అమరావతి: రాష్ట్రంలో విద్య, వైద్యం రంగాల్లో గత ప్రభుత్వం అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయని మండలిలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు. ఈ మార్పులు వైయఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సాధ్యమయ్యాయని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నాడు–నేడు పేరును మార్చినా, ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టిందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. ఇప్పటికే 90 శాతం పూర్తైన పాఠశాల అభివృద్ధి పనులను కూడా పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. పాఠశాలల్లో ఆర్‌వో సిస్టమ్‌లు పాడైనా మరమ్మతులకు నిధులు కేటాయించడం లేదని, డిజిటల్ బోర్డులు పనిచేయకపోయినా వాటిని సరిచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉన్న కాంట్రాక్ట్ కంపెనీలను రద్దు చేసి, చిన్నపాటి రూ.10 వేల మరమ్మతులు కూడా చేయడం లేదని విమర్శించారు. పాఠశాలలకు రేటింగ్ ఇస్తే దాని ఆధారంగా పనులు చేపడతామని నారా లోకేష్ చెప్పడం సమంజసం కాదని ఆయన అన్నారు. రెండు నుంచి మూడు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే మైక్‌లు కట్ చేసి ప్రతిపక్ష గొంతులు నొక్కుతున్నారని విమర్శించారు. ఈ విషయాలపై పూర్తి వివరాలతో చర్చకు రావాలని లోకేష్‌కు సవాల్ విసిరారు. ఇదే అంశాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రస్తావించారని పర్వతరెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలపై పారదర్శకంగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.