కట్టని ఇళ్ల వద్ద సెల్ఫీలు దిగటం సిగ్గుచేటు..

వైయ‌స్ జగన్‌ కడుతున్న ఊళ్లను చూస్తే బాబు గుండె ఆగుతుంది
 

నెల్లూరులో బాబు సెల్ఫీపై రాష్ట్ర మంత్రి జోగి రమేశ్‌

వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు రూ. 8,734 కోట్లు ఖర్చు చేసింది

బాబు వదిలిపెట్టిన బకాయిలనూ తీర్చాం

ఈ పథకం పేరిట చంద్రబాబు చేసింది అవినీతి మాత్రమే

బాబు వస్తే మేం కట్టిన ఇళ్లు చూపిస్తాం

 అమరావతి: నారా చంద్రబాబు, లోకేశ్‌ సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలుగా తయారయ్యారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. పేదలకు వారు నిర్మించిన ఇళ్లంటూ నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద బాబు సెల్ఫీ దిగడంపై మంత్రి ఒక ప్రకటనలో స్పందించారు. టీడీపీ హయాంలో నెల్లూరులో టిడ్కో ఇళ్లు, ఇప్పుడున్న ఇళ్ల నాడు–నేడు ఫోటోలను విడుదల చేశారు. నెల్లూరులో టిడ్కో ఇళ్లన్నీ ఆయనే కట్టేశానని చెప్పుకోవడానికి  సిగ్గులేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబే టిడ్కో ఇళ్లన్నీ కట్టేస్తే మరి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టినవేమిటని అన్నారు.

 టిడ్కో ఇళ్ల రూపంలో పేద, మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరిట పేదవారి ఆశలను ఆసరాగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.1,000–1,100 మధ్య ఖర్చయితే అంతకు రెండు మూడు రెట్లు అధికంగా టెండర్లు ఖరారు చేసి దోచేశారన్నారు. అది కూడా ఒక్క చోటా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, అస్తవ్యస్తంగా వదిలేశారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాకే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అన్ని మౌలిక వసతులతో ప్రజలకు అందిస్తోందని తెలిపారు.

 

నెల్లూరులోనూ బాబు కట్టని ఇళ్ల వద్ద సెల్ఫీలు తీసుకొని తానే కట్టానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం వచ్చాక టి డ్కో ఇళ్ల కోసం రూ. 8,734 కోట్లు ఖర్చు చేసిందన్నా రు. అందులో రూ. 5,840 కోట్లు, నిర్మాణ పనులకు, టీడీపీ అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం రూ.725 కోట్లు ఖర్చు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వదిలిన రూ.3 వేల కోట్లు బకాయిలు కూడా తమ ప్రభుత్వమే తీర్చిందని తెలి పారు. బాబు హయాంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లకు ఒక్కో లబ్ధిదారుడిపై రూ. 7.2 లక్షలు భారం వేయగా, వైఎస్‌ జగన్‌ ఆ భారాన్ని తొలగించి, ఇళ్లను ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు.

ఇలా పేదలపై రూ. 3,805.4 కోట్ల మేర భారాన్ని తప్పించారన్నారు.  365 చ.అ, 430 చ.అ ఇళ్ల లబ్ధిదారుల కు ముందస్తు చెల్లింపుల్లో 50 శాతం సబ్సిడీని సీఎం జగన్‌ కల్పించారన్నారు. ఈ రూపేణా రూ.482.31 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు.  ఒక్క రూపాయికే ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ రూ.1,200 కోట్ల రిజిస్ట్రేషన్‌ భారాన్ని కూడా తొలగించామన్నా రు. చంద్రబాబు ప్రభుత్వం టీడ్కో ఇళ్ల అంచనాలు పెంచేసి, దోచేస్తే.. వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టి రూ.392 కోట్లు ప్రజా ధనం ఆదా చేసిందన్నారు.

 

చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇప్పటికే 50వేల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. మిగి లిన ఇళ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులు అందిస్తామని చెప్పారు. చంద్రబాబు తమతో వస్తే  ఇళ్లు ఎక్కడ కడుతున్నారో చూపిస్తామన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న ఊళ్లను చూస్తే చంద్రబాబు గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదన్నారు. టీడీపీం సెల్ఫీల పార్టీ అని ఆరోపించారు. చంద్రబాబు వాలకం చూస్తుంటే చార్మినార్, తాజ్‌మహల్‌ కూడా ఆయనే కట్టేశానని ఓ సెల్ఫీతీసుకునేట్టు ఉన్నారన్నారు. తండ్రీ కొడుకుల కామెడీని రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 

Back to Top