శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

మీడియా కూడా తప్పుడు కథనాలు ప్రచురించొద్దు

అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలనే మనస్తత్వం బాబుది

అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

 

కర్నూలు: అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలనే మనస్తత్వం చంద్రబాబుదని, అలాంటి వ్యక్తిని ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేందుకు విశాఖ సంఘటన నిదర్శనమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తన స్వలాభం కోసం చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రాంతం. ఇన్ని రోజులకు మా అభివృద్ధిని కోరుకునే వ్యక్తి వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువచ్చారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్లి సేవ్‌ అమరావతి అనే పేరుతో యాత్ర చేపట్టాలనుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వరంగా ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు బాబు పర్యటనను అడ్డుకున్నారు. చంద్రబాబువి పబ్లిసిటీ స్టంట్స్‌ మాత్రమే. ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలని ఆలోచన చేస్తుంటాడు.
 
చంద్రబాబు ప్రతీసారి పోలీసులను బెదిరించడం.. వారిపై నిందారోపణలు చేస్తున్నాడు. కేవలం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలనే మనస్తత్వంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన. ఆ ప్రకారమే మూడు రాజధానులు తీసుకువచ్చారు. హైదరాబాద్‌ను నేను నిర్మించాను అని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. హైదరాబాద్‌ వదిలి పక్కకు వచ్చి రాజధాని లేకుండా నిలబడాల్సి వచ్చిన పరిస్థితి. మున్ముందు ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలనే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఉత్తరాంధ్ర వెనుకబడిందని ప్రతి నాయకుడు మాట్లాడే వారే కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధమైన చర్చలు చేపడితే బాగుంటుందని ఆలోచించింది వైయస్‌ జగన్‌ మాత్రమే. చంద్రబాబు తన స్వార్థం కోసం అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కార్లపై దాడులు చేసి వారి కళ్లలో కారం చల్లుతున్నారు. అమరావతి ఉద్యమం ముసుగులో దాడులు చేస్తూనే తిరిగి నిందలు ప్రజాప్రతినిధులపైనే వేస్తున్నారు. మీడియా కూడా వాస్తవాలు ప్రచురించాలి. ఒక వ్యక్తి కోసం వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని మంత్రి సుచరిత అన్నారు.

తాజా వీడియోలు

Back to Top