ప‌వ‌న్‌..నువ్వేమైనా యుగపురుషుడివా..?

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ 

వైయస్‌ఆర్‌ బాటలో సీఎం వైయస్‌ జగన్‌ నడుస్తున్నారు

ఇల్లు లేని నిరుపేదలందరికీ గూడు కల్పించాలని జగనన్న కాలనీలు ఏర్పాటు

30 లక్షల మందికి ఇళ్లు  ఇవ్వాలని నిర్ణయించాం

 పేదలందరికీ శాశ్వత ప్రతిపాదికన ఇళ్లు కట్టిస్తున్నాం

 పేదల ఇళ్ల కోసం మొత్తం 71 వేల ఎకరాల భూమి సేకరించాం

రూ.11 వేల కోట్లతో 20 వేల ఎకరాల ప్రైవేట్‌ భూమి కొనుగోలు చేశాం

వాస్తవాలు తెలుసుకోకుండా పవన్‌ మాట్లాడుతున్నాడు

జనసేన రాజకీయ పార్టీ కాదు..అది సెలబ్రిటీ పార్టీ

 

తాడేప‌ల్లి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జ‌లు న‌మ్ముతారా? ఆయ‌నేమైనా యుగపురుషుడివా..? అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. పేద‌ల ఇళ్ల‌పై వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న గురించి ప్ర‌ధానికి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, జ‌న‌సేన అస‌లు రాజ‌కీయ పార్టీ కాద‌ని, అది సెల‌బ్రిటీ పార్టీ అని అభివ‌ర్ణించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల‌పై జ‌న‌సేన ఆరోప‌ణ‌ల‌ను మంత్రి తీవ్రంగా ఖండించారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 

ధృఢ సంకల్పంతో గొప్ప కార్యక్రమం!
    ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలని, ఇది నా సొంత ఆస్తి, హక్కుగా భావించాలని స్వర్గీయ వైయస్సార్‌గారు ఆనాడు ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఒక ప్రణాళిక బద్ధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేశారు. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తూ ఆయన తనయుడు శ్రీ వైయస్‌ జగన్‌ శాశ్వత ప్రాతిపదికన భారీ ఎత్తున పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఎంత ఇబ్బంది ఉన్నా దీన్ని చేయాల్సిందే అని భావించి దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. అందుకోసం  71,811 ఎకరాల భూమిని సేకరించాం. వాటిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమి కొనుగోలు చేశాం. అందు కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇది వాస్తవం.
    జగనన్న కాలనీల్లో లాండ్‌ లెవెలింగ్, రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.15 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఒక దృఢ నిశ్చయంతో పాటు, పేదవారు కూడా సగౌరవంగా తలెత్తుకుని తిరిగేలా ఈ కార్యక్రమం తలపెట్టాం. అంతా పారదర్శకంగా చేస్తున్నాం.

అది సెలబ్రిటీ పార్టీనే..
    సెలబ్రిటీ పార్టీ నాయకుడు మా విజయనగరం వెళ్లారు. అది రాజకీయ పార్టీ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది. కార్యాచరణ ఉంటుంది. నిన్న ఆయన 10 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించాడు. ఖర్చు పెట్టిందే 15 వేల కోట్ల లోపు అయితే 10 వేల కోట్లు అవినీతి ఎలా జరిగింది? ప్రజలేమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నారని అనుకుంటున్నారా?. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడం తప్పా? మీ పార్టనర్‌ తన హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారైనా అడిగారా?.
    విజయనగరంలో ఇంటికి నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారు అని ఒక్కరైనా చెప్పారా? స్థలం నా దగ్గర కొని ఎక్కువకు అమ్ముకున్నారని ఎవరైనా చెప్పారా? నీది నిజంగా రాజకీయ పార్టీ అయితే నీ దగ్గర అనుచరులు ఉంటే వాళ్లతో చెప్పించండి. అంతే కానీ ఎవరో చెప్పినవి వచ్చి నువ్వు ఇక్కడ అప్ప చెప్పడం సరి కాదు.
    కనీసం రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనే దానిపై కసరత్తు చేశావా? నువ్వేమైనా యుగపురుషుడివా? నీ ఇష్టారాజ్యంగా మాట్లాడతాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలు నువ్వు చెప్పింది వినడానికి అమాయకులా? పవన్‌ కళ్యాణేకాదు, కమెడియన్‌ వచ్చినా చూడడానికి జనం వస్తారు.

నిరూపించగలవా?:
    పది వేల కోట్లా!. అవేమైనా వేసుకునే కోట్లు అనుకున్నావా పవన్‌? విజయనగరం జిల్లా గుంకలాం లేఅవుట్‌లో అవినీతి జరిగిందని నిరూపించండి. రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్లలో రెండోది గుంకలాం లేఅవుట్‌. దివంగత నేత వైయస్సార్‌ గారి హయాంలో అక్కడ పేద ప్రజలందరికీ ఇళ్లు ఇచ్చాం. ఇప్పుడు జగన్‌గారు వచ్చిన తర్వాత 400 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి, 12 వేల ఇళ్ల స్థలాలు సిద్ధం చేసి, 10 వేల మందికి పట్టాలు కూడా ఇచ్చాం. ఎక్కడ అవకతవకలు జరిగాయో ఒక్క వ్యక్తితో అయినా చెప్పించు.

నువ్వేమైనా పుడింగివా?:
    ఆ జిల్లా మంత్రిగా, సుధీర్ఘ కాలంగా ఆ జిల్లా ప్రజా ప్రతినిధిగా నేను నువ్వు ఒక్క అవకతవకను చూపించినా తల దించుకుంటాను. పవన్‌ కళ్యాణ్‌ వెళ్లిన సందర్భం ఎమిటి? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? ఇళ్లు చూస్తానని వెళ్లి.. ఢిల్లీకి వెళ్లి వైయస్సార్‌సీపీ పెద్దలు తనపై ఫిర్యాదు చేస్తున్నారని మాట్లాడతాడు. నీకు నువ్వు పెద్ద పుడింగివి అనుకుంటున్నావా? నీపై ప్రధానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం మాకేముంది? ఆయనకున్న గుణాలన్నీ ఎదుటి వారికి ఆపాదిస్తే ఎలా?
    ఏదో కాల్షీట్‌ ప్రకారం వచ్చే పోయే నీకు, మా మాదిరిగా ప్రజా సేవ చేయాలన్న ఆలోచనలు వస్తాయని నేను అనుకోను. అక్కడికి మావాళ్లు కూడా వెళ్లి వాస్తవాలు చెప్పే వాళ్లు. కానీ నిన్ను అడ్డుకున్నామని మాపై ఆరోపణ చేస్తావని ఆగాం. నీ పార్టనర్‌ చంద్రబాబుకు మేలు చేయాలని నీవనుకుంటే కుదరదు. ఆయన్ను క్రేన్లు పెట్టి లేపాలని చూసినా కుదిరే పని కాదు. ఇంత అడ్డగోలు మాటలు మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారు?.

యజ్ఞంలా ఇళ్ల నిర్మాణం:
    ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేదకు పక్కా ఇల్లు ఇవ్వాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. రెండు విడతల్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.7700 కోట్లు ఖర్చు అయ్యాయి. లబ్ధిదారుల వద్దకు వెళ్లి అవినీతి జరిగింది అని చెప్పించండి. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు అవినీతి జరిగిందేమో కానీ ఇప్పుడు మాత్రం జరగడం లేదు. దేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఒక యజ్ఞంలా ఇళ్ల నిర్మాణం సాగుతోంది. ఇవన్నీ పూర్తయితే కొత్త ఊర్లు, టౌన్‌షిప్‌లు తయారవుతాయి. రెండు మూడేళ్ల తర్వాత చూస్తే మీకు అర్ధం అవుతుంది. 
    ఒక వేళ అక్కడ ఏదైనా అవతవకలు జరిగి ఉంటే నువ్వు మాట్లాడినా ఒక అర్ధం ఉంటుంది. లేనిపోనివి చేప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే వారేమీ అమాయకులు కాదు. రాష్ట్రంలో సామాన్యుడికి ఒక ధైర్యం, స్థైర్యం జగన్‌గారి ప్రభుత్వమే. ఏదేమైనా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. లబ్ధిదారులు కట్టుకోవాలి కదా.. వారు సొంతంగా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ఇళ్ల నిర్మాణంలో మూడు విధాలుగా వెసులుబాటు ఉంది. 
    గత ఐదేళ్లలో ఈ ఫ్రెండ్‌ చంద్రబాబు ఎన్ని ఇళ్లు కట్టాడో చెప్పాలి. కట్టుకున్న తర్వాత బిల్లులు ఇవ్వకపోతే మా తప్పు. కడుతుంటే దశల వారీగా బిల్లులు ఇస్తున్నాం. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముందుగా విద్యుత్, నీటి సౌకర్యం కూడా కల్పించాం. రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి అనేది వాస్తవం. ఇవన్నీ తెలుసుకోవాలనే తపన కూడా పవన్‌కు  లేదు. భూముల కొనుగోలు వద్ద అవినీతి జరిగింది అని నిన్న ఆయన వెళ్లిన చోట ఏ ఒక్కరైనా చెప్పారా..? కేవలం మాపై బురద చల్లే పయత్నం తప్ప వేరొకటి కాదు. ఇంటింటికీ తిరిగితే విషయం ఏమిటో చెప్తారు. అందుకే లబ్ధిదారులు ఏ ఒక్కరూ రాలేదు. ఆయన వెంట ఆ ఈలలు వేసే ఆయన అభిమానులు తప్ప. 

ఒకరితో కాపురం...మరొకరితో పొత్తు..:
    ఒకరితో పొత్తు ఒకరితో కాపురం ఎలాగూ నడుస్తూనే ఉంది. చంద్రబాబుతో కాపురం.. బీజేపీతో పొత్తు అనేది రాష్ట్రమంతా తెలుసు. ఆయన చొక్కాలు పట్టుకోమంటే పట్టుకోడానికి మేమన్నా చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామా..? సింగరేణిలో 49 శాతం కేంద్రం వాటా..51 శాతం రాష్ట్ర ప్రభుత్వానిది కాబట్టి అక్కడ మేమేం చేయలేం అని ప్రధాని మోదీ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. అదే విషయాన్ని ప్రధాని గారికి చెప్పాము. జనసేన నామినేషన్లు ఆపడానికి ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? లేక ఇంకేమైనా అనుకుంటున్నారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ఉండటానికి ముందుగానే ఇలాంటివి మాటలు మాట్లాడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. 

ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన
    ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన చేయడానికి సీఎంగారు సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని దుష్టశక్తులు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రజల మంచి కోసం చేస్తున్న యజ్ఞమే సఫలమవుతుంది. బోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వ్యవహారం క్లియర్‌ అయ్యింది. ఇక ఏ క్షణమైనా పనులు ప్రారంభం అవుతాయి. మేం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాన నరేంద్ర మోదీకి చెప్పడంతో పాటు, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు ప్రజల అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశాం.
    ప్రధాని మోదీ పర్యటన ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలని ఎవరైనా కోరుకుంటారు. అలా ఎప్పుడూ పాజిటివ్‌ మైండ్‌తో ఉండాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. వ్యక్తిగత స్వార్ధంతో ఆలోచిస్తే ప్రయోజనాలు రావు. తమకు ఇంత మంది ఎంపీలు ఉన్నప్పటికీ సీఎం శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్రం కోసం ఓ మెట్టు దిగి మాట్లాడి తన ఉన్నతిని చాటుకున్నారు. ఆయన ప్రసంగం అంత హుందాగా ఉంటుందని నేను కూడా ఊహించలేదు.
    మేము ఇలా చిల్లమల్లరగా మాట్లాడే వాళ్లం కాదు. 15 వేల కోట్లు ఖర్చు చేస్తే 10 వేల కోట్లు తినేశామని మాటలు సరి కాదు. మా కుటుంబ సభ్యులకు కానీ, మా నాయకుల కుటుంబ సభ్యులకు కానీ సంబంధం ఉందని నిరూపించమనండి. ఛాలెంజ్‌ చేస్తున్నా. ఇప్పుడు పవన్‌ మాటలు, ఆరోపణలు హస్యాస్పదంగా ఉన్నాయి.

Back to Top