చంద్రబాబు రాజకీయ దళారీ

వాస్తవం తెలిస్తే భవన కార్మికులే బాబును తరిమికొడతారు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఏమైంది బాబూ?

లోకేష్‌ డైటింగ్‌ కోసం దీక్ష చేస్తున్నాడు

చంద్రబాబు తమ్ముళ్లు ఇసుక నుంచి రూ. వేల కోట్ల దోచుకున్నారు

కార్మికుల సంక్షేమ నిధిపై మళ్లీ ఎంక్వైరీ వేయిస్తాం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 

తాడేపల్లి: చంద్రబాబు ఒక రాజకీయ దళారీ. తన అవసరం కోసం ఎవరినైనా.. ఎన్ని విధాలుగానైనా వాడుకుంటాడు. రాజకీయాల్లో విలువలను దిగజార్చింది చంద్రబాబే. చంద్రబాబును రాష్ట్రప్రజలు ఇంతకాలం భరించారంటే వారి ఓపికకు మెచ్చుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. భవన నిర్మాణ కార్మికులపై చంద్రబాబు, లోకేష్‌ సవతి ప్రేమ వలకబోస్తున్నారు. చంద్రబాబు అసలు రంగు తెలిస్తే ఆ కార్మికులే ఇద్దరు బాబులను విజయవాడ నుంచి తరిమికొడతారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వరదలతో ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవమే.. సాధ్యమైనంత వరకు ఇసుక సేకరణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక కొరత లేకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పారు. పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు ఇసుకపై రాద్ధాంతం చేస్తున్నాడని గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశంలోనే గొప్ప నాయకుడిని నాకంటే సీనియర్‌ ఎవరూ లేరని చెప్పుకునే చంద్రబాబు లాంటి రాజకీయ దళారీ ఎవరూ లేరు. రాజకీయాల్లో విలువలు దిగజార్చి, క్యాంపు రాజకీయాలు, మనీ పాలిటిక్స్, వ్యవస్థలను వాడుకునే నీచ సంస్కృతిని పరిచయం చేసిన చంద్రబాబును భరించిన ప్రజలను మెచ్చుకోవాలి.

చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుండా కనుమరుగు అయితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు. తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నారనే భయాందోళనతో, ఉనికి కోసం ప్రభుత్వంపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు.

నదులు, వాగులు, వంకలు ఏదీ వదలకుండా తమ్ముళ్లు ఇసుక నుంచి వేల కోట్లు దోచుకున్న తీరు ప్రజలంతా చూశారు. ధూళిపాల నరేంద్ర లాంటి వ్యక్తులు దగ్గరుండి వేల లారీల ఇసుకను చంద్రబాబు ఇంటి వెనుక నుంచి తరలించింది వాస్తవం. బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు ఇసుక మాఫియా చంద్రబాబుకు తెలిసే జరుగుతుందని మాట్లాడారు. వంకలతో సహా 20 నుంచి 30 అడుగుల లోతు తొవ్వేశారు. టీడీపీ నేతలు వేల కోట్లు ఇసుక నుంచి సంపాదించి ఆ డబ్బును వేల తులాల బంగారంగా మార్చుకున్నారు.
 
ఇసుక మాఫియా ఉండకూడదు. సామాన్యులకు కూడా ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ నూతన పాలసీ తీసుకువచ్చారు. దేవుడి దయతో ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు విపరీతంగా కురవడం నదులు, వాగులు అన్ని వరదలతో నిండాయి. దీంతో ఇసుక సేకరణకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వరదలు వస్తున్నా.. ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాధ్యమైనంత వరకు ఇసుకను సేకరించి విక్రయించేలా చూడాలని అధికారులకు సూచించారు.
 
చంద్రబాబు గతంలో తయారు చేసిన మాఫియా నేడు గ్రామాల్లో ప్రజలకు ఇసుక దొరకనివ్వకుండా చేస్తుంది. ఇసుక ట్రాక్టర్లను, లారీలను బాబు మాఫియా అడ్డుకుంటూ గ్రామాల్లోని భవన కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇసుక లారీలను చంద్రబాబు మాఫియా అడ్డుకుంటుందని వాస్తవాలతో సహా బయటపెడతా. భవన కార్మికులు, రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని నిరూపించాం. బడుగులకు మేలు చేయడానికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారు. ప్రతి రోజు పేదలకు వరాల వర్షం కురిపిస్తుంటే పచ్చమీడియాకు అది కనిపించదు. తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదచల్లుతున్నారు. కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసి ఆత్మహత్యలు చేసుకునేలా చంద్రబాబు ప్రేరేపిస్తున్నాడు. వరదలు తగ్గిన వెంటనే కొరతను శాశ్వతంగా నిర్మూలిస్తాం.
 
లోకేష్‌ ఇసుక దోపిడీ ఎలా చేశాడో అతని శరీరం చూస్తేనే తెలుస్తుంది. డైటింగ్‌ ప్రోగ్రాంలా ఇప్పుడు దీక్ష చేస్తున్నాడు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో.. ఆరోగ్యం సవరించుకోవడం కోసం దీక్ష చేద్దామని మురళీమోహన్‌ అన్న మాట వాస్తవం కాదా..? అలాగే లోకేష్‌ కూడా డైటింగ్‌ కోసం దీక్ష చేస్తున్నాడని ప్రజలంతా నమ్ముతున్నారు.

కార్మికులకు చంద్రబాబు చేసిన మోసం తెలిస్తే.. విజయవాడలో లేకుండా తరిమికొడతారు. 2009లో భవన కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత రూ.13 వందల కోట్లు నిల్వ ఉంది. దాన్ని సెస్‌ రూపంలో సక్రమంగా వసూలు చేస్తే దాదాపు రూ.10 వేల కోట్లు వచ్చేవి. ఆ నిధిని భవన కార్మికుడికి ఉపయోగపడే విధంగా చేయకుండా.. సీఆర్‌డీఏ రోడ్ల కోసం, చంద్రబాబు వ్యాపారాల కోసం, చంద్రన్న కానుకలు, బెల్లం, హెరిటేజ్‌ నుంచి మజ్జిగకు రూ.38 కోట్లు కేటాయించారు. మేడే రోజున రూ. 50 కోట్లు ఈ నిధి నుంచి డ్రా చేశాడు. ఏ ఒక్క భవన కార్మికుడికి నష్ట పరిహారం అందించకుండా కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 595 కేసులకు కార్మికులకు పరిహారం చెల్లించాల్సి ఉంటే కేవలం 50 మందికి రూ. 25 లక్షల చెల్లించారు. ఇంకా 500 మందికిపైగా కార్మికులకు పెండింగ్‌లో పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎంత మందిని మోసం చేశాడనేదానికి ఇదొక ఉదాహరణ. ఈ రకంగా కార్మికులను మోసం చేసి ఇప్పుడు సవతితల్లి ప్రేమ చూస్తూ కార్మికులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. భవన కార్మికుల సంక్షేమ నిధిపై మళ్లీ ఎంక్వైరీ చేయించి ఆ కార్మికులకు ఉపయోగపడే విధంగా చేస్తా’మని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

Read Also: ఇసుక..బాబు మస్కా!

Back to Top