నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే కోటంరెడ్డి తనకు అండగా నిలిచిన పార్టీకే ద్రోహం చేశాడు. అందుకే కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాపును చూసి బలమనుకుని భ్రమపడుతున్నాడు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పింది అబద్దమని శివారెడ్డి చెబుతున్నారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు ట్రాప్. శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ట్యాపింగ్ ఆరోపణలు నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ సందర్బంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీరోజు శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాల్లో పచ్చి డ్రామాలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు వరకు నేను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఈ మూడున్నర ఏళ్లలో నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీకు పార్టీ, కార్యకర్తలు అవసరం లేదు. డబ్బు మీదు నీకు ప్రేమ ఎక్కువ అందుకే ఎలాంటి పనిచేయడానికైనా నువ్వు వెనుకాడలేదు. శ్రీధర్ రెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుంది. కొన్ని రోజుల్లోనే ప్రజలకు నీ గురించి అన్ని విషయాలను చెబుతున్నారు. నువ్వు ప్రజలను, రియల్టర్లను, వ్యాపారులను ఎలా బెదిరించావో అందరకీ తెలుసు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు’ అని ఆదాల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.