పదవుల కోసం పచ్చి అబద్ధాలు

హామీల ఆచరణలో అసెంబ్లీలో చర్చకు టీడీపీ సిద్ధమా?

మాజీ ఎమ్మెల్సీ జూపూడి సవాల్‌

తిరుపతి : బూటకపు మాటలతో, అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపుతూ మేనిఫెస్టోను పూర్తిగా విస్మరించి ప్రజల్ని నట్టేట ముంచిన టీడీపీ నేతలు పదవీకాంక్షతో నేడు పచ్చి అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రజల్ని మోసపూరిత మాటలతో మభ్యపెట్టి దోచుకునే టీడీపీ పార్టీకి మేనిఫెస్టోపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 

ఏనాడైనా టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా..? అని ప్రశ్నించారు. 1995లో వెన్నుపోటుతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు మేము మైక్రోసాఫ్ట్‌ తెస్తే సత్య నాదెండ్ల చదువుకుని సీఈవో అయ్యారని చెప్పడం బాబు దగాగోరు తనానికి నిదర్శనమన్నారు. వాస్తవానికి 2004లో నాటి సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2014లో ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి కేవలం 10 శాతం కూడా అచరణలో పెట్టలేదన్నారు.

గత 14 ఏళ్లు సీఎంగా పాలన సాగించిన చంద్రబాబు ఏనాడూ దళిత, బడుగు, బలహీన వర్గాల పేదల అభ్యున్నతిని పట్టించుకున్న పాపానపోలేదని చెప్పారు.  ప్రజలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలకు ఇంగ్లిష్‌ చదువులు తెస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చరిత్ర బాబుదేనన్నారు.  

నిలకడలేని పవన్‌ కళ్యాణ్, అబద్ధాల దగాకోరు చంద్రబాబు, అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ ఎన్నికల బరిలో నిలిచినా 175 స్థానాల్లో పోటీచేసి పూర్తి స్థాయి గెలుపు సాధించే సత్తా వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దమ్ముంటే బాబు, అచ్చెన్నాయుడు అసెంబ్లీకి వస్తే మేనిఫెస్టోపై చర్చకు తాము సిద్ధమని జూపూడి సవాల్‌ విసిరారు.  

Back to Top