పోలీసుల నుంచి రవి కిరణ్‌కు ప్రాణ హాని

సోష‌ల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన

విశాఖపట్నం: తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. త‌న భ‌ర్త‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బుధవారం ఆమె విశాఖ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదు. కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు.

‘‘ఇంటూరి రవి కిరణ్ ఆరోగ్యం బాగోలేదు. రవి కిరణ్ హార్ట్ పేషెంట్, రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రోజూ ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్ల తిప్పుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?. పోలీసుల నుంచి రవి కిరణ్‌కు ప్రాణ హాని ఉంది. పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పని చేస్తున్నారు. రవి కిరణ్‌పై 20 కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది’’ అని సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన తన పైన కూడా దువ్వాడ, రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పిన కూడా పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా రవికిరణ పై కేసులు పెట్టిస్తోంది. టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు’’ అని సుజన తెలిపారు.

Back to Top