మీ ముగ్గురూ కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా..?

సైకిల్‌కు ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే.. దీనికి ఏఐతో పనేంటి బాబూ..?

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్

మూగబోయిన ప్రజాగళం మీ ఓటమికి నాంది..!

మైకు వినిపించకపోవడం భద్రతా వైఫల్యమా.. మీ చేతగానితనమా!

జనం రాకపోతే మాపై నిందలా

ప్రజాగళంతో బొక్కబోర్లా పడ్డారు.. వారి బలహీనతను చాటిన సభ

ఒంటరిగా పోటీ చేయలేకపోవడం.. చంద్రబాబు వైఫల్యం కాదా..!

2014లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీ ముగ్గురే కదా..!

ప్రజల గుండెల్లో జగన్‌ గారి బొమ్మను చెరిపేయడం మీ తరం కాదు

మంత్రి అంబటి రాంబాబు

ప‌ల్నాడు: మీ ముగ్గురూ కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా..? అని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన మూడు పార్టీల సభ అట్టర్‌ ప్లాప్‌.. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి  ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు. నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది?. ముగ్గురు కలిసి పోటీ చేసినా సీఎం వైయ‌స్ జగన్‌ను ఓడించలేరు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావంతో బతుకుతున్నారు. ప్రజాగళం సభలో మైక్‌ మూగబోయింది. మైక్‌ కూడా సరిచేసుకోని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించారు.

 సీఎం జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్‌ పరుగులు పెట్టించారు. సీఎం జగన్‌ సభలకు ప్రజలు తరలివస్తున్నారు. ఆ మూడు పార్టీల సభలను  జనం పట్టించుకోవడం లేదు. పవన్‌తో కాదని తెలిసి మోదీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు అండ్‌కో ఎంత బురదజల్లినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు’’ అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు మంగ‌ళ‌వారం స‌త్తెన‌ప‌ల్లిలో మీడియాతో మాట్లాడారు.

మంత్రి అంబ‌టి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు నాయకుడు కాదు-అతనొక మానిప్యులేటర్:
– నారా చంద్రబాబు నాయుడు తనపై వైఎస్‌ఆర్‌సీపీ కావాలని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చెప్పుకుంటున్నాడు. 
– సాక్షాత్తూ ప్రధానిమంత్రి మోదీ గారే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చిలకలూరిపేట సభకు హాజరైతే..వారి చేతగానితనంతో సభ అట్టర్ ప్లాప్ అయితే.. పోలీసు యంత్రాంగం కనీస భద్రత కల్పించలేదనే దుష్ప్రచారానికీ దిగాడు.  
– చంద్రబాబు నాయుడు మీద ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎవరైనా దుష్ప్రచారం చేయాలా..? ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేయాల్సిన పనుందా..? 
– భారత దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడంత అనైతికమైన రాజకీయ నేత ఎవరూ లేరు. 
– ఆయన ప్రజానాయకుడు కాదు. అతనొక మానిప్యులేటర్‌. అనేక మోసాలు చేసి అధికారంలోకి రావాలనే నీచమైన మనస్తత్వం కలిగిన నాయకుడనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైంది. ఇది పచ్చి నిజం.
– అలాంటి నీచమైన, దుర్మార్గమైన చంద్రబాబు మీద దుష్ప్రచారానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించాల్సినంత అవసరమేముంది..?

సైకిల్‌కు ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే
– ముస్లీంల గురించి చంద్రబాబు ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది. ముఖ్యంగా ముస్లీంలకు చాలా బాగా గుర్తుంది. 
– ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సైకిల్‌కు ఓటు వేస్తే.. ముస్లీంలకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇచ్చారే.. ఆ రిజర్వేషన్లు పోయినట్టే.. ఇది సత్యం. 
– డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కొనసాగాలంటే.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలి. 
– తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. అమిత్‌షా ముస్లీం రిజర్వేషన్ల గురించి ఏ మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. వారు అధికారంలోకి రాగానే ముస్లీంల రిజర్వేషన్లు రద్దు చేస్తామనే మాట మాట్లాడారు. దీన్నిబట్టి.. ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే.. మొదటిగా వారు చేసేది.. ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని గుర్తు చేసుకోవాలి. 
– అలాంటప్పుడు ముస్లీం మైనార్టీలకు ఇది అవసరమా..? పనిగట్టుకుని తమ రిజర్వేషన్ల రద్దు కోసమని చంద్రబాబుకు ఓటు వేయాల్నా..? అనేది అందరూ ఒక్కసారి ఆలోచించండి. 
– కిందటి ఎన్నికల్లో ఇదే చంద్రబాబు ఏమన్నాడు..? జగన్‌మోహన్‌రెడ్డికి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నాడు కదా..? మరి, ఆనాడు బీజేపీకి సపోర్టు చేస్తే ముస్లీంల పరిస్థితేంటో నువ్వే చెప్పావు. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏముంది..? నీ మాటలు నీ వీడియోలే ప్రజలు చూస్తున్నారు. ఎవరూ పనిగట్టుకుని నీ మీద దుష్ప్రచారం చేయడం లేదే..? 

2014లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీ ముగ్గురే కదా..
– 2014లో మీ ముగ్గురూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అప్పుడు ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో.. ఒక్కసారి ఆలోచించుకోండి. 
– బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఏం జరిగిందో.. మీరూ మీరూ ఎన్ని దుర్భాషలాడుకున్నారో మేం ప్రత్యేకంగా చెప్పాల్నా..? 
– మోదీ గారిని మీరేమన్నారో..? మిమ్మల్ని మోదీ గారేమన్నారో..? మీ ఇద్దర్నీ కలిపి పవన్‌కళ్యాణ్‌ ఏమన్నాడో..? ఎంతగా తిట్టుకున్నారో.. కొట్టుకున్నారో.. ఎంత నీచంగా మాట్లాడుకున్నారో.. ఆ వీడియోలన్నీ ఆర్టిఫిషీయల్‌ ఇంటెలీజెన్స్‌నా..? 
– మీరు మీరూ ఒకరినొకరు తిట్టుకున్న మాట వాస్తవం కాదా..? ఎవరు ఎవర్ని ఏమన్నారో మరిచిపోయారా..? 
– పవన్‌కళ్యాణ్‌ నోటి వెంట పలికిన పాచిపోయిన లడ్డూలు అన్నమాట మరిచిపోయారా..? ఇవన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తోనే వచ్చాయా..? 
– మీ ముగ్గురు కలిసి జగన్‌మోహన్‌రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే.. పొరబాటున మీకు ఓటేసిన పాపానికి ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు గదా.. ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. 

మళ్లీ మీకు అధికారమివ్వడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదుః
– కలిసి పరిపాలన చేశారు. విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు. విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళకొకళ్ళు జుట్లు పట్టుకుని ఇవాళ మళ్ళీ కలిసొచ్చాం.. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండంటే.. ప్రజలంత అమాయకులా..? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళా..? 
– ఆల్రెడీ ఒకసారి మీ పరిపాలన చూశారు. మీ కుమ్ములాటలూ చూశారు గదా..? 
– ఇంతా చూశాక మళ్ళీ మీ కూటమికి ఓటు వేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు గాక లేదనేది స్పష్టంగా అందరికీ అర్ధమవుతూనే ఉంది. 

అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు నైజంః
– మొన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ ఎలా జరిగింది..? ఆ తర్వాత ఏం జరిగింది..? తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి జెండాలు పట్టుకున్నంత మాత్రాన ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించిన తెలుగుదేశం పార్టీకి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి..? 
– పవన్‌కళ్యాణ్‌ మనతో కలిసినప్పటికీ, ప్రజల్లో మాత్రం స్పందనలేదని.. తెలుగుదేశం పార్టీ ప్లాన్‌ బెడిసికొట్టిందని నిరాశపడిన మాట వాస్తవమా..? కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. 
– అంతటితో ఆగకుండా.. మనిద్దరి వల్ల కాదంటూ.. కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా పొత్తుపెట్టుకుందామని ఢిల్లీకి వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకున్నారే.. అంత దిగజారుడుతనం ఎందుకు..? అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనేదే చంద్రబాబుకు తెలిసిన విద్య కాబట్టేగా..?
– ఒకప్పుడు మోదీ టెర్రరిస్టు అని చెప్పిన చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్‌షా ఇంటి ముందు పడిగాపులు పడి మొత్తానికి వాళ్ల కాళ్లు పట్టుకుని మరోసారి పొత్తు పెట్టుకున్నారు. ఇది మేమంటున్న మాట కాదు. వాళ్లే మీడియాలో చెప్పుకుంటున్న నిజాలివి. 

ప్రజాగళం అట్టర్‌ఫ్లాప్‌.. మీ బలహీనత చాటుకున్న వేదికః
– చిలకలూరిపేటలో మూడు పార్టీల కూటమి బహిరంగ సభ జరుగుతుందని .. మా గ్రాఫ్‌ పెరగబోతుందని భారీస్థాయిలో హైప్‌ క్రియేట్‌ చేశారు. ప్రజాగళంతో బొక్కబోర్లా పడ్డారు. 
– చిలకలూరిపేట ప్రజాగళం సభ ఏం సందేశం ఇచ్చిందో చెప్పగలరా..? 
– మీ బలహీనతను తెలియజేసిన సభ అది. మీ ముగ్గురు జట్టుకట్టి పోటీచేసినా మీకు బలం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఓడించలేరనే స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్రప్రజానీకానికి తెలియజెప్పిన సభగా ప్రజాగళం నిలిచింది. 
– సాక్షాత్తూ ప్రధానిమంత్రి మోదీ గారు వచ్చి మాట్లాడినటువంటి సభ అయినప్పటికీ.. ఆ సభ తర్వాత కూడా మీకు హైప్‌ రాలేదు. గ్రాఫ్‌ పెరగలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలేదు. 
– ప్రజాగళం సభలో మీరు మాట్లాడిన తీరును బట్టే.. మీరు ఓటమిని అంగీకరించారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. 

ఇది బాబు వైఫల్యం కాదా..
– జెండా సభ తర్వాత చంద్రబాబులో ఒక అభద్రతా భావం వచ్చింది. ప్రజాగళం తర్వాతనూ మీలో అదే అభద్రతా భావం కనిపిస్తుంది. మీ జీవితాంతం అభద్రతా భావంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. 
– డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు, మీరూ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు కదా..? ఆయన జగన్‌మోహన్‌రెడ్డి గారికి తండ్రి. ఆయన హఠాన్మరణం చెందితే.. వారి కుమారుడు పెట్టిన పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాగా.. అప్పుడెప్పుడో రాజకీయాల్లోకొచ్చిన నువ్వు .. నీ కుమారుడు వయస్సున్న రాజశేఖర్‌రెడ్డి గారి బిడ్డతో తలపడేందుకు సింగిల్‌గా రాలేకపోతున్నావే..? ఇది నీ వైఫల్యం కాదా..? ఇది నీ అభద్రతాభావం కాదా..? నీ బతుకంతా అభద్రతా భావమే కదా..? అని అడుగుతున్నాను. 

మైకు వినిపించకపోతే భద్రతా వైఫల్యమా..?
– రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందంటావు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానంటావు.. ఎన్నో మహానాడులు తీర్చిదిద్దానంటావు.. నీ జీవితంలో జగన్‌ గారి కంటే ఎన్నో బహిరంగ సభలు నిర్వహించావు కదా..? ప్రధానిమంత్రి వస్తుంటే మైకు కూడా సరిచేసుకోలేని వాడివి. మైకు వినిపించకపోతే.. అది భద్రతా వైఫల్యమా..? అది నీ నిర్లక్ష్యం కాదా..? అది నీ చేతగానితనం.. అభద్రతా భావం కాదా..? 

మూగబోయిన ప్రజాగళం మీ ఓటమికి నాంది..
– ప్రజాగళంలో మైకు మూగబోయిందంటే అది అపశకునం కాదా..? అది మీ ఓటమికి దారితీస్తుందనే అర్ధం కాదా..? అని ఆలోచించుకోండి.. 
– ప్రధాని హాజరై మాట్లాడే ఒక బహిరంగ సభలో మైకు సరిగ్గా పెట్టుకోకుండా.. మైక్‌ మిక్సర్‌ ఎక్కడో పబ్లిక్‌ మధ్య ఉంచుకుని.. అది పనిచేయకపోతే.. భద్రతావైఫల్యమని ప్రభుత్వం మీద నెట్టేస్తున్నావే.. ? ఇది నీ రాజకీయ దిగజారుడుతనం కాదా చంద్రబాబూ ..? దీనికి గుండెలపై చేయ్యేసుకుని నీకు నువ్వు సమాధానం చెప్పుకో.. 

జనం రాకపోతే.. మాపై నిందలా..?
– నువ్వు , పవన్‌కళ్యాణ్, మోదీ మాట్లాడుతున్నప్పుడు సభా ప్రాంగణంలో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా..? అలా ఎందుకున్నాయి..? అది కూడా ప్రభుత్వ భద్రతా వైఫల్యమా..? ఇదంతా సరుకులేని వ్యవహారమే కదా..? నువ్వు.. నీ పార్టీకెటూ సరుకులేదు. ముగ్గురు కలిసినా మీ దగ్గర సరుకులేదు. జనం మీ సభకు రాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉంచుకుని.. ఇంత వైఫల్యం చెంది.. ప్రభుత్వం మీద నిందలేస్తారా..? 
– ఎంతకాడికి, మీ చేతగానితనాన్ని జగన్‌గారి మీద నెడదామా..? ప్రభుత్వం మీద తోసేద్దామా..? పోలీసు అధికారులపై నెట్టేదామా..? అనే నీచమైన ఆలోచనే గానీ.. మీ ముగ్గురి పట్ల ప్రజలకెందుకు నమ్మకం కలగడం లేదనే ఆలోచించుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. 

ప్రజల గుండెల్లో జగన్‌ గారి బొమ్మ చెరిపేయడం మీ తరం కాదుః
– ఎక్కడ చూసినా జగన్‌ గారి బొమ్మే కనిపిస్తుందంట. పుస్తకాల్లో, ఇంటి పట్టాలపై, పథకాలపై ఆయన బొమ్మే కనిపిస్తుందని తెగ ఆందోళన పడుతున్నావే.. నువ్వు వాటిని ఏదొకటి చేసి చెరిపేయగలవేమో గానీ.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి రాజశేఖర్‌రెడ్డి బిడ్డ శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి బొమ్మను చెరిపేయడం మీ తరం కాదని తెలుసుకోండి.. 
– ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి .. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి .. సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో చెక్కుచెదరని నాయకుడిగా నిలిచిపోయిన జగన్‌ గారి ఆనవాళ్లను చెరిపేయడం మీకు సాధ్యమా..? అని అడుగుతున్నాను. 
– మీ ముగ్గురు కాదు.. ముక్కోటి మందితో జట్టుకట్టి వచ్చినా .. ప్రజల గుండెల్లో జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న బొమ్మను ఎవరూ చెరపలేరు. ఇది సత్యం.. ఇది యథార్థం. 

175కి 175 స్థానాలూ వైఎస్‌ఆర్‌సీపీవే..
– ఈ విషయాన్ని జూన్‌ 4న చూస్తారు.. ఒక్కసారి ఎన్నికల పోలింగ్‌ మొదలైన తర్వాత ప్రజలంతా ఫ్యాన్‌ గుర్తుపై బటన్‌ నొక్కుతున్న క్రమంలో మీ గుండె ఆగిపోతుందేమో చూసుకోండి.. 
– నువ్వెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. ఎల్లోమీడియా ఉందని.. దాన్ని అడ్డంపెట్టుకుని దుష్ప్రచారం చేసినా..జగన్‌మోహన్‌రెడ్డి గారిపై బుట్టలు బుట్టలుగా బురదజల్లినా.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు దిగొచ్చినా ప్రజల గుండెల్లోని జగన్‌మోహన్‌రెడ్డి గారి బొమ్మను చెరపడం ఎవరివల్లా సాధ్యం కాదని గుర్తు చేస్తున్నాను. 
– ప్రజాగళం సభ అట్టర్‌ఫ్లాప్‌ అవగా.. ఆ విషయం పక్కదోవ పట్టించాలనే దిశగా చంద్రబాబు అండ్‌ కో ప్రభుత్వం మీద, జగన్‌ గారి మీద దుష్ప్రచారానికి దిగాయనేది ప్రజలకూ తెలుసు. 
– రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండమైన మెజార్టీతో 175కి 175 స్థానాల్ని కైవసం చేసుకుంటుంది... ఇది సత్యం అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.  

Back to Top