చంద్రబాబుది నాలుకా, తాటిమట్టా…? 

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖ‌: సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డిపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. చంద్ర‌బాబుది నాలుకా, తాటిమట్టా అంటూ ధ్వ‌జ‌మెత్తారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.   ఎంతసేపు సీఎం వైయ‌స్‌ జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.

కొద్దో గొప్పో టీడీపీకి ఉన్న ఉనికి వచ్చే ఎన్నికల్లో పోవడం ఖాయమని బొత్స పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది నాటి సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలోనే అన్నది టీడీపీకి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ అభివృద్ధిని సీఎం వైయ‌స్ జగన్ కొనసాగిస్తున్నారన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. ఆయనది నాలుకా, తాటిమట్టా అంటూ మండిపడ్డారు. రుషికొండ బోడి కొండ చేశారని పదే పదే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అక్కడ ఏమైనా ప్రైవేట్ కట్టడాలు, లేదంటే తాము వ్యక్తిగత కట్టడాలు ఏమైనా చేస్తున్నామా.. ప్రభుత్వ కట్టడాలకే కదా ఉపయోగిస్తోంది…అభివృద్ధి చేయడం తప్పా.. అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అని ప్రశ్నలు గుప్పించారు. పేదవాడి ఆకలి మీద రాజకీయాలు చేసే చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.

 దేశంలోనే అత్యధిక జీడీపీ పెరిగిన రాష్ట్రం ఏపీ అని.. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచిన ప్రభుత్వం మాది అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం… ఈ నాలుగు అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ నాలుగు అంశాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు పనైపోయిందని.. గ్రామాల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యం ఆయనకు ఉందా అంటూ బొత్స ఎద్దేవా చేశారు. జనసేన ఓ సెలెబ్రెటీ పార్టీ.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు ఆ పార్టీకి లేవన్నారు. గత ఏడాది జరిగిన పరిణామాలతో …ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పరీక్షలను కూడా రాజకీయాలకు వాడుకుందామనుకుంటే అంతకన్నా నీచమైన పని ఉండదని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు. 

Back to Top