చంద్రబాబు రెక్కలు లేని అక్కుపక్షి

మంత్రి అంబ‌టి రాంబాబు

అమ‌రావ‌తి:  సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. చంద్రబాబుకు అసలు రెక్కలున్నాయా..? ఆయ‌న‌ రెక్కలు లేని అక్కుపక్షి అంటూ ధ్వ‌జ‌మెత్తారు. కమ్యూనిస్టులో.. బీజేపీ వాళ్లో రెక్కలిస్తే ఎగిరేవాడు చంద్రబాబు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేయాలని ఆలోచన చేశారా..? అని నిల‌దీశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన చేశారా..? అని మంత్రి అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. బుధ‌వారం మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...

వైయస్ఆర్ గారు శంకుస్థాపన చేస్తే.. వైయస్ జగన్ గారు పూర్తి చేశారు
            రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి చేతులు మీదగా నెల్లూరు జిల్లాలో రెండు అతి కీలకమైన బ్యారేజీలను జాతికి అంకితం చేయడం జరిగింది. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు హయాంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు అవి. పెన్నానది మీద రెండు బ్యారేజీలు కొత్తగా నిర్మించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్‌ కాలంలో బ్యారేజీల స్థానంలో ఆనకట్టలు మాత్రమే ఉండేవి. కాలానుగుణంగా ఆ ఆనకట్టల స్థానంలో పటిష్టమైన బ్యారేజ్‌లు నిర్మించి మరింత భూమిని సాగులోకి తీసుకురావాలనేది ప్రజల చిరకాల కోరిక. చాలాఏళ్లుగా ఆ చిరకాల కోరిక అలాగే మిగిలిపోయింది. డాక్టర్‌ వైయస్సార్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాక వాటి మీద దృష్టి పెట్టి ఆ రెండు బ్యారేజీలకు శంకుస్థాపన చేశారు.

- సంగం బ్యారేజీ 2006లోనూ, నెల్లూరు బ్యారేజీకు 2008లోనూ,  డాక్టర్ వైఎస్సార్‌ గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 16ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రెండు బ్యారేజీ  పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒకవైపు కొవిడ్, మరోవైపు వరదలు వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించి వాటిని జాతికి అంకితం చేశారు. ఇది వాస్తవ పరిస్థితి.

బాబు రెక్కల కష్టం అనడానికి వారికి సిగ్గు ఎక్కడలేదు..?
        రెండు బ్యారేజీలను నిన్న సీఎం గారు ప్రారంభించిన తర్వాత.. అవి చంద్రబాబు రెక్కల కష్టంతో పూర్తి చేస్తే, జగన్‌గారు వెళ్లి రిబ్బన్‌ కట్ చేశారంటూ టీడీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు. అబద్ధం చెప్పినా అతికేలా ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంతేకానీ పచ్చి అబద్దాలు, అవాస్తవాలను తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకున్నారు. బ్యారేజీ పనులు అన్నీ చంద్రబాబుగారి హయాంలో జరిగాయనడానికి, జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ఎలాంటి సంబంధం లేదనే మాటలు మాట్లాడటానికి రవ్వంత సిగ్గు అయినా ఉండాలి, కాస్త ఆలోచన అయినా ఉండాలి. అలా మాట్లాడే వారికి, రవ్వంత సిగ్గులేదు, ఆలోచనా లేదు సరికదా... ఏదోవిధంగా ప్రచారం చేసుకోవాలని తాపత్రయ పడుతున్నారు.

- వీటికి సంబంధించి వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజలతో పాటు టీడీపీ వాళ్లు కూడా వాస్తవాలు తెలుసుకోవాలని చెబుతున్నాం. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణానికి సవరించి అంచనా ప్రకారం మొత్తం విలువ రూ.335.8 కోట్లు. దానిలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు రూ. 30.85 కోట్లు, టీడీపీ అయిదేళ్ల పాలనలో రూ. 86.01 కోట్లు ఖర్చు పెట్టారు. అదే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ.131 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇది ఎవరి రెక్కల కష్టం. దీనిని ఎవరు ప్రారంభించారు.. అన్నది తెలుసుకుంటే మంచిది. 

చంద్రబాబు ఒక అక్కుపక్షి
        చంద్రబాబుకు అసలు ఏ రెక్కలున్నాయి? ఆయన కష్టపడటానికి!.  చంద్రబాబు రెక్కలు ఉన్న ఒక అక్కుపక్షి. నెల్లూరు బ్యారేజీకి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం విలువ రూ.274.83 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందు రూ. 86.62కోట్లు ఖర్చు పెట్టారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో, ఐదేళ్ళలో రూ. 71.54 కోట్లు ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మూడేళ్ల కాలంలో రూ. 77.37 కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీని పూర్తి చేసి, ప్రారంభిస్తే ఇది ఎవరి రెక్కల కష్టం అంటారు? చంద్రబాబు నాయుడుకు అసలు రెక్కలు ఉన్నాయా కష్టపడటానికి? చంద్రబాబు రెక్కలు ఉన్న పక్షేనా? ఆయన స్వయంగా ఎగరగలుగుతారా? చంద్రబాబు రెక్కలు ఉన్న అక్కుపక్షి. ఎందుకంటే రాజకీయంగా ఎగిరేందుకు ఆయనకు ఎవరో ఒకరి రెక్కలు కావాలి. సీపీఐ, సీపీఎం లేకుంటే బీజేపీ రెక్కలు, పవన్‌ కల్యాణ్‌ రెక్కలు కావలి తప్ప... సొంతంగా ఎగురలేని అక్కుపక్షి చంద్రబాబు. అయినా ఆయన రెక్కల కష్టంతో ఇవన్నీ జరిగాయని అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేసుకుని బతకాలనుకోవడం దురదృష్టకరం.

14 ఏళ్ళు సీఎంగా ఉండి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..?
        చంద్రబాబు నాయుడు 14ఏళ్ల పాటు అధికారంలో ఉండి... ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను అయినా పూర్తి చేశారా, ప్రారంభించారా? ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను అయినా పూర్తి చేసి జాతికి అంకితం చేశారా?. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అయినా చంద్రబాబు ఎన్నడైనా చేశారా... అని సూటిగా అడుగుతున్నాం.

-  పోలవరం ప్రాజెక్ట్‌ సహా ఇవాళ పనులు జరుగుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌లు అన్నీ కూడా ప్రారంభించింది  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారే. జలయజ్ఞంలో భాగంగా 26 ప్రాజెక్ట్‌లు వైయస్సార్‌ గారు ప్రారంభించినవే. ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి, కానీ ఏ  ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. వైఎస్ గారు ప్రారంభించిన  ఆ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు తన 14ఏళ్ల పాలనలో రైతులకు నీళ్లు ఇవ్వాలని కానీ, సముద్రంలో వృథాగా పోతున్న నీటికి ఆనకట్ల ద్వారా, ప్రాజెక్ట్‌ల ద్వారా అడ్డుకుని రైతాంగానికి అందించాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి.  అలాంటి ఆయన ఎవరో ఏదో చేస్తే ..అదంతా తన గొప్పతనమే అని చెప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. దానికి తగ్గట్లుగా, చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే  ఆ రెండు పత్రికలు, ఆ మూడు టీవీ ఛానళ్ళు అభూత కల్పనలతో వార్తలను వండి వారుస్తున్నాయి.

ప్రాజెక్టులు పూర్తి కాకూడదు-పరిశ్రమలు రాకూడన్నదే బాబు అండ్ కో ఆరాటం
        పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ముంపు ఏర్పడుతుందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలు న్యాయస్థానికి వెళ్లాయి. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆయా రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దాన్ని మాత్రం  ఫ్రంట్‌ పేజీలో, పతాక శీర్షికలుగా వేసి పోలవరంలో ఏదో గందరగోళం జరిగిపోతుందని, పోలవరం నిర్మాణం ఆగిపోతుందనే ధోరణితో ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు రాశారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి కాకూడదని, ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాకూడదని చంద్రబాబు నాయుడు ఆయనకు ఉన్న ఎల్లో మీడియా ఆరాటపడిపోతున్నాయి.

- కాకినాడ సెజ్ లో బల్క్‌ డ్రగ్‌ ఫార్మా కంపెనీను కేంద్రం మంజూరు చేస్తే.. పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందంటూ, ఆ పరిశ్రమ వద్దంటూ యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశాడు. ఆ పరిశ్రమ కోసం దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడితే ... చివరకు ఏపీ, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌కు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనివల్ల దాదాపు రూ.15వేల కోట్లు మేరకు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. దానితో పాటు వేలాది మందికి ఉపాధి కలుగుతుందని భావిస్తే... ఆ ఫార్మా పరిశ్రమ ఇక్కడకు రావడానికి వీల్లేదంటూ లేఖ రాయడానికి, టీడీపీకి ఏమి పోయేకాలం వచ్చిందని అడుగుతున్నాం.

-  మీ రాజకీయ ప్రత్యర్థి ఇంట్లో ఉన్నాడని... ఇల్లు మొత్తాన్ని తగలేయాలనే ఆలోచన చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయ పక్షం తెలుగుదేశం పార్టీ. ఇది చాలా దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాకూడదని కోనసీమలో పండే కొబ్బరికాయలు అన్నీ తీసుకువచ్చి కొడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. 

అసెంబ్లీలో చర్చిద్దాం.. రా బాబూ..!
ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే  పారిపోయారు
పోలవరం ప్రాజెక్ట్‌ గురించి నేను అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పిన నాథుడే లేడు. మళ్లీ మళ్ళీ టీడీపీని ప్రశ్నిస్తునే ఉంటాను, సమాధానం చెప్పాలని అడుగుతూనే ఉంటాను. చేతనైతే, అసెంబ్లీలో చర్చిద్దాం రా.. చంద్రబాబూ..!

        1. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, పోలవరం ప్రాజెక్ట్‌ను కట్టితీరాల్సింది కేంద్ర ప్రభుత్వం అని చట్టంలో పెడితే.. మేమే కడతామంటూ తగుదునమ్మా అని ఎందుకు తీసుకున్నారు? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి.

    2. కేంద్రం నిర్మాణం చేస్తే త్వరగా పూర్తికాదని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్ట్‌ కడితే త్వరగా అయిపోతుందని, 2018కే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు సర్కార్‌- 2018కి ఎందుకు పూర్తి చేయలేదు?

    3. కాఫర్‌ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఇది చరిత్రత్మాక తప్పిదం కాదా అని అడుగుతుంటే... దుష్ట చతుష్టయం (చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు) దీనికి సమాధానం చెప్పకుండా, అడ్డగోలు రాతలతో, ఏదేదో మాట్లాడుతూ, ఆ తప్పులన్నీ వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం మీద రుద్దాలని,  పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని మా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనే భావనను ప్రజలకు కలిగించేలా వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం. 

        ఈ రాష్ట్రంలోని ఏ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయినా పూర్వ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగినవే. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం ద్వారా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు 14ఏళ్ల తన పాలనలో ఇరిగేషన్‌ గురించి, ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించిన సందర్భమే లేదు. పైపెచ్చు బ్యారేజీలు వాళ్లు కడితే మేము రిబ్బన్‌ కట్‌ చేశామంటూ చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. దీనివల్ల మీ పలుకుబడి పెరిగదు సరికదా... ప్రజల్లో మరింతగా దిగజారిపోతారనేది వాస్తవం.

 - నెల్లూరు, సంగం రెండు బ్యారేజీల అంచనా విలువ రూ. 610 కోట్లు. వాటికి, టీడీపీ హయాంలో రూ. 150.55 కోట్లు ఖర్చు పెడితే ఎంత పూర్తయినట్లు..? వాటిని గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు.

- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నాడా? అప్పుడేమీ మాట్లాడలేదే? వీటి గురించి కనీసం ఆలోచన చేయలేదే. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల గురించి ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌గారు. ఆయనే వీటికి శంకుస్థాపన చేసింది కూడా. వ్యవసాయం అంటే తెలిసిన నాయకుడు, రైతుల గురించి ఆలోచన చేశారు కాబట్టే.. ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తే.. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేశారు. మధ్యలో వచ్చిన మీరు.. ఏం చేయకుండా..  మాదే ఆ ఘనత అని చంకలు గుద్దుకోవడం సిగ్గుచేటు.

- ఏ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయినా రాజశేఖర్‌ రెడ్డిగారి ఆలోచనే. చంద్రబాబు నాయుడు పచ్చి మోసం చేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడు. అతన్ని నమ్మే పరిస్థితిగానీ, ఆ అవసరంగానీ ప్రజలకు లేదు. కేవలం డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేసి కమీషన్లు కొట్టేశారు. 

- నెల్లూరులో రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తే.. మా రెక్కల కష్టం అని, ఎవరో చేసిన దానిని తమది అని చెప్పుకునే దౌర్భాగ్యపు మనస్తత్వంతో చంద్రబాబు, టీడీపీ వాళ్లు ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఆపేయమన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్‌ పేజీలో వార్తలు రాస్తూ అల్లాడిపోతున్నారు. ఈ దుష్ట చతుష్టయానికి ఎందుకంత జెలసీనో అర్థం కావడం లేదు.

-  వైయస్ జగన్‌ గారు అధికారంలో ఉన్నంతకాలం ఎవరూ అప్పులు ఇవ్వకూడదు. మా ప్రభుత్వమే అప్పలు చేసినట్లు, చంద్రబాబు అసలు అప్పులే చేయనట్లు. వాళ్లు చేస్తే సంతోషం... అదే మేము అప్పులు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో అంటూ తెగ బాధ పడిపోతున్నారు. ఈ బుద్ధిని మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

- వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి మీద కోపం ఉంటే ఉండుగాక. దానివల్ల పోలవరం ప్రాజెక్ట్‌ నాశనం కావాలి, బ్యారేజీలు నాశనం కావాలి, దానివల్ల రాష్ట్రం నాశనం కావాలి, పెట్టుబడులు రాకూడదనే దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు అండ్ కో చేస్తున్నారు. దమ్ముంటే వైయస్ జగన్‌గారిని ఎన్నికల్లో ఎదుర్కోవాలని సవాల్‌ విసురుతున్నాం.

Back to Top