వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం 

కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా?

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

అమరావతి: వరదల కారణంగా పంటలు నష్టపోయిన చోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. పంటలు పోయిన రైతులకు వంద శాతం సబ్బిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారని, దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామన్నారు. రాయలసీమకు కృష్ణ నీటిని తరలించామని, కళ్లకు కనిపిస్తున్నా దేవినేని ఉమ, మిగతా టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని, వరదపై బురద రాజకీయాలు చేశారని కన్నబాబు మండిపడ్డారు. డ్రోన్‌ కోసం నానా రాద్దాంతం చేస్తున్నారని, అసలు ఈ రాష్ట్రంలో డ్రోన్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసింది బాబు కాదా? అని ప్రశ్నించారు. గతంలో గోదావరి పుష్కరాల్లో డ్రోన్‌ వాడలేదా..?, ప్రభుత్వం వరద వలన ఎవ్వరికి నష్టం లేకుండా చర్యలు తీసుకునేందుకు డ్రోన్ వినియోగించిందన్నారు. 

గత టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పని చేసిన కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీలో ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లడం చాలా దారుణమని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్‌ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా?, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని కన్నబాబు నిలదీశారు.  ఇదే పనిని ఒక సామాన్యుడు చేస్తే ఏమంటారు.. దొంగతనమో, చేతివాటమనో అనేవారని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Back to Top