విద్యా దీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం

తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుంది

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: పేదరికం చదువుకు అడ్డుకాకూడదని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని, మహానేత స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ విద్యా దీవెన (పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌) పథకాన్ని అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. విద్యా దీవెన నగదు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. కాలేజీ యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారన్నారు. తాడేపల్లిలోని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. విద్యా శాఖపై జరిగిన సమీక్షలో అన్ని విషయాలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారన్నారు. మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల నగదు తల్లుల ఖాతాల్లో ఎందుకు వేయాలనే ఆలోచనను కోర్టుకు వివరించడంలో ఎక్కడైనా లోటుపాట్లు జరిగాయా అని సమీక్షించారన్నారు.  

విద్యా దీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై రివ్యూ పిటీషన్‌ వేస్తున్నామని, కోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గత ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి.. రూ.2 వేల కోట్లు బకాయిలు పెట్టివెళ్లిపోయిందని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం కాలేజీలకు పెట్టిన బకాయిలు చెల్లించడంతో పాటు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామన్నారు. విద్యా దీవెన నగదు విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తే.. తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి విద్యార్థి చదువు గురించి ఆరా తీసి, కాలేజీ వసతులను పర్యవేక్షిస్తారన్నారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. 40 శాతం మంది యాజమాన్యాలకు చెల్లించట్లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.  

ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ వ్యవస్థను వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి సురేష్‌ తెలిపారు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం తీసుకువచ్చామన్నారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానంలో డిగ్రీలో విజయవంతమైందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top