బొట్టుపెట్టి ఆహ్వానం

 
 
తాడేపల్లి  : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదల ఇళ్లపట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈనెల 26న ముఖ్యమంత్రి వై.య‌స్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలో మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఇళ్ల పట్టాల పంపిణీకి రావాలని అక్కచెల్లెళ్లకు బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. సచివాలయ సిబ్బంది సోమవారం తాడేపల్లి పట్టణం, తాడేపల్లి రూరల్‌లోని పెనుమాక, వడ్డేశ్వరం, కొలనుకొండ, గుండిమెడ, చిర్రావూరు, ప్రాతూరు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 11,822 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలో 11,822 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే కృష్ణాయపాలెం, నవులూరు, వెంకటపాలెం, నిడమర్రు ప్రాంతాల్లో దాదాపుగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు అందజేసేందుకు ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ నెల 26న వెంకటపాలెం, కృష్ణాయపాలెం మధ్య అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన లే అవుట్లలో ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. అర్హులైన మహిళలందరికీ ఇప్పటికే వలంటీర్ల ద్వారా పట్టాలు అందజేస్తామని సమాచారం అందించారు.

పట్టాలను సిద్ధం చేస్తున్న సిబ్బంది
ఇళ్ల పట్టా పుస్తకాల్ని సచివాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వలంటీర్లు సంయుక్తంగా పట్టాలపై ఫొటోలు అతికించడంతో పాటు అక్షర దోషాల్ని తనిఖీ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నట్లు కమిషనర్‌ శారదాదేవి తెలిపారు.

రాజధానిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
  తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ నెల 26న నిర్వహించనున్న పేదలకు పట్టాల పంపిణీ ఏర్పాట్లను సోమవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల కో –ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ పరిశీలించారు. గుంటూరు, ఎన్‌టీఆర్‌ జిల్లాల కలెక్టర్లు ఎం. వేణుగోపాలరెడ్డి, ఎస్‌. ఢిల్లీరావులతో కలసి ప్రాంగణ ఏర్పాట్లను తనిఖీ చేశారు. సభా వేదిక, గ్యాలరీ, పార్కింగ్‌ ప్రాంతాల్ని పరిశీలించి సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ జి. రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అజిత్‌సింగ్‌, గుంటూరు ఆర్డీవో ఆదిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ నిర్మల, సీఆర్డీయే, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Back to Top