విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో అద్భుతమైనదని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష, ఆంధ్ర కి వైయస్ జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాలపై వైవీ సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువే చేసే వీలు ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఫేజ్ 1 సర్వే పూర్తయిందని చెప్పారు. ఫేజ్ -2 , ఫేజ్ -3 సర్వే లు జరుగుతున్నాయని తెలిపారు. క్యాంపుల్లో భాగంగా ఏడు రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఏకంగా 118 రకాల మందులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, క్షేత్రస్థాయిలో ఇవన్నీ పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆరోగ్య శ్రీ పథకంపై పూర్తి అవగాహన కల్పించేలా ఇంటింటికీ వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ కరపత్రాల్లో ఉన్న అన్ని అంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సెల్‌ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటి సర్వే కు వచ్చే సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్ని సెల్‌ఫోన్ లలో ఆరోగ్యశ్రీ అనువర్తనం డౌన్‌లోడ్ అయింది అనే దానిపై కూడా మదింపు ఉంటుందని తెలిపారు. ఎక్కుడ సెల్‌ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ అయితే ఆ వాలంటీర్లు బాగా పనిచేసినట్లుగా గుర్తించాలని కోరారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి దండోరా వేయించడం ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలిపారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు కూడా వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలని చెప్పారు. ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి బాగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్ధో నిపుణులు కూడా ఉండేలా చొరవ చూపాలని సూచించారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అన్ని గ్రామాలు, వార్డుల్లో జరిగే వైద్య శిబిరాలు ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలని చెప్పారు. టోకెన్ల పంపిణీ, కన్సల్టేషన్, పరీక్షలు, మందుల పంపిణీ, అవసరమైన రోగులను పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం.. ఇదంతా ఒక క్రమపద్ధతిన జరగాలని చెప్పారు. రోగులు ఎక్కువ సమయం శిబిరాల వద్దనే నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శిబిరాల్లో రోగుల సమయం వృధా కాకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా వీడియోలు, కరపత్రాలు, బ్యానర్లు లాంటివి వైద్య శిబిరాల్లో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, అనకాపల్లి వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.