జూన్ 9న విశాఖలో వైయ‌స్ జగన్‌ ప్రమాణస్వీకారం

కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నిక‌ల ఫలితాలను చూడబోతున్నారు.

చంద్రబాబు లాంటి మోసకారిని ప్రజలు నమ్మరు, ఓటేయ‌రు 

వైయ‌స్ జగన్‌ని తిట్టి ఓటేయమన్నాడే తప్ప బాబు చేసిందేముంది?

ఒక అబద్ధాన్ని వైయ‌స్ జగన్‌ మీద వేసి.. ఓటేయమంటే ప్రజలేమన్నా అమాయకులా?

సూపర్‌ సిక్స్‌ను నమ్మడానికి చంద్రబాబు చరిత్ర ప్రజలకు తెలియదా?

విద్యాశాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ 

విజ‌య‌వాడ‌: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నూతన ట్రెండ్‌ను తీసుకొచ్చారని, వైయ‌స్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పిన నాయ‌కుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు అన్నీ కొనసాగిస్తామని చెప్పామ‌ని, తాము చేపట్టినవి విప్లవాత్మకమైన సంస్కరణలు. వాటన్నిటినీ కొనసాగిస్తామని చెప్పామ‌న్నారు. వీటన్నిటినీ చూసి మాకు ఓటేయండి అని అడిగిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. వైయ‌స్ జగన్‌ మేనిఫెస్టో విడుదల సందర్భంగా అన్నీ స్పష్టంగా చెప్పారని, అందుకే ప్రజలు కూడా ఉవ్వెత్తున పోలింగ్‌ బూత్‌లకు బారులు తీరారన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యంగులు, ప్రజలు అందరూ వైయ‌స్‌ జగన్‌ని ఆశీర్వదించారని చెప్పారు. విజ‌య‌వాడ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే..

జూన్‌9న విశాఖలో వైయ‌స్ జగన్‌ ప్రమాణస్వీకారం
జూన్‌4 కౌంటింగ్‌ అవుతుంది. జూన్‌ 9న మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో వైయ‌స్ జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రజలంతా వైయ‌స్ జగన్‌ రావాలని కోరుకుంటున్నారు. ఆయన వస్తేనే ఒకటో తేదీ పింఛన్‌ వస్తుంది..మహిళలకు క్రమం తప్పకుండా పథకాలు అందుతాయని వారు భావించారు. అందుకే సహనం కోల్పోయిన టీడీపీ దాడులకు తెగబడుతూ..పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎప్పుడూ చంద్రబాబునాయుడు పరిపాలనను పరిశీలిస్తే తనకంటూ చెప్పుకోడానికి ఒక మంచి పనీ లేదు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు1983 తర్వాత 1985లో మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2004 తర్వాత 2009లో రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికి సానుకూల తీర్పు వచ్చింది. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని వైయ‌స్ జగన్‌ చెప్పినట్లు..ఈ ఎన్నికల్లోనూ రెండడుగులు ముందుకేశారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి, కనీవినీ ఎరుగని రీతిలో ఫలితాలను చూడబోతున్నారు. అందుకే జూన్‌9వ తేదీన అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో వైయ‌స్ జగన్‌ ప్రమాణస్వీకార మహోత్సం జరగబోతోందని చెప్తున్నాం. 

చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మా సంప్రదాయం కాదు
టీడీపీ చేస్తున్న అల్లర్లకు ప్రతిగా మా నాయకుడు కూడా స్పందిస్తే వేరేలా ఉండేది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదని మా నాయకుడు వైయ‌స్‌ జగన్ అందర్నీ సంయమనం పాటించాలని కోరారు. అందుకే మంచి సాంప్రదాయం కాదని మేం ఉపేక్షిస్తున్నాం. లేదంటే ఎంత సేపు? రేపు ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము..శాంతిభద్రతలను కాపాడాల్సింది మేము. అందుకే బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. నాలుగైదు రోజులు సంయమనం పాటిస్తే అన్నీ సర్ధుకుపోతాయి. అప్పుడు వాళ్లే తోకముడిచి పిల్లుల్లా పారిపోతారు. పోలింగ్‌ పర్సెంటేజ్‌ పెరగడం అంటే ప్రజల్లో అవగాహన పెరిగిందని అర్ధం. వైయ‌స్ జగన్‌ చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున ఓటింగ్‌కు వచ్చారు. వైయ‌స్ జగన్‌ లాంటి నాయకుడు లేకపోతే మళ్లీ కష్టాలొస్తాయి..జన్మభూమి కమిటీలు వచ్చి అవినీతి రాజ్యమేలుతుందని ప్రజలకు అర్ధం అయింది. అవినీతిపరుడే మళ్లీ ముందుకు వచ్చి రాజ్యం చెలాయిస్తాడని వారికి అర్ధం అయింది కాబట్టే ఆ విధంగా ఓటింగ్‌కు పోటెత్తారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కళ్లముందు ప్రభుత్వం ఉంది. దానికితోడు రాష్ట్రంలో జరిగిన సామాజిక న్యాయం చరిత్రలో ఎక్కడా జరగలేదు. రాజ్యాధికారం వారి చేతిలో ఉంటేనే ఆయా సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి వైయ‌స్ జగన్‌. టీడీపీలో అది లేదు. వారిచ్చిన టికెట్లలోనే ఏ వర్గానికి ఎన్ని ఇచ్చారో స్పష్టం అవుతుంది. మా వద్ద ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు సుమారు 72 శాతానికి పైగా సీట్లిచ్చాం. అందుకే ఆయా వర్గాలు మాకు పట్టం కట్టాయి. అందుకే మేం అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం.

చంద్రబాబు గత చరిత్ర ప్రజలకు తెలియదా?
చంద్రబాబునాయుడు తానే గెలుస్తాను అనడానికి ఆయనకున్న బేస్‌ ఏంటి? ఆయనకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఈ ఎన్నికల ప్రక్రియలో ఒక్క రోజన్నా ఈ పాజిటివ్‌ కారణం వల్ల నాకు ఓటేయండి అని అడిగాడా? ఏరోజన్నా తనను చూసి ఓటేయమని అడిగాడా? ఎంతసేపు వైయ‌స్‌ జగన్‌ని తిట్టి ఓటేయమన్నాడే తప్ప చేసిందేముంది? ఆయన ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి వైయ‌స్ జగన్‌ మీద వేసి..దాన్ని చూపించి ఓటేయమంటే ప్రజలేమన్నా అమాయకులా? సూపర్‌ సిక్స్‌ అంటూ రేపేదో చేస్తానన్నాడు. కానీ ఆయనేం కొత్తగా ముఖ్యమంత్రిగా కాలేదు కదా? 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. పాత చరిత్ర ప్రజలకు తెలియదా? మొన్నటికి మొన్న 2014లో రుణమాఫీ చేస్తానని మహిళలు, రైతులను మోసం చేశాడు. బాబొస్తే జాబు వస్తుంది..లేదంటే 2వేల భృతి అని యువతను మోసం చేశాడు. అలాంటి మోసకారిని ప్రజలు ఎలా నమ్ముతారు? వైయ‌స్ జగన్‌కి ఉన్నది...చంద్రబాబుకు లేనిది క్రెడిబిలిటీ. వైయ‌స్ జగన్‌ చెప్పిందే చేస్తాడు..చేసేదే చెప్తాడు. ప్రజలకు అలాంటి నమ్మకం కావాలి. ఆయన పరిపాలనలోనే పేదవాడి ఆర్థిక పరిస్థితులు మెరుగై సామాన్యుడి జీవితం బాగుపడింది. పేద విద్యార్థి గ్లోబల్‌ స్థాయికి ఎదగడానికి అవసరమైన ప్రక్రియలు ప్రాథమిక స్థాయి నుంచే సమకూరుస్తున్నాం. ఇలాంటివి ఏమైనా చంద్రబాబునాయుడిని ఒక్కటైనా చెప్పమనండి..

జూన్ 4వ తేదీ వరకూ ఇలానే గోల చేస్తారు..భరించాల్సిందే
అదేమంటే నేను హైటెక్‌ సిటీ కట్టానంటాడు..దాన్ని ఎవరు కట్టారో మాకు తెలియదా? చంద్రబాబు చేసే తప్పుడు ఆరోపణల్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కూడా ఒకటి. ఎవరికి అన్యాయం జరిగింది. దాని గురించి ప్రజలందరికీ తెలుసు. నేను ఆరోజే చెప్పాను..పోలింగ్‌ అయిన మరుసటి రోజు నుంచీ ఆ పత్రికలు ఆ చట్టం గురించి ఒక్క రాత కూడా రాయవని. అదే జరుగుతుంది కదా? అదే రీతిలో జూన్ నాలుగో తేదీ వరకూ ఇలాంటి గోలే చేస్తారు. ఆ తర్వాత దాని ఊసేఉండదు. వాళ్ల కుయుక్తుల వల్ల పేదవాడికి రావాల్సిన పింఛన్‌ ఆగింది. బటన్‌ నొక్కి పంపాల్సిన సంక్షేమ ఫలాలు ఆగిపోయాయి. అది కూడా ఈ నెల 14వరకేనని చెప్పాం. ఈ రోజు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వారి ఖాతాలకు చేరిపోయాయి. ఆసరా పథకం సొమ్ము అక్కచెల్లెమ్మల ఖాతాలకు వెళ్లిపోయాయి. నాలుగైదు రోజుల్లో అన్ని పథకాలకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారులకు చేరిపోతుంది. అది మా ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ. అదే చంద్రబాబు అయితే ఇచ్చేవాడా? ఎన్నికలు అయిపోయాయి కదా ఇక వాళ్లతో పనేముందిలే అని తన తాబేదార్లకు, అనుకూల కాంట్రాక్టర్లకు ఇచ్చుకునేవాడు. అదీ వైయ‌స్ జగన్‌కి, చంద్రబాబుకు ఉన్న తేడా. 

Back to Top