రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు

క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించి ఆర్థిక సాయం చేస్తాం 

 ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ 

 అమరావతి : రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలను నిర్మిస్తామని పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌  తెలిపారు. ఈ మూడింటిలో ఒక దానిని అంతర్జాతీయ స్టేడియంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్రీడాభివృద్ధి విషయమై జిల్లా స్పోర్ట్స్ అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. క్రీడాకారులను గుర్తించి ఆర్ధిక సహాయం  అందిస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించాలని, రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్స్‌ను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లో మూడు ప్రాంతాల్లో మూడు ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. అన్ని జిల్లాల క్రీడాకారులను కలిపేలా మెగా ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యువత కోసం నెలకు ఒక కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. విలువలతో కూడిన సమాజం కోసం ఇలాంటివి అవసరమని వ్యాఖ్యానించారు. భారత దేశ గొప్పతనం చాటి చెప్పే విధంగా యువత కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top