విశాఖపట్నం: కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు అమలు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నిన్న విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించామని మంత్రి చెప్పారు. కరోనా నివారణ చర్యలపై విశాఖపట్నం జిల్లా అధికారులతో సమీక్షా అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా గురించి ఆందోళన వీడాలని, ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణలు పాటిస్తే.. ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి డాక్టర్లు, వైద్య సిబ్బంది, అధికారులు, పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు చాలా వరకు కంట్రోల్ చేయగలిగామని చెప్పారు. ఐసోలేషన్‌కు సంబంధించి 2 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖ జిల్లా రూరల్ పరిధిలో దాదాపు 59 లక్షల మాస్కులు, జీవీఎంసీ పరిధిలో 25 లక్షల మాస్కులు పంపిణీ చేశామని వివరించారు. ఇవి కాకుండా 64 వేల పీపీఈ కిట్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్, మాస్కులు, పేషంట్లకు కావాల్సిన బెడ్స్, వెంటిలేటర్స్ అన్ని ఉన్నాయని మంత్రి వివరించారు. ఒకవేళ విశాఖలో కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని, డాక్టర్లతో కూడా చర్చించడం జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో మొత్తం 3,231 మంది క్వారంటైన్‌లో అడ్మిట్ కాగా, ప్రస్తుతం 492 మంది మాత్రమే క్వారంటైన్‌లలో ఉన్నారన్నారు. చాలా మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి వివరించారు. క్వారంటైన్ సెంటర్లు రూరల్, సిటీలో కలిపి మొత్తం 70 ఉన్నాయన్నారు. బెడ్స్ రూరల్ పరిధిలో 3 వేలు, సిటీలో 7 వేల బెడ్స్ రెడీ చేసి పెట్టామన్నారు. నిన్న అబుదాబీ, పిలిఫిన్స్ నుంచి రెండు అంతర్జాతీయ విమానాలు విశాఖకు వచ్చాయని, విమానాల్లో వచ్చిన వారిని ఆయా జిల్లాల్లోని క్వారంటైన్‌కు తరలించామన్నారు. ఇందులో విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 84 మందిని క్వారంటైన్‌కు తరలించామన్నారు. కోవిడ్ ఆస్పత్రి విమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో 29 మంది కరోనా పేషంట్స్ ఉన్నారన్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, విజయనగరం 2, విశాఖపట్నం 10, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు 14 మంది ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. వలస కార్మికులు ఉండాలంటే విశాఖ సిటీలో షెల్టర్లు ఉన్నాయని, లేదా.. వారు స్వస్థలాలకు వెళ్లాలనుకుంటే బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది ఎదురవ్వకుండా చూసుకుంటున్నామన్నారు. అదే విధంగా గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకు చేరుకున్నారని, మరో నాలుగు రోజుల్లో వెంకటాపురంలో వైయస్‌ఆర్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్ మొత్తాన్ని కొరియాకు తరలించామన్నారు.