంలో కంటే, ఇప్పుడు చాలా బాగా ఇస్తున్నాం. నిజానికి మనం ఎక్కువ పెన్షన్‌ ఇస్తామని ప్రకటించిన తర్వాతే, ఎన్నికలకు 3 నెలల ముందు రూ.1000 పెన్షన్‌ ఇచ్చారు.  
    అదే మనం అధికారంలోకి రాగానే పెన్షన్‌ పెంచాం. జూన్‌ 2019 నుంచి రూ.2250 చేశాం. అదే విధంగా డిసెంబరు 2021 నుంచి రూ.2500 చేశాం. ఇప్పుడు అదే ప్రకారంగా రూ.2750 చేయడానికి చర్యలు చేపడుతున్నాం. డీబీటీ విషయంలో ఈ ప్రభుత్వం బెస్ట్‌ అని ప్రతి ఒక్కరూ చెబుతుంటే, టీడీపీ మాత్రమే విమర్శిస్తోంది.

వారు రుణాలు మాఫీ చేయలేదు:
    వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. అదే విధంగా డ్వాక్రా మహిళల రుణాలు రూ.21,500 కోట్లు ఉండగా, వాటిని మాఫీ చేస్తానని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలా చేసిన టీడీపీ నాయకులు ఇవాళ, రుణ మాఫీ గురించి మాట్లాడుతున్నారు.

ఇంకా మరిన్ని అసత్యాలు:
    బియ్యం పంపిణీ గురించి కూడా అర్ధం లేని విమర్శలు.
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, నాన్‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ రెండూ కలిసి 2018–19లో 89.79 శాతం ఇళ్లకు బియ్యం చేరగా, అదే ఈరోజు 2022–23లో 91.36 శాతం ఇళ్లకు బియ్యం చేరుతోంది. అంటే 2 శాతం ఇళ్లు పెరిగినా, బియ్యం సరఫరా పెరగలేదని అంటున్నారు.
    ఇక విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు. మేము ఒక్కటి కూడా కట్టలేదని అంటున్నారు. 347 సబ్‌స్టేషన్లు కట్టాం. మీకు ఓపిక ఉంటే రండి. చూపిస్తాం.

రోడ్లు–మరమ్మతులు:
    రోడ్ల మరమ్మతు. అవి కొన్నేళ్లుగా పాడయ్యాయి. వాటికి మరమ్మతు చేయాలంటే కొన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ రోడ్ల మరమ్మతుల కోసం టీడీపీ హయాంలో కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నాం.
    2014 నుంచి 2019 వరకు చూస్తే, టీడీపీ హయాంలో ఆర్‌ అండ్‌ బి రోడ్లకు ఏటా సగటున రూ.2110 కోట్లు ఖర్చు చేస్తే.. 2019 నుంచి ఈ మూడేళ్లు చూస్తే ఏటా సగటున రూ.2800 కోట్లు ఖర్చు చేశాం. ఇవి కాక కేంద్రం ద్వారా అనేక జాతీయ రహదారులు సాధించుకున్నాం. ఇంకా రూ.1241 కోట్ల వ్యయంతో 4,193 కి.మీ పంచాయతీ రోడ్లు నిర్మించాం. అయితే గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు వేగంగా పూర్తి చేయడం కోసం వాటికి కొంత ప్రాధాన్యం ఇచ్చాం.

పారిశ్రామిక రంగం చూస్తే..:
    2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో భారీ, అతి భారీ (లార్జ్‌ అండ్‌ మెగా) పరిశ్రమలు చూస్తే, ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడి రాగా, 2019 నుంచి ఇప్పటి వరకు అదే ఏటా సగటున చూస్తే అది రూ.13,201 కోట్లు వచ్చాయి. అది రూ.2 వేల కోట్లు ఎక్కువ. అయినా తక్కువ వచ్చాయని అంటున్నారు.
    లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ 107, దాని తర్వాత ఎంఎస్‌ఎంఈలు 1,06,249 యూనిట్లు వచ్చాయి. వాటి పెట్టుబడి మొత్తం రూ.14,656 కోట్లు. 57 ప్రాజెక్టులు రూ.91,243 కోట్ల పెట్టుబడితో పురోగతి దశలో ఉన్నాయి. ఇంకా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,06.800 కోట్ల పెట్టుబడితో నిర్మాణ దశలో ఉన్నాయి. అదే విధంగా 63,509 ప్రాజెక్టుల పనులు ప్రారంభదశలో ఉన్నాయి. ఇంకా కియా అనుబంధ సంస్థలు ఇక్కడే ఉన్నాయి. నిజానికి ఆ పరిశ్రమ కోసం తొలుత ప్రయత్నించింది వైయస్సార్‌గారు.

షిషింగ్‌ హార్బర్లు:
    9 ఫిషింగ్‌ హార్బర్లు. ఇప్పటికే జువ్వలదిన్నె (నెల్లూరు) నిజాంపట్నం (గుంటూరు) బందరు (కృష్ణా), ఉప్పాడ (తూ.గో) హార్బర్ల నిర్మాణం మొదలు కాగా, మిగిలినవి.. బుగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖ), బియ్యపుతిప్ప (ప.గో), వాడ్రేవు, కొత్తపట్నం (ప్రకాశం) రెండో దశలో చేపడుతున్నాం.

     వాస్తవాలన్నీ ఇలా ఉంటే, తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకుంటే వారి అనుకూల మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మరోసారి యనమల రామకృష్ణుడికి విజ్ఞప్తి. మీరు ఒకసారి తుని వెళ్లాలి. అప్పుడే మీకు వాస్తవాలన్నీ తెలుస్తాయి. లేకపోతే ఇక్కడే కూర్చుని, ఎవరో రాసిచ్చింది చదివితే ఇలాగే ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చురకలంటించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top