అమరావతి: ప్రతిపక్ష సభ్యలు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ సభ్యులు చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడంతో మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియ దగ్గరకు ఎందుకు వస్తున్నారు. త్వరగా సస్పెన్షన్ చేయించుకోవాలని ఆరాటపడుతున్నారు. టీడీపీ సభ్యుల బాధ ఏంటో అర్థం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
అసలు టీడీపీ సభ్యులు ఎందుకు పోడియం దగ్గరకు ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కేవలం చంద్రబాబు ట్రైనింగ్‌లోనే వీళ్లంతా ఇలా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. ప్రతీరోజూ ఇలాగే చేస్తున్నారని, ఇవాళ త్వరగా సస్పెండ్ చేయించుకుని ఇళ్లకు వెళ్లాలని టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. స్పీకర్ అవకాశం ఇస్తున్నా వినడం లేదని.. తమ స్థానాల్లో ఉండి సమస్యేంటో ప్రశాంతంగా చెబితేనే విషయం అందరికీ అర్థం అవుతుందని టీడీపీ సభ్యులకు హితవు పలికారాయన.
దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ సభ్యులకు లేదని.. ఎన్టీఆర్ పక్షాన ఉన్న ఒక్క బుచ్చయ్య చౌదరికి మాత్రమే హక్కు ఉందని, మిగతా వాళ్లంతా చంద్రబాబు వెంట చేరి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన బాపతేనని అంబటి స్పష్టం చేశారు. ఈ క్రమంలో జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో టీడీపీ సభ్యులు గోల చేయగా.. ఎన్టీఆర్ జోహార్ అన్నంత మాత్రానా చేసిన పాపం పోదని పేర్కొన్నారు మంత్రి అంబటి.