చంద్రబాబూ.. ఎవరిది విధ్వంసం?

అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం చేసిందెవ్వరు?

సూటిగా ప్రశ్నించిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు  

శ్రీకాకుళంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, పార్టీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు 

18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేయడం విధ్వంసమా?

లేక 5 ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్ల అప్పు చేయడం విధ్వంసమా?

నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు మార్చడం విధ్వంసమా?

ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు విధ్వంసమా?

లేక పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటుపరం చేయడం విధ్వంసమా?

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబును నిలదీసిన డాక్టర్‌ అప్పలరాజు

శ్రీకాకుళం: మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం) పేరుతో షో చేస్తున్న సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పిల్లలతో మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి,వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. నాడు–నేడు మనబడిలో భాగంగా సమూలంగా మార్పు చేసిన స్కూల్‌లోనే చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే అచ్చం సినిమా షూటింగ్‌లా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అందుకోసం స్కూల్‌ ఆవరణలో క్లాస్‌రూమ్‌ సెట్‌ వేశారని తెలిపారు. అయితే ఆ సెట్‌లో వాడిన బెంచ్‌లు, ఫర్నీచర్, డిజిటల్‌ బోర్డు సహా, అన్నీ గత ప్రభుత్వ హయాంలో ఆ స్కూల్‌లో నాడే–నేడు కింద ఏర్పాటు చేసినవే అని చెప్పారు. అంటే జగన్‌గారు బాగు చేసిన స్కూల్‌లోనే కూర్చుని, పిల్లలతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు, పిచ్చి విమర్శలు చేశారని ఆక్షేపించారు. ఇంత కంటే హేయం మరొకటి ఉండదని శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.
ప్రెస్‌మీట్‌లో డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:

అసలు ఎవరిది విధ్వంసం?:
    రెండేళ్లు కోవిడ్‌ వంటి మహమ్మారి ఉన్నా, ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం ఆపకుండా, డీబీటీ, నాన్‌ డీబీటీ కింద రూ.4 లక్షల కోట్లకు పైగా మొత్తంతో ప్రజలకు మేలు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు కేవలం రూ.3.30 లక్షల కోట్లు మాత్రమే. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా, గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలకు మంగళం పాడి, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినా, ఈ 18 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.2.66 లక్షల కోట్లు. మరి ఎవరిది విధ్వంసం?
    నాడు–నేడు మనబడి కింద ప్రభుత్వ స్కూళ్లలో సమూలమార్పులు చేయడం విధ్వంసమా? పిల్లలకు వైద్య విద్య మరింత చేరువ చేసేలా ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, వాటిలో 7 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి.. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభం అయ్యేలా చేయడం, మరో 10 కాలేజీల నిర్మాణం పనులు కొనసాగించడం విధ్వంసమా? లేక నిర్మాణంలో ఉన్న కాలేజీలు పూర్తి చేయకుండా, ఇప్పటికే నడుస్తున్న మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయడం వి«ధ్వంసమా?

అమ్మకానికి పీజీ మెడికల్‌ సీట్లు:
    గత ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన 5 మెడికల్‌ కాలేజీల్లో మంజూరైన పీజీ సీట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం  అమ్మకానికి పెట్టింది. తాము అధికారంలోకి వస్తే, 100 రోజుల్లో మెడికల్‌ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల కోటా రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ మాట నిలబెట్టుకోకపోవడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా 10 కొత్త మెడికల్‌ కాలేజీలను పీపీపీ వి«ధానం అంటూ ప్రైవేటుపరం చేస్తున్నారు. అంతే కాకుండా కొత్త మెడికల్‌ కాలేజీల్లో మంజూరైన పీజీ సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా పేరుతో ఒక్కో సీటు రూ.29 లక్షలకు అమ్మకానికి పెడుతున్నారు. మరి ఎవరిది విధ్వంసం?.

2 ఏళ్లు ప్రభుత్వ జీతాలు. మరో స్కామ్‌:
    పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేస్తున్న మెడికల్‌ కాలేజీల్లో సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందట!. అంటే,  గవర్నమెంట్‌ భూమి, గవర్నమెంట్‌ బిల్డింగ్‌లు, గవర్నమెంట్‌ స్టాఫ్, గవర్నమెంట్‌ జీతాలు. కానీ, ఓనర్‌ మాత్రం ప్రైవేట్‌ వాళ్లు. అంటే లాభాలు ప్రైవేట్‌ వాళ్లకు. భారమేమో ప్రభుత్వం, ప్రజలకు. ఇది ఎంత దారుణం. అయినా ప్రభుత్వం దీన్ని నిర్లజ్జగా సమర్థించుకుంటోంది. పీపీపీ విధానంలో కట్టే మెడికల్‌ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తే స్కామ్‌ ఎలా అవుతుందని మంత్రి సత్యకుమార్‌ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం. ప్రభుత్వం ఆ విధానంలో మెడికల్‌ కాలేజీలు కట్టడం లేదు. పీపీపీ పేరుతో ఇప్పటికే పని చేస్తున్న మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోంది. ఇది స్కామ్‌ కాకపోతే మరేమిటి. మరి ఎవరిది విధ్వంసం?.

నాడు విద్యా రంగంలో సంస్కరణలు:
    ఒక్క మెడికల్‌ కాలేజీల ఏర్పాటు మాత్రమే కాకుండా, నాడు విద్యా రంగంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, అనేక విప్లవాత్మక మార్పులు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లాడు చదువుకోవాలని, వారూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అనేక పథకాలు అమలు చేశారు. ఆ దిశలోనే అమ్మ ఒడి మొదలు గోరుముద్ద, విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, ఇంగ్లిష్‌ మీడియమ్, టోఫెల్‌లో శిక్షణ, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు, నాడు–నేడు మనబడిలో గవర్నమెంట్‌ స్కూళ్లలో 12 రకాల మార్పులు, విదేశీ విద్యాదీవెన, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇప్పుడు వాటిలో ఏ ఒక్కటీ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. మరి ఎవరిది విధ్వంసం?.

ఉత్తరాంధ్రకు వచ్చి ఏమిచ్చారు?:
    సీఎం చంద్రబాబు ఇవాళ పాలకొండ నియోజకవర్గం భామిని మండలానికి వచ్చారు. అయితే నేరడి బ్యారేజీ వంటి అత్యంత ముఖ్యమైన అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం జిల్లా వాసులను నిరాశపర్చింది. అదే గత మా ప్రభుత్వ హయాంలో ఇక్కడి ప్రాజెక్టుల పురోగతి కోసం నాటి సీఎం వైయస్‌ జగన్, ఒడిషా సీఎంను కలిశారు. చర్చలు జరిపారు.
    కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఈ ప్రాంతంలో కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టకపోగా, హీర మండలం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వంటి ప్రాజెక్టులు ఆపేయడం దారుణం. ఇరిగేషన్‌ మంత్రి ఈ జిల్లాలో ఉండి కూడా సమస్యలు ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు.

Back to Top