స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ అవసరం లేదు

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ:  స్కిల్ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ (నైపుణ్యాభివృద్ధి సూచిక)ను రూపొందించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. అయితే నైపుణ్య లోపాలపై పేరెన్నికగన్న సంస్థలు చేపట్టిన అధ్యయనాల ద్వారా పలు రంగాలలో నైపుణ్యాభివృద్ధి అవసరాలు, నైపుణ్య లోపాలకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు అందిందని చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా ఎక్కడెక్కడ నైపుణ్య అవసరాలు, అవకాశాలు ఉన్నాయో అర్థం చేసుకునే వీలు కలిగింది అన్నారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్‌ కమిటీలు, జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రణాళికలను రూపొందించి తద్వారా కింది స్థాయిలో డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్‌ ప్రక్రియను ప్రోత్సహించే వీలు కలుగుతుందని అన్నారు.  డిఎస్‌డిపి (డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్) ద్వారా ఏఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో, నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కడ ఉన్నదీ గుర్తించవచ్చనిమంత్రి తెలిపారు.
ఉమ్మడి నిబంధనలు, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్ అమలు పరచడం, స్కిల్ ఇండియా పోర్టల్‌లో డేటా విలీనం చేయడం ద్వారా వివిధ రంగాలలో గుర్తించిన నైపుణ్య లోపాలను పూరించడం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వేర్వేరు కార్యక్రమాలు అలాగే ఇందులో  భాగస్వామ్య పక్షాలైన రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య సమన్వయం చేయడం, శిక్షణ వాతావరణం కల్పించడం కోసం ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను అభివృద్ధి చేసి అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
నైపుణ్యాల అభివృద్దిలో వేర్వేరు దేశాలు భిన్నమైన బెంచ్ మార్కులను అనుసరిస్తాయని మంత్రి తెలిపారు. భారతదేశంలో నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ ఎనిమిది స్థాయిల్లో కూర్చబడిందని, ప్రతి స్థాయిలోనూ ఆ స్థాయికి సంబంధించి అవసరమైన సామర్థ్యం ప్రదర్శించేందుకు అవగాహన దని అన్నారు. ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్) వరల్డ్ ఇండికేటర్స్ ఆఫ్ స్కిల్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది  సందర్భోచిత కారకాలు, నైపుణ్య సముపార్జన, అవసరాలు, ఆర్థిక, వాటి వలన కలిగే సామాజిక ఫలాలు వంటి 5 ఏరియాల్లో మొత్తం 64 ఇండికేటర్లు కలిగి ఉంటుందని  తెలిపారు. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఈ సూచికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు.

Back to Top