పోలీసుల నుంచి రవి కిరణ్‌కు ప్రాణ హాని

సోష‌ల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన ఆందోళన

రవికిరణ్‌పై ఇప్పటికే 20 కేసులు నమోదు

పీటీ వారెంట్‌తో రాష్ట్రమంతా తిప్పుతున్నారు

ఆయన ఆరోగ్యం బాగాలేదు. హృద్రోగ సమస్య

గతంలో స్టంట్‌ కూడా వేశారు. విశ్రాంతి కావాలి

కనీసం నిద్ర పోయే అవకాశమూ ఇవ్వడం లేదు

ప్రెస్‌మీట్‌లో ఇంటూరి సుజన వేదన 

విశాఖపట్నం: తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. త‌న భ‌ర్త‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గత ఆగస్టు 30న తన భర్త ఇంటూరి రవికిరణ్‌ను అదుపులోకి  అదుపులోని తీసుకున్న ఆయనపై అదేపనిగా కేసులు పెడుతూ, రోజూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారని, తన భర్తకు ప్రాణహాని ఉందని, ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె, దాదాపు మూడు నెలలుగా పోలీసులు తన భర్తను ఎలా వేధిస్తున్నారన్నది చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్పొరేటర్లతో కలిసి సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన మీడియాతో మాట్లాడారు.

అక్రమ కేసులతో వేధింపులు:
– నా భర్త ఇంటూరి రవికిరణ్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు రాష్ట్రమంతా తిప్పుతున్నారు. కేసులు ఎవరు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? కేసు నెంబర్‌ ఏంటి?.. ఏ వివరాలు కూడా పోలీసులు చెప్పడం లేదు. చివరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలు కూడా ఇవ్వడం లేదు. 
– పైవాళ్లు చెప్పినట్టు పోలీసులు స్టేట్‌మెంట్లు రాసుకుని ఇంటూరి రవికిరణ్‌తో బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తుంటే.. ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోమని బెదిరిస్తున్నారు.

రోజూ దాదాపు 600 కి.మీ:
– నా భర్తకు హృద్రోగ సమస్య ఉంది. గతంలో స్టంట్‌ కూడా వేశారు. ఆయనకు కనీసం రోజుకు 8 గంటలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. పీటీ వారెంట్లు జారీ చేసి, స్టేషన్‌ కస్టడీలని చెప్పి రాజమండ్రి జైలు నుంచి మాచర్లకు తీసుకెళ్లి మళ్లీ రాజమండ్రి జైల్లో అప్పజెప్పారు. అక్కడ్నుంచి మళ్లీ కురుపాం తీసుకెళ్లారు. ఇలా రోజుకు 500–600 కిలోమీటర్లు తిప్పుతున్నారు.
– చివరకు నిద్ర పోయేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు. మందులు ఇస్తున్నారో, లేదో కూడా తెలియడం లేదు. 
– పగలు లేదు. రాత్రి లేదు. అర్థరాత్రి లేదు. ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. తిరిగి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఎక్కడా నన్ను కూడా కలవనీయడం లేదు.
– రవికిరణ్‌ను కలిసేందుకు ఎంట్రీ పెట్టుకుంటే పీటీ వారెంట్‌ వేసి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఎక్కడా కలవనీయడం లేదు. అలా నన్ను, నా పిల్లల్ని నా కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. 

రవికిరణ్‌కు ప్రాణహాని ఉంది:
– రవికిరణ్‌ ఆరోగ్యం క్షీణించి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత?. ఆయన ఆరోగ్యం బాలేదని డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు కూడా ఉన్నాయి. మా లాయర్లు వెళ్లి అడిగినా పోలీసుల నుంచి సరైన స్పందన లేదు.
– దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు, రాజమండ్రి సీఐ బాజీలాల్‌ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అచ్చం టీడీపీ కార్యకర్తల్లా వారు పని చేస్తున్నారు.
– నా భర్తకు హృద్రోగ సమస్య ఉంది. బీపీ, షుగర్‌ వ్యాధులు కూడా ఉన్నాయి. గతంలో ఒకసారి యాక్సిడెంట్‌ జరిగితే, కాలులో రాడ్‌ వేశారు. దాంతో ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు.
– మొన్న ఒక సీఐ ఆయన్ను తోసేశారు. దీంతో ఆయన కాలు బెణికి మరింత గాయమైంది. చీము పట్టి నడవలేని పరిస్ధితుల్లో ఉన్నారు.
– నా భర్తను కలిసి చాలా రోజులైంది. ఆయన్ను కలవనిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. కాబట్టే కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. 

మరి వారిపై చర్యలేవి?:
– నిజానికి టీడీపీ నాయకులు, వారి అíఫీషియల్‌ అకౌంట్లలో దారుణంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అవి చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. అయినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. నా భర్తనే ఎందుకు వేధిస్తున్నారు?. 
– సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా వేధిస్తారా? ఆయన ఏనాడూ అసభ్య పోస్ట్‌లు పెట్టలేదు. ఎవరినీ దూషించలేదు. ద్వేషించలేదు. అయినా దారుణంగా వేధిస్తున్నారు.
– ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? అసలు ప్రశ్నిస్తే ప్రభుత్వానికి కోపమెందుకు వస్తోంది? వాటిని పర్సనల్‌గా తీసుకుని వేధిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇంతలా వేధిస్తారని ఎవరూ అనుకోరు. 
– టీడీపీ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారు. పైనుంచి తమపై ఒత్తిడి ఉందని పోలీసులే చెబుతున్నారు.

రిమాండ్‌లో ఉన్నా నోటీస్‌లు:
– నా భర్త రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసినా కూడా ఇంటికొచ్చి గొడవలు చేసి ఇంటికి నోటీసులు అంటించి వెళ్తున్నారు.
– ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వమని అడుగుతున్నా ఇవ్వడం లేదు. ఏ కేసు కోసం వస్తున్నారో? ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారో? కూడా తెలియడం లేదు.
– నా భర్త ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆయనకేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన మీద పెట్టిన కేసుల వివరాలు చెప్పాలి. అలాగే ఎఫ్‌ఐఆర్‌లు కూడా బయట పెట్టాలని ఇంటూరి సుజన డిమాండ్‌ చేశారు.

బ్రిటిష్‌ పాలన గుర్తుకొస్తోంది: వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్పొరేటర్లు.
– దాదాపు మూడు నెలలుగా రవికిరణ్‌ను పోలీసుల వేధిస్తున్న తీరు చూస్తుంటే, రాష్ట్రంలో అసలు భారత రాజ్యాంగం ఉందా? అన్న సందేహం కలుగుతోంది. ఇది అచ్చం బ్రిటిష్‌ పాలన మాదిరిగా ఉంది.
– ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసుల మీద కేసులు పెట్టి, మూడు నెలలుగా ఇలా రాష్ట్రమంతా తిప్పుతారా? ఇంత దారుణంగా వేధిస్తారా? భార్య పిల్లలకు దూరం చేసి ఇంతలా హింసిస్తారా?. పైగా కేసుల వివరాలు కూడా చెప్పకపోవడం కచ్చితంగా హక్కుల ఉల్లంఘనే.
– ఒక మహిళ పడుతున్న బాధను అర్థం చేసుకుని, ఆమెకు అండగా నిలవాలని ఈరోజు మహిళా కార్పొరేటర్లందరం ముందుకొచ్చాం.

Back to Top