24న జ‌గ‌న‌న్న వసతి దీవెన ప్రారంభం..

మంత్రి బొత్స సత్యనారాయణ

 విజయనగరం: ఈ నెల 24న జ‌గ‌న‌న్న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరంలో ప్రారంభిస్తారని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌న‌ తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా సుమారు 50వేల మంది విద్యార్థులు జిల్లాలో లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 58 వేల మందిని ఇళ్లు, ఇంటి స్థలాల లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన స్థల సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బలవంత భూ సేకరణ జరగలేదని.. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. 

అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజం.. కానీ మాజీ ముఖ్యమంత్రి పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటి పై దాడులు జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీ సోదాలకు సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు యాత్ర చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఏడు నెలల క్రితమే గుర్తించామని.. భూ సేకరణలో అవకతవకలు జరిగాయని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.  గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపితే  తప్పు అని అనడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బీసీ మంత్రులపై టార్గెట్‌ అనడం హాస్యాస్పదమన్నారు. తాను బీసీ మంత్రినేనని.. గతంలో పదేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా.. తాము కాదా అని బొత్స ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని.. తప్పుడు ఆరోపణలను ప్రజలు హర్షించరని మంత్రి బొత్స పేర్కొన్నారు. 
 

Back to Top