విజయవాడ: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటన బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రమాదంలో గాయపడి విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి వనిత, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరితో కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగానే ఉందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారాన్ని సీఎం వైయస్ జగన్ ప్రకటించారని, అదే విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు.. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.50 లక్షల చొప్పున పరిహారం అందుతుందన్నారు. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల సమస్యలు వస్తున్నాయని, కెమికల్స్ నీటిలో కలవడం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నామని, ఫ్యాక్టరీ నివాసాల సమీపంలో ఉండొద్దని స్థానికులు కోరుతున్నారని, దీనిపై కూడా విచారణ జరిపిస్తామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి సీఎం వైయస్ జగన్ ఆదేశాలిచ్చారన్నారు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలను మాత్రమే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఇలాంటి హాని కలిగించే ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదని హోంమంత్రి చెప్పారు.