తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్టు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ను ప‌రామ‌ర్శించి తిరిగి వెళ్తుండ‌గా మారణాయుధాల‌తో జేసీ వ‌ర్గీయుల‌ వీరంగం

అనంత‌పురం:  తాడిప‌త్రిలో తెలుగు దేశం పార్టీ నేత‌లు మ‌రోసారి రెచ్చిపోయారు. పెద్దారెడ్డిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌గా పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ నేతను పరామర్శించి తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప‌చ్చ‌మూక‌లు దాడికి తెగ‌బ‌డ్డాయి. ఆయ‌న్ను అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్ర‌య‌త్నించారు. తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మారణాయుధాలు, రాళ్లతో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. దీంతో కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని పోలీసులు అడ్డుకొని తాడిపత్రి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, పోలీసుల‌క మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పెద్దా రెడ్డిని అరెస్టు చేశారు.  

కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే  పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇటీవ‌ల తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారు. తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని వివరణ ఇచ్చిన విష‌యం విధిత‌మే.

Back to Top