ప్రజలందరి ధైర్యం సీఎం వైయస్‌ జగన్‌

2019 మే 23.. సంక్షేమానికి నాంది పలికిన రోజు

ఈ విజయంలో భాగస్వాములైన పార్టీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా సీఎం భావిస్తున్నారు

ఎన్నికల ప్రణాళికలోని అంశాలన్నీ అమలు చేసిన ఘనత వైయస్‌ జగన్‌ది

వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో రైతును రాజు చేసేలా పాలన.. విద్యా, ఆరోగ్యానికి పెద్దపీట

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా చూసుకోవడానికి ముఖ్యమంత్రి ఉన్నాడులే అనే ధైర్యాన్ని ప్రజలకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలంతా కులమతాలకు తేడా లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారని, ఏ కష్టం వచ్చినా మాకు వైయస్‌ఆర్‌ ఉన్నారనే ధీమా ఉండేదని, మళ్లీ ఆ నమ్మకం, పేదలకు భరోసా, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఒక ఆశ 2019 మే 23న వచ్చిందన్నారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు.. సంక్షేమానికి నాంది పలికిన రోజు అని, ఈ విజయంలో భాగస్వాములైన పార్టీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు.  

మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తానని వైయస్‌ జగన్‌ ప్రజల ముందుకు వెళ్లారని, ప్రజలంతా మెచ్చారు.. వైయస్‌ జగన్‌కు పట్టం కట్టారన్నారు. సంవత్సరకాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ పూర్తి చేసిన ఘనత.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సాధించాడంటే అది వైయస్‌ జగన్‌ మాత్రమేనన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..

సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. ఇబ్బందులు తొలగించడానికి అందరి అభిప్రాయాలు తీసుకొని మేనిఫెస్టో తయారు చేశారు. మేనిఫెస్టో అమలు చేయడం సాధ్యమా అని ప్రతిపక్షాలన్నీ పెదవి విరిచాయి. ముఖ్యంగా తెలుగుదేశం జరగదని చెప్పింది. అప్పులు చేసి వెళ్లిపోయాం.. పథకాలు అమలు చేయాలనుకుంటే.. ఖజానా ఖాళీ చేశామని చంద్రబాబు, యనమల అనుకున్నారు. రూ.57 వేల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని రూ.2.75 వేల కోట్ల అప్పుల్లో టీడీపీ ముంచింది. ప్రభుత్వం అబాసుపాలవుతుందని టీడీపీ నేతలు అనుకున్నారు.. కానీ, మనసుంటే మార్గం ఉంటుంది.  

నవరత్నాలను సృష్టించి.. వాటి ద్వారా పేదల తాలూకా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నారు. రైతే రాజు అనే వైయస్‌ఆర్‌ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని రైతు అనేవాడు పెట్టేవాడుగా ఉండాలని కానీ, చేయిపట్టేవాడు కాకుండా ఉండాలని రైతు మేలు కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో పథకాలను అమలు చేశారు. పంటలకు గిట్టుబాటు ధరను పంట వేసే ముందే ప్రకటిస్తున్నాం. కరోనా కష్టకాలంలోనూ రైతులకు మేలు చేశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నాం. ధాన్యాన్ని కల్లాల్లోనే కొనుగోలు చేయడం, రైతుకు, వినియోగదారుడికి ఒక మేలైన కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కల్పించింది. 

సాగునీరు కోసం పక్కరాష్ట్రాలతో స్నేహసంబంధాలు పెంచుకుంటూ.. కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమకు ఏరకంగా కార్యక్రమాలు చేస్తున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. 40 ఏళ్ల అనుభవం చెప్పుకునే నాయకులు కూడా సాగునీరు ఇచ్చే ఆలోచన చేయలేదు. ఆ రోజున మహానేత వైయస్‌ఆర్‌ చేపట్టిన జలయజ్ఞాన్ని సీఎం వైయస్‌ జగన్‌ పునఃప్రారంభించి రాయలసీమ ప్రాంతాల్లో కరువు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక మొదలుకొని, అమ్మ ఒడి, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైయస్‌ఆర్‌ వాహనమిత్ర, వైయస్‌ఆర్‌ నేతన్న హస్తం, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, లా చదువుకునే విద్యార్థులకు లా నేస్తం. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా దాదాపు 4.30 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. 

కరోనా పరీక్షలు చేయడంలో దేశంలో నంబర్‌ స్థానంలో నిలిచింది. వలంటీర్ల ద్వారా ప్రతి 50 ఇళ్లను పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యానికి, విద్యకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా, ఆరోగ్యం రెండు కళ్లుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైయస్‌ఆర్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నారు. చంద్రబాబు పెట్టిపోయిన బకాయిలను కూడా తీరుస్తున్నారు. 

సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయి. వాటిని పట్టించుకోకుండా ప్రజల చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రంలో 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతి కుటుంబానికి ఒక పక్కా ఇల్లు కట్టించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలని ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. 
 

Back to Top