బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

దుర్గాప్రసాద్‌ కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయం

విలేకరుల సమావేశంలో వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకునేందుకు దుర్గాప్రసాద్‌ కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ అనారోగ్యంతో మరణించారని, ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా విశేష సేవలు అందించారన్నారు. ఆయన మరణంతో ఖాళీ ఏర్పడిన తిరుపతి ఎంపీ స్థానానికి అభ్యర్థిత్వంపై మంత్రులు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల అభిప్రాయాలు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు నిన్నటి రోజున తెలియజేశామన్నారు. బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబ అభిప్రాయాలు కూడా సీఎం తీసుకున్నారన్నారు. రాబోయే శాసనసమండలి ఎన్నికల్లో దుర్గాప్రసాద్‌ కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం నిర్ణయించారని చెప్పారు. 

Back to Top