గుంటూరు: టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు 14 ఏళ్ల బాలిక బలవ్వడం చాలా బాధాకరమని, సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 14 సంవత్సరాల వయసున్న బాలికను 54 సంవత్సరాల వయసున్న వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయడం మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు. తన బాధను బయటకు చెప్పుకోలేక బాలిక ఎంత మనో వేదనకు గురైందో.. చిన్నారి రాసిన సూసైడ్ నోట్ చూస్తేనే అర్థమవుతుందని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కోవిడ్ కారణంగా హోం ఐసోలేషన్‌లో ఉండడం వల్ల బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించ లేకపోతున్నానని, అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు ఈ సంఘటనపై వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న హోంమంత్రి ఓ వీడియో బైట్‌ను విడుదల చేశారు. బాలిక తనపై జరిగిన లైంగిక వేధింపులను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. మహిళల భద్రత కోసమే వైయస్ జగన్ ప్రభుత్వం దిశ యాప్ తీసుకురావడంతో పాటు ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా ఉంటే వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భయాందోళనకు గురై అమ్మాయిలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. దిశ యాప్‌ను ఇప్పటికే దాదాపు కోటికి పైగా మహిళలు, యువతులు డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశా పోలీస్ స్టేషన్లను, మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీడీపీ నేత వినోద్ జైన్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత చెప్పారు. ఇప్పటికే వినోద్ జైన్ పైన ఐపీసీ సెక్షన్ 306, 354, 354A, 354D, 509, POSCO యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే డయల్ 100, దిశ యాప్ ను ఆశ్రయించి రక్షణ పొందవలసిందిగా కోరారు. మహిళలపై నేరాలకు పాల్పడే దాదాపు 2 లక్షల మందికి పైగా సెక్సువల్ అఫెండర్స్ పై నిఘా పెట్టి, వారి చర్యలను గుర్తించేందుకు వారిని జియో ట్యాగింగ్ చేశామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరం జరిగిన వెంటనే, పారదర్శకంగా విచారణ జరిపి చార్జిషీటు వేయడం జరుగుతుందన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నేరస్తులను శిక్షిస్తున్నామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి నమోదు చేసిన కేసుల్లో దాదాపు 98 శాతం చార్జిషీట్లు వేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు బాలిక వ్యభిచార ఘటనలో పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపామన్నారు. ఆ కేసును ఆరండల్ పేట పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసి మొత్తం 46 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో వైయస్ఆర్ సీపీ సానుభూతి పరుడు ఉన్నాడని టీడీపీ వాళ్లు ఆరోపణలు చేసినప్పటికీ, అతనిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. ఏ పార్టీ వారు నేరం చేసినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి చెప్తూ వస్తున్నారన్నారు. విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనలో.. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగికంగా వేధించాడని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడైతే.. వెంటనే నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నేరం చేసిన వారు ఏ పార్టీ వారైనా వదిలిపెట్టకుండా పోలీసులు శిక్షించడం జరుగుతోందన్నారు. తప్పు చేసినవాడు ఏ పార్టీకి చెందిన వాడైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సందర్భాల్లో చెప్పారని హోంమంత్రి గుర్తుచేశారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో సీఎం వైయస్ జగన్ పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా వారికి చేయూతనిస్తూ, మహిళా సాధికారత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. అలాంటిది దీక్షల పేరుతో ప్రతిపక్ష నాయకులు సీఎం పైన, ప్రభుత్వం పైన బురదజల్లి రాజకీయ లబ్దిపొందాలని చూడటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా నేరస్తులను మాత్రం వదిలిపెట్టిన సందర్భాలు లేవన్నారు. మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల్లో ఏడు రోజుల్లోనే చార్జిషీటు వేసి నేరస్తులను చట్టప్రకారం శిక్షించిన సందర్భాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగిని వనజాక్షిని ఆ పార్టీ ఎమ్మెల్యే దాడి చేసిన కేసులో ఏం చర్యలు తీసుకున్నారు అంటే.. దానికి ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసుల్లో నిందితులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అంటే టీడీపీ నాయకుల నుండి ఇప్పటికీ సమాధానం లేదు. నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ రిషితేశ్వరి కేసులో ఏ విధమైన న్యాయం చేశారు అంటే టీడీపీ నుండి ఇప్పటికీ సమాధానం లేదు. ఆఖరికి, తాజాగా టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలపై నారా లోకేష్ పీఏ లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటనపై కూడా ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. గురివిందగింజ సామెతలా టిడిపి నాయకులు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై నిందలు వేసి, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూడడం తగదన్నారు. రాష్ట్రంలో నేరం జరిగిన ప్రతి కేసు విషయంలోనూ నేరస్తులకి కఠిన శిక్షలు వేసిన ఘనత మా ప్రభుత్వానికే ఉందన్నారు. ఇప్పటికైనా టీడీపీ మహిళా నాయకులు, ఎక్కడైనా, ఏ మహిళకు అయినా అన్యాయం జరిగితే.. దానిని రాజకీయ లబ్దికోసం వాడుకోకుండా, మహిళలకు న్యాయం జరిగే విధంగా మీవంతు సహకారం అందిస్తే బాగుంటుందని హోంమంత్రి సుచరిత సూచించారు.