ర్యాపిడ్‌ కిట్లకు ఐసీఎంఆర్‌ అనుమతి 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డి
 

 
తాడేపల్లి: దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్‌ కిట్లకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డి తెలిపారు.  గురువారం సీఎం వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణపై  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను జవహార్‌ మీడియాకు వివరించారు. కరోనా పరీక్షల విషయంలో వెనకడుగు వేయొద్దని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.  కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామని.. ఇప్పటివరకు మొత్తంగా 48,034 పరీక్షలు చేసినట్లు  వివరించారు. నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో పరీక్షలు జరుగుతాయి. ఈ కిట్లతో ఇప్పటివరకు 14,423 టెస్టులు నిర్వహించామని.. వాటిలో 11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే చేసినట్లు చెప్పారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో చేసిన పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. వీటిని నిర్ధారణ కోసం పీసీఆర్‌ టెస్టులకు పంపించామని వివరించారు. దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 893కి చేరింది.  గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జవహర్‌ పేర్కొన్నారు. 

కరోనా పరీక్షలు క్రమంగా పెంచండి: సీఎం వైయస్‌ జగన్‌
కరోనా పరీక్షల సంఖ్య క్రమంగా పెంచాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. క్యాన్సర్‌, డయాలసిస్‌ వంటి రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. 104కి కాల్‌ చేస్తే వెంటనే స్పందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. డెలివరీ కేసులతోపాటు ఎమర్జెన్సీ కేసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతిపాదిత కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా 1902కి కాల్‌ చేయాలని ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.    

Back to Top