విజయవాడ: కొత్తగా ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి బొత్ససత్యనారాయణ సూచించారు. మేయర్లు, చైర్మన్లకు విజయవాడలో బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు మన పని తీరు, ఆలోచనలను కూడా గమనిస్తూ ఉంటారన్నారు. తమ ప్రాంతాలను అభివృద్ధి అయ్యేలా చరిత్రలో నిలిచేలా మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. వేసవిలో తాగు నీటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇరవై నెలల ప్రభుత్వ ఆలోచలను చూసి ఏకపక్షంగా ప్రజలు మిమ్మలను గెలిపించారని పేర్కొన్నారు. అధికారాలతో పాటు, బాధ్యతలు గుర్తెరిగి పనిచేయాలని సూచించారు. ’’ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు చేరువ చేయాలి. ప్రజలతో మమేకమై ... వారి సమస్యలు తీర్చితేనే.. మనకు గుర్తింపు ఉంటుంది. మళ్లీ మనలనే ఎన్నుకోవాలి అనేలా మీ పాలన సాగాలి. రేపు సీఎం కూడా మీ అందరినీ కలిసి ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రణాళికను మీకు వివరిస్తారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.