మంగ‌ళ‌గిరిలో వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి ముసుగు

ముసుగు తొల‌గించి పాలాభిషేకం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు
 

మంగ‌ళ‌గిరి:  మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ ఆగ‌డాలో రోజు రోజుకు శృతి మించుతున్నాయి. యర్రబాలెం గ్రామంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అధికార టీడీపీ నేత‌లు ముసుగు వేసి తాళ్లతో కట్టేశారు. ఈ ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ ఆసుప‌త్రి వ‌ద్ద ఉన్న వైయ‌స్ఆర్ విగ్ర‌హం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ధ‌ర్నా చేప‌ట్టి ఆసుప‌త్రి సిబ్బందిని ప్రశ్నించగా మెడికల్ క్యాంపు నిర్వహించామని టిడిపి పార్టీ వారు విగ్రహాన్ని ఎవరికి కనిపించకుండా ఉంచాలని అనడంతో ముసుగు వేశామ‌ని చెప్ప‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి ఉన్న ముసుగు తొల‌గించి, పాలాభిషేకం చేసి నివాళుల‌ర్పించారు.   ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు బరిగళ్ళ కోటేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ప్రారంభించిన మహానేత పేదల పాలిట పెన్నిది అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో  గ‌తంలో విగ్ర‌హం ఏర్పాటు చేస్తే ఇప్పుడు తొల‌గించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. విగ్ర‌హాల‌కు ముసుగు వేయ‌వ‌చ్చేమో కానీ, మ‌హానేత‌ను ప్ర‌జ‌ల హృద‌యాల్లో నుంచి తొల‌గించ‌లేర‌ని హెచ్చ‌రించారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు స్వస్తీ ప‌ల‌కాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. 

Back to Top