వైయ‌స్ జ‌గ‌న్ రైతులను క‌లిస్తే త‌ప్పేంటి?

మ్యూజికల్ నైట్ లీగల్ అవుతుందా...?

శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫైర్‌

విశాఖ‌: మిర్చి రైతుల క‌ష్టాలు, న‌ష్టాలు తెలుసుకోవ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్తే త‌ప్పేంట‌ని, అది ఇల్లీగ‌లా అవుతుందా అని శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. మ‌రి విజ‌య‌వాడ‌లో అట్ట‌హాసంగా టీడీపీ ఆధ్వ‌ర్యంలో మ్యూజిక‌ల్ నైట్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం లీగ‌ల్ అవుతుందా అని చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం విశాఖ‌లో మాజీమంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌తో క‌లిసి బొత్స స‌త్యానారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. రైతులు, వ్యవసాయం దండగ అనే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేద‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్‌ మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసింద‌ని చెప్పారు. రైతుల‌కు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చంద్ర‌బాబు చెప్పడం ఎంత వరకు సమంజసమ‌న్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నివేదికల ను బహిర్గతం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. బురదజల్లడం కాదు ఆరోపణలు నిరూపించాల‌ని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేన‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ గుర్తు చేశారు. 

 

ఇంకా ఆయన ఏమన్నారంటే....

మాజీ సీఎం వైయస్ జగన్ కు భద్రత కల్పించలేదనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన అత్యంత అభ్యంతరకరం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు మాట్లాడే మాటలేనా ఇవి? అలా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విజయవాడలో ఈనెల 15న ఆర్భాటంగా నిర్వహించిన మ్యూజికల్ నైట్ కు సీఎం చంద్రబాబు హాజరైతే అది చట్టపరమైన కార్యక్రమం అవుతుంది, అదే మాజీ సీఎం వైయస్ జగన్ గుంటూరు మిర్చియార్డ్ లో రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేక కార్యక్రమం అవుతుందా? జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నా కూడా వైయస్ జగన్ కు భద్రత కల్పించకుండా కూటమ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సందర్భంలో ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి సీరియస్ అంశంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా భద్రత అనేది తనకు సంబంధించిన అంశం కాదని ఎలా అంటారు? 

- చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకోసమంటే..

ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవంకు చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. మరోవైపు మిర్చిరైతులు ధర లేక అల్లాడుతున్న నేపథ్యంలో వైయస్ జగన్ గారు వారిని పరామర్శించారు. వెంటనే సీఎం ఢిల్లీకి బయలుదేరి, మిర్చిరేట్లపై కేంద్ర మంత్రితో మాట్లాడటానికే వెడుతున్నట్లుగా అబద్దపు ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి కేంద్ర మంత్రిని ఒక రాష్ట్ర సీఎం కలుసుకునేందుకు వెడుతుంటే సదరు కేంద్రమంత్రి ఢిల్లీలో ఉన్నారో లేదో కూడా తెలియకుండానే బయలుదేరుతారా? ఢిల్లీకి వెళ్ళిన తరువాతే కేంద్రమంత్రి అక్కడ లేరని చంద్రబాబుకు తెలిసిందా? కేంద్ర మంత్రి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే చంద్రబాబు మిర్చిరేట్లపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్ళారా? ఆయన వెళ్ళింది సీఎం ప్రమాణస్వీకారానికి, కానీ మిర్చి రైతుల కోసం అంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఇదీ చంద్రబాబుకు రైతుల పట్ల ఉన్న ప్రేమ. ఈ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ ను కలిసారు. అంటే జగన్ గారు మిర్చిరైతులను కలిసి, వారి కష్టాలను వెలుగులోకి తీసకువచ్చే వరకు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం స్పందించ లేదు? ముందుగానే మిర్చిరేట్లను స్థిరీకరించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? మద్దతు ధర గురించి ఈ రోజు హడావుడిగా స్పందించడం చూస్తే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యవసాయం, రైతుల పట్ల చిత్తశుద్ది లేదు. చంద్రబాబుకు వ్యవసాయం శుద్ద దండుగా అనే అభిప్రాయం బలంగా ఉంది. 'యూరియా ఏదయ్యా' అని తెలుగుదేశంకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు పత్రికలోనే కథనం వచ్చింది. రైతులు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారంటూ సదరు పత్రికలోనే రాశారు. చివరికి తెలుగుదేశంకు వంతపాడే పత్రిక కూడా రైతుల కష్టాలను తన పత్రికలో రాయకపోతే ప్రజలు తమను చీత్కరించుకుంటారనే పరిస్థితిలోనే ఈ వార్తను ప్రచురించింది. దీనితో అయినా కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. ఇప్పటికైనా బ్లాక్ మార్కెటింగ్ ను తగ్గించి, రైతులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...

- ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  సిద్దాంతపరంగా, విధానాల పరంగా మాట్లాడితే దానిపై స్పదిస్తాం. వ్యక్తిగత ఎజెండాలకు రాజకీయాల్లో తావులేదు. 
- మిర్చియార్డ్ కార్యక్రమంకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు మా పార్టీ నుంచి ఎవరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దానికి ప్రచారం చేయడానికి ఆస్కారమే లేదు. రైతుల సమస్యపై మిర్చియార్డ్ కు వెడుతున్నామని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాం, దానికి అభ్యంతరం ఉంటే పోలీసులు ఎందుకు వద్దని చెప్పలేదు. కోడ్ పేరుతో సాకులు చెప్పడం దారుణం. 
- కూటమి ప్రభుత్వం ఏర్పడగానే యూనివర్సిటీ వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. తొమ్మిది నెలల తరువాత ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే యూనివర్సిటీలకు వీసీ నియామకాలు చేశారు. కోడ్ లో ఎలా ఇచ్చారని మా పార్టీ నుంచి ప్రశ్నించలేదు. 
- గ్రూప్ టు మెయిన్స్ జరుగుతున్నాయి. రోస్టర్ పాయింట్ మీద సమస్యలు ఉన్నాయని అభ్యంతరాలు వస్తున్నాయి. దీనిని సహేతుకంగా పరిష్కరించాలని కోరుతున్నాం. 
- ఎన్నికల తరువాత మెగా డీఎస్సీ అన్నారు. రోజురోజుకూ దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. 
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ పోటీ చేయడం లేదు. 
-  చిన్నపిల్లలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయం దౌర్భాగ్యం. పాలకొండకు వైయస్ జగన్ వచ్చినప్పుడు వేలాది మంది అభిమానంతో వచ్చారు. ఇటువంటి వాటిని కూడా రాజకీయం అనడం దుర్మార్గం. వారికి మంచి బుద్ది కల్పించాలని దేవుడిని కోరుకుంటున్నాం.
 

Back to Top