చంద్రబాబు..పవన్..లోకేష్ హిందువుల ద్రోహులు

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఫైర్‌

విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను అవమానించిన చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అపచారాలకు పరిహారంగా, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో విజయవాడ చిట్టినగర్‌లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలస్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నగర మేయర్, పశ్చిమ వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేవుడితో రాజకీయాలు హేయం

పూజల అనంతరం వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మాట్లాడటం అత్యంత బాధాకరమని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిపై, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీపై ఉన్న రాజకీయ కోపాన్ని వెంకటేశ్వర స్వామిపై చూపించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యతపై ఎప్పుడైనా భక్తులు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు.

నిజాలు తెలిసినా ఎందుకు మౌనం?

నెయ్యి శాంపిల్స్ తీసింది ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందని ప్రశ్నించిన వెలంపల్లి, ఏఆర్ డైరీ ఉత్పత్తి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రారంభమైందని గుర్తు చేశారు. గుజరాత్, హర్యానా జాతీయ ల్యాబ్‌లకు పంపిన నమూనాల్లో ఎక్కడా కూడా పంది కొవ్వు లేదని స్పష్టమైన నివేదికలు వచ్చినా, ఇంకా ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం చేయడం దేనికని ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

హిందువుల మనోభావాలకు క్షమాపణ చెప్పాలి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు హిందువుల మనోభావాలను గాయపరిచారని, శ్రీవారి భక్తులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామిని అవమానించడం హేయమైన చర్య అని స్పష్టం చేశారు. ముక్కోటి ఏకాదశికి తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గడానికి కూడా ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకం లేకపోవడమే కారణమని వ్యాఖ్యానించారు. ఎన్ని ఫ్లెక్సీలు కట్టినా ప్రజలు, భక్తులు నమ్మరని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలపై కోపగించవద్దు స్వామీ

చంద్రబాబు చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలపై కోపగించవద్దని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామని వెలంపల్లి తెలిపారు. దేవుడితో రాజకీయాలు చేయొద్దని, లడ్డూ అంశంపై ఇలాంటి అపచారాలు పునరావృతం కాకూడదని హితవు పలికారు. చివరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని, మోకాళ్లపై కూర్చుని శ్రీవారి వద్ద క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

Back to Top