జగ్జీవన్‌రామ్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా వైయ‌స్‌ జగన్   పాలన 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ్జీవ‌న్‌రామ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

దళితుల అభ్యున్నతికి సీఎం కృషి
 
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన

 తాడేప‌ల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రామ్‌ గారి వర్ధంతి సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. శాసనమండలి సభ్యులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు,  ఎంపీలు సంజీవ్‌కుమార్,   నందిగం సురేష్,  గురుమూర్తి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,  ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్  కొమ్మూరి కనకరావు మాదిగ తదితరులు జగ్జీవన్‌రామ్‌ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ, దేశంలో దీన జనోద్ధరణకే కాక హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆధ్యుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని కీర్తించారు. దేశ వ్యవసాయశాఖ మంత్రిగా రైతులకు మొట్టమొదటిసారిగా గిట్టుబాటు ధర కల్పించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ఆచరణలో పెట్టేదానిలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. విద్యారంగంపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించిన దార్శనికుడన్నారు. 

ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ, చంద్రబాబు దళితులను విడదీయాలని విషపూరితంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌ ఎస్సీల ఐక్యతకు కృషి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాల కుట్రలను మనమే సంఘటితంగా తిప్పికొట్టాలన్నారు.

ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ, గడచిన మూడేళ్ళుగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసమే అనేక పధకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దళితులను ఏకం చేయడానికి కృషి చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌గారి బాటలోనే జగన్‌ గారు ముందుకు సాగుతూ ఎస్సీల ఐక్యత కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో 2024లో కూడా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఎస్సీలంతా పార్టీలో సుశిక్షితులైన సైనికులుగా పని చేయాలని కోరారు.

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, 40 సంవత్సరాల పాటు పార్లమెంట్‌లో పలు పదవులను బాధ్యతగా నిర్వర్తించిన నిస్వార్ధ రాజకీయ నేత జగ్జీవన్‌రామ్‌ అని ప్రస్తుతించారు. ఆయన చూపిన మార్గంలోనే ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ అన్ని రంగాల్లో అణగారిన వర్గాలకు అగ్రస్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. 

ఎంపీ సంజీవకుమార్‌ మాట్లాడుతూ, సామాజిక న్యాయానికి నిర్వచనం తెలియాలంటే అది ఏపీని చూస్తే అర్ధమైపోతుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి లభిస్తున్న అనూహ్య స్పందనే అందుకు నిదర్శనమని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ లానే ముందుకు సాగుతున్న శ్రీ జగన్‌ నేడు బడుగు, బలహీనవర్గాల గుండెల్లో కొలువయ్యారని పేర్కొన్నారు. బడుగులకు మేలు జరగకుండా అడ్డు పడుతున్న ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టి మనమంతా జగన్‌ గారి వెన్నంటే నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, విలక్షణమైన రాజకీయాలతో అనేక పదవులు చేపట్టి వాటికి వన్నెతెచ్చిన ఆదర్శనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని శ్లాఘించారు. జగ్జీవన్‌రామ్‌గారి ఆలోచనలే ఆశయాలుగా మలుచుకుని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గారు ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంటరానితనం, పేదరిక నిర్మూలన అనే ఆయన సిద్ధాంతాలనే పునాదిగా చేసుకుని సీఎం జగన్‌ గారు పరిపాలన చేస్తున్నారని తెలిపారు. జగన్‌ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదరికంపై జరుగుతున్న పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో దేశం యావత్తూ కులాలు, మతాలు పక్కనపెట్టి పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన నాడే జగ్జీవన్‌రామ్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అప్పిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్లు, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Back to Top