మణిపూర్‌లో చదివే ఏపీ విద్యార్థులకు అండగా ఉన్నాం

ప్రత్యేక విమానాల్లో వారిని రప్పించేందుకు ఏర్పాట్లు సిద్ధం 

విద్యార్థులు, రైతుల ఇబ్బందుల్లో ఉంటే రాజకీయాలు పనికిరాదు

మాది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం

పచ్చపత్రికల కథనాల అడ్డగోలు రాతల్ని ప్రజలు నమ్మరు

పంటనష్టం అంచనాల్లో సీనియర్‌ ఐఏఎస్‌లతో పర్యవేక్షిస్తున్నాం

పదోతరగతి ఉత్తీర్ణతా శాతంలో ప్రభుత్వ విద్యాసంస్థలే ముందంజ

ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులపై కొరడా తప్పదు 

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజ‌య‌న‌గ‌రం: మణిపూర్‌లో జరుగుతున్న అలర్ల నేపథ్యంలో ఏపీకి చెందిన ఎన్‌ఐటీ, ఐఐటీ విద్యార్థులుండటం, వారంతా అక్కడ ఇబ్బందులకు గురికావడంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. అక్కడున్న ఏపీ విద్యార్థులతో కూడా ప్రభుత్వ తరఫున మాట్లాడామ‌ని, ప్రస్తుతం అక్కడున్న ఉద్రిక్త వాతావరణంలో తాము ఉండలేమని, సొంత రాష్ట్రానికి వస్తామని విద్యార్థులు కోరారు. దీంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా సంప్రదించడం, వారి వివరాలన్నింటినీ సేకరించడంతో పాటు వారిని ఇక్కడకు రప్పించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింద‌న్నారు. విజయనగరం క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే..
మణిపూర్‌లో స్థానికంగా ఆంధ్రా విద్యార్థుల వరకు ఒకచోటికి చేర్చేందుకు అక్కడ కోఆర్డినేటర్లను పెట్టి ఒక క్వార్టర్‌లో ఉంచుతున్నాము. సివిల్‌ ఏవియేషన్‌ అధికారులతో కూడా మా ఏపీ భవన్‌ అధికార యంత్రాంగం సంప్రదింపులు జరుపుతుంది. వారందర్నీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు గానీ, విజయవాడకు గానీ రప్పించి.. ఆ తర్వాత వారి వారి స్వస్థలాలకు విద్యార్థులను పంపుతాము. దీనికి సంబంధించి మీడియా ద్వారా మేం కోరుతున్న విషయమేమంటే, మణిపూర్‌లో ఇంకా మా జాబితాలోకి రాని విద్యార్థుల వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలియజేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలకు గురవకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అన్నివిధాలుగా అండగా నిలబడి ఆంధ్రాకు తెస్తామని మీడియా ద్వారా హామీనిస్తున్నాం. 

పట్టించుకోలేదనే పత్రికల కథనాల్ని నమ్మనవసరంలేదు
ప్రభుత్వం పట్టించుకోలేదనే కొన్ని పచ్చ పత్రికల కథనాల్ని ఎవరూ నమ్మనవసరంలేదు. వాటిల్లో వాస్తవాల్లేవు. అందరిలాగా, మేం పబ్లిసిటీని కోరుకోం. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అప్రమత్తంగా బాధ్యతగా పనిచేయాల్సిన ప్రభుత్వం అధికారయంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తుంది. కానీ, మేం ఇలా చేస్తున్నాం.. అలా చేస్తున్నాం.. అని ప్రచారాన్ని కోరుకునే ప్రభుత్వం మాదికాదు. మణిపూర్‌లో ఉన్న విద్యార్థులతో కొందరితో స్వయంగా నేనే మాట్లాడాను. వారు అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్నాను. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను వారికి చెప్పి.. అక్కడ వారికి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 150 మందికి సరిపడా ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని బట్టి అదనంగా ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేస్తాం. ఈ వ్యవహారాలన్నీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాస్‌ గారి నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌లు పర్యవేక్షిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతంలో పంటనష్టం తీవ్రత తక్కువే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాలవర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి వర్షపాతం అధికంగా ఉన్నప్పటికీ, పంటనష్టం మాత్రం ఎక్కువ లేదు. పార్వతీపురం ఏరియాలో అరటి పంట దెబ్బతింది. మిగతాచోట్ల కొద్దిగా మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. పంటనష్టం అంచనాలకు సంబంధించి జిల్లాలవారీగా సీనియర్‌ ఐఏఎస్‌లును ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వారు ఎప్పటికప్పుడు జిల్లాల అధికారులతో సమీక్షలు చేస్తూ.. పంటనష్టం అంచనాలను నమోదు చేస్తున్నారు. మంత్రులుగా మేం కూడా రోజురోజుకు వర్షపాతం, పంటనష్ట తీవ్రతపై ఆరాతీస్తున్నాం. ఇక, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించేంత పంటనష్ట తీవ్రత ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేనందున.. జిల్లాకేంద్రం స్థాయిలో నివేదికలను తెప్పించుకుంటున్నాము. 

రాజకీయాలు పక్కనబెట్టి పనిచేసుకుంటూ పోతాం
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఇప్పటికే కోతకోసిన ధాన్యం కళ్లాల్లో తడవడం, తేమశాతం పెరగడం వంటి నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నందున.. ఆయా జిల్లాల్లో అధికారయంత్రాంగంతో పాటు స్థానిక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. రైతులు నష్టాన్ని ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు వారిదగ్గరికి వెళ్లి రాజకీయాలు చేయడం తగదు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా వారికి ధైర్యం చెబుతూ పనిచేసుకుంటూ పోవాలి గానీ రాజకీయాలు చేయడం నాయకత్వ లక్షణం కాదని తెలియజేస్తున్నాను. ఈరోజు మణిపూర్‌లో విద్యార్థులు భయాందోళనకు గురైనా.. అధికవర్షాలతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయిన క్రమంలో వారికి ప్రభుత్వం తరఫున ధైర్యం చెప్పి అన్నిరకాలుగా ఆదుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మిగతా పార్టీ నేతల్లాగా మేం మాటలతో కాదు. చేతలతో చేసి చూపించి బాధితులకు భరోసానిచ్చే నాయకులుగానే ఉంటాం. 

 రైతులకు అండగా వైయ‌స్ జగన్‌ 
అకాలవర్షాల నేపథ్యంలో కోతకోసిన ధాన్యం కళ్లాల్లోనే తడిచిపోయిందనే విషయం తెలియగానే మా గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే కాకుండా.. గుంటూరు, కృష్ణా తదితర రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ క్షేత్రస్థాయి పరిశీలనలతో పంటనష్ట అంచనాలు తయారు చేసి పంపాలని ఆదేశించారు. ఆమేరకు ప్రతీ జిల్లాకు ఒక్కో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి పర్యవేక్షణ చేయమన్నారు. పండించిన ప్రతీ గింజ కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోతకోసిన ధాన్యంతో పాటు పొలాల్లో ఉన్న పంటకు కూడా ప్రభుత్వం తరఫున మేం భరోసానిస్తున్నాం. తడచిన ధాన్యం కొనుగోళ్లలో కూడా రైతుల పట్ల ఉదారంగా ఉండాలని, వారికి మద్ధతుధర అందివ్వాలని అధికారులకు, మిల్లర్లకు ఇప్పటికే మా ముఖ్యమంత్రిగారి స్పష్టమైన ఆదేశాలు అందాయి.  

పదోతరగతి ఫలితాల్లో 72శాతం ఉత్తీర్ణత సాధించాం..
పదోతరగతి ఫలితాల్లో ఈఏడాది 72 శాతం ఉత్తీర్ణత సాధించాం. మిగిలిన 27.5 శాతం అధిగమించేందుకు ప్రభుత్వం తరఫున మేం అన్నిరకాల చర్యలు చేపట్టాం. దీనిపై వారం రోజుల్లో పూర్తిస్థాయి ప్రణాళికను వివరిస్తాం. మా టార్గెట్‌ ప్రకారం నూటికి నూరుశాతం ఉత్తీర్ణతను సాధించేందుకు కసరత్తు చేస్తాం. ఈసారి ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులే రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కుల్ని సాధించారు. జీరో పర్సంటేజీ ఉత్తీర్ణత శాతం నమోదైన స్కూళ్లల్లో ప్రభుత్వం కంటే ప్రైవేటు విద్యాసంస్థలే ఎక్కువ ఉన్నాయి. ఇక, ఇంటర్‌ ఫలితాల విషయానికొస్తే.. ఎక్కడైతే ఉత్తీర్ణత 40శాతం మించని ప్రభుత్వ కళాశాలలున్నాయో.. వాటిల్లో 80శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించే కార్యచరణ ప్రణాళికను చేపడుతున్నాం. 

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలుంటాయి
ప్రయివేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా అధిక ఫీజులు వసూలు చేస్తే తప్పకుండా చర్యలు చేపడతామని హెచ్చరిస్తున్నాను. ఇందుకోసం మేం ప్రభుత్వం తరఫున ఒక విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేశాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ ఆ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే తప్పకుండా యాక్షన్‌ ఉంటుందని స్పష్టంచేస్తున్నాను.

ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరేవారి సంఖ్య తగ్గింది
మా గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక విద్యావ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల నేపథ్యంలో విద్యార్థుల చేరిక లో భారీ మార్పు కనిపించింది. నాడు నేడు వంటి విద్యాభివృద్ధి కార్యక్రమంతో ప్రస్తుతం ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే, ప్రస్తుతం ప్రయివేటుకు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్యలో ఐదారు లక్షల తేడా ఉంది. ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటే, ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత సీట్ల కింద రాష్ట్రవ్యాప్తంగా 90వేల సీట్లు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 20వేల సీట్లకు మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేందుకు ఎవరూ మొగ్గుచూపడం లేదనే విషయం వెల్లడవుతుంది.  అలాగని, మేం ప్రభుత్వపరంగా ప్రైవేటు విద్యాసంస్థల మెడపై కత్తి పెట్టి వాటిని మూసేయమని చెప్పడం మా అభిమతం కాదు. విద్యార్థులను ఎక్కడ చదివించాలనేది తల్లిదండ్రుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వ విద్య ప్రయివేటు విద్యాసంస్థల్ని తలదన్నే విధంగా ఉన్నప్పుడు వారి ఎంపిక ప్రభుత్వ విద్యాలయాల వైపే మొగ్గుచూపుతుందని అందరూ గుర్తించాలి.  

Back to Top