కాకినాడ: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదని సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు.. తిరిగి ఇవాళ దొంగే దొంగా దొంగా అన్న తరహాలో దుష్ప్రచారం చేయడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు, రిపోర్టు లేకుండానే లడ్డూ ప్రసాదం కల్తీ అయిందంటూ ఆరోపణలు చేయడం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగిన చరిత్ర కూడా చంద్రబాబునాయుడుకే మిగిలిందని మండిపడ్డారు. ఎన్‌డీడీబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కల్తీ లేదని చెప్పడంతో.. అడ్డంగా బుక్కైనా బుకాయించే ప్రయత్నం చేస్తూ.. కార్యకర్తల్లో విషాన్ని నింపుతున్న లోకేష్ తీరును తప్పుపట్టారు. వాస్తవాలు బట్టబయలైనా వితండవాదం చేస్తూ ఎల్లో మీడియా జాతీయస్ధాయి ల్యాబ్‌ల నివేదికలనూ తప్పు పడుతున్న వైనాన్ని ఖండించారు. లడ్డూ వ్యవహారంలో వైయస్.జగన్ ను ఇరికించడం బాబుకి చేతకాదన్నట్టు వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం చంద్రబాబు పేటెంట్ అని, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం బాబు నైజమని స్పష్టీకరించారు. మరోవైపు విశాఖలో చంద్రబాబు కుటుంబం చేస్తున్న భూదోపీడీ నిలదీసిన కన్నబాబు.. లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థ రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే.. దాన్ని అడ్డగోలుగా కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సంపద సష్టి అంటే వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తన కుటుంబానికి కట్టబెట్టడమా అని నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో కురసాల కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..: ల్యాబ్‌ల రిపోర్ట్‌తో ఉలిక్కిపడి మరలా దుష్ప్రచారం: ఈ దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో నిలిచిపోయే పరిస్థితి. అలాంటి దేవదేవుడ్ని రాజకీయాల్లోకి లాక్కొని వచ్చినా.. నిజాలు భయటపడి, వాళ్ల పన్నాగం పారకపోవడంతో ప్రజలు ఛీకొడతారన్న భయంతో మరలా కొత్త డ్రామాకు చంద్రబాబు, ఆయన అనుయాయుల, ఎల్లో మీడియా తెర తీసారు. వాస్తవాలు చెబితే.. వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులా?: పవిత్రమైన స్వామి వారి లడ్డూ ప్రసాదంలో ఆవు, పంది కొవ్వు, చేపనూనెలు కలవలేదన్న రిపోర్టులు వచ్చిన తక్షణమే. తమ పరువు పోయిందని తెలుసుకున్న చంద్రబాబు బ్యాచ్ తక్షణమే ప్లేట్ ఫిరాయించింది. ఒకవైపు సీబీఐ వేసిన సిట్ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్దాలనే ప్రచారం చేస్తున్నారు. ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసాయనే దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. గుంటూరులో కొద్దిసేపటి క్రితం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడి చేశారు. అత్యంత దుర్మార్గంగా దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం మరో మాజీ మహిళా మంత్రి విడదల రజిని దేవాలయంలో పూజలకు వెళ్తే ఆమెపైన కూడా దాడికి ప్రయత్నించారు. అదే విధంగా నిన్న మాజీ శాసనసభ్యులు, సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ హోమం నిర్వహిస్తుంటే.. టీడీపీ అనుచరులు రాక్షసుల్లా ఆ హోమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు.అంటే తమ తప్పుడు ఆరోపణలు ప్రజలకు తెలిసిపోవడంతో దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసి.. ఈ అబద్దాలను ప్రచారం చేయాడానికి ఏకంగా ఒక మిషన్ నే నడిపిస్తున్నారు. ఇంకా మంత్రి లోకేష్ కాకినాడలో కార్యకర్తల సమావేశంలో వారికి భరోసా నింపే బదులు, జగన్‌గారిపై విషం నింపే ప్రయత్నం చేశారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు: పవిత్రమైన కలియగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లో లాగింది చంద్రబాబు ఆయన మద్దతు పార్టీలే. పచ్చి అబద్దాన్ని ఎలాంటి విచారణ, ఫిర్యాదు, రిపోర్టు లేకుండానే చంద్రబాబు లాంటి వ్యక్తి అత్యంత సులువుగా స్వామి వారి ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతన ధర్మానికే విఘాతం కలిగిందని ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా హిందువులంతా ఇది నిజమేనేమో అన్నంత హడావుడి చేశారు. సుప్రీం కోర్టు ఆరోజే చంద్రబాబు మాటలను తప్పు పట్టింది.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడ్డం సరికాదని వ్యాఖ్యానించింది. అయినా చంద్రబాబు బ్యాచ్ రోడ్డెక్కి తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎల్లో మీడియా దిగజారుడు రాతలు: జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) నివేదిక, సీబీఐ సిట్‌కు ఏ విధంగా ప్రామాణికం అంటూ ఎల్లో మీడియా వార్త రాసింది. ఆ సంస్ద నివేదికలో జంతు కొవ్వు లేదంటే సరిపోతుందా? అని రాస్తూ జంతువుల డీఎన్‌ఏ సీక్వెన్స్‌ను బట్టి నిర్ధారిస్తారే తప్ప.. ఎన్‌డీడీబీ ఎలా నిర్ధారిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇవాల్టి వారి కధనాలు చూస్తే... లడ్డూ వ్యవహారంలో వైయస్.జగన్ ను ఇరికించలేకపోవడం చంద్రబాబు చేతగానితనం అన్నట్టు బాధపడుతూ రాశారు. అంతే తప్ప తప్పుడు ప్రచారాన్ని నమ్మం అని చంద్రబాబు కానీ, ఎల్లో మీడియా కానీ అనుకోవడం లేదు. ‘ఎవరో చెబితే నమ్మాను. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదని తెలిసి ఇప్పుడు మనశాంతిగా ఉంది’.. అని ప్రజల ముందుకు వచ్చి అంగీకరిస్తే చంద్రబాబు వ్యక్తిత్వం అందనంత ఎత్తుకు చేరేది. కానీ నిరంతరం వైయస్.జగన్ ను ఇరికించాలన్న దుర్భిద్ధితో.. కలియగ దైవాన్నే రాజకీయాల్లోకి లాగి కించపరిచారు. ఇంకా టీటీడీ చైర్మన్ అయితే వైయస్.జగన్ కి తెలియకుండా ఇదంతా జరిగిపోయిందంటారా? ఆయన సహకారం లేకుండా జరిగిందని చెబుతున్నారు. మరి బీ ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారు.. అందులో చంద్రబాబు గారి సహకారం ఉండే ఉంటుంది. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసినప్పుడు ఆ రోజు ఎన్ డీ డీ బీ ల్యాబ్ అత్యున్నతం అన్న టీడీపీ నేతలు.. ఇవాళ లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వులు కలవలేదని ఇచ్చిన రిపోర్టును సీబీఐ నివేదిక రూపంలో ఇస్తే .. ఆ ల్యాబ్ కు ఎలాంటి ప్రామాణికం ఉందని మాట మారుస్తున్నారు. మీ హెరిటేజ్ ల్యాబ్ కు పంపించండి మీకు కావాల్సిన రిపోర్ట్ వస్తుంది. అసలు ఎవరి హయాంలో కల్తీ నెయ్యి వాడారు?: చాలా విచిత్రంగా ఇప్పుడు కూటమి నేతలు భోలే బాబా డెయిరీ నామ జపం చేస్తున్నారు. నిజానికి 2024 జూన్ 12న, జూన్ 25, జూలై 6, జూలై 12 న సరఫరా అయిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి చంద్రబాబు హాయంలో ఇచ్చిన ఆర్డరు మేరకు సరఫరా అయ్యాయి. ఈ ట్యాంకర్లలో నెయ్యి శాంపిళ్లు పరీక్షలో కల్తీ అని తేలితే ఎవరి హయాంలో జరిగినట్లు? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఆర్ డెయిరీకి కూడా చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలోనే అనుమతులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ తిప్పి పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి తిరిగి కొంత కాలం తర్వాత వచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన హయాంలో తొలుత రిజెక్ట్ అయిన నెయ్యి మరలా కొంత కాలం తర్వాత వస్తే.. మరలా అది కూడా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఆ రోజు ఉన్న బోర్డు ప్రతినిధులు నిర్లిప్తంగా ఉన్నట్టే కదా? భోలే బాబా డెయిరీకి గేట్లు ఎత్తిందే చంద్రబాబు కదా?: ఇప్పుడు ఎక్కడ విన్నా చంద్రబాబు బదులు భోలే బాబా అన్న పేరే వినిపిస్తుంటే.. ఆయన చరిత్ర ఒక్క సారి చూస్తే.. బోలే బాబా డెయిరీకి నెయ్యి సరఫరాకి గేట్లు తీసిందే చంద్రబాబు. 2018 జూన్ 26న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో పేజి నెంబరు 232లో ఐటెమ్ నెంబరు 192 కింద బోలేబాబాను ఆమోదించారు. ఇది పచ్చి నిజం. ఆ సమయంలోఅధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదా? వాస్తవానికి భోలే బాబా వాస్తవ పేరు హర్షా డెయిరీ కాస్తా తర్వాత పేరు మార్చుకుంది. టీటీడీ రికార్డులలో అది కూడా ఉంది. మే 2018లో పేరు మార్చుకున్న హర్ష డెయిరీకి నెయ్యి సరఫరాకి ఆమోదం తెలిపారు. ఇక ఎన్ డి డి బీ నివేదిక చూస్తే... నెయ్యి నాణ్యత పరీక్షించిన నాలుగు శాంపిళ్లలో పందికొవ్వు ఉన్నట్టు తేలలేదు అని తేలింది. అందుకే ఆ ల్యాబ్ కి పంపించకుండా మరో ల్యాబ్ కిపంపించాల్సింది కదా అని ఎల్లో మీడియాలో శాపనార్దాలు పెడుతున్నారు. మంత్రి లోకేష్ సైతం కల్తీ జరిగింది, జంతు కొవ్వులు ఉన్నట్టు తేలిందని చెబుతున్నాడు. కల్తీ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. మీ హయాంలోనే కల్తీ జరిగింది. వైయస్.జగన్ ఒక్కడే. మీదే కల్తీ ప్రభుత్వం, కల్తీ మనుషులూ మీరే. కేవలం బురద జల్లడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేయడం మిషన్ గా పెట్టుకున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు. అతి పెద్ద నటులున్న కుటుంబమే మీదే లోకేష్: వైయస్.జగన్ పెద్ద నటుడు అని లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుటుంబం కుటుంబం అంతా నటులున్న ఫ్యామిలీ మీది. మీ పార్టనర్స్ నటులే. వైయస్.జగన్ కి తెలియందే నటన. మీలా లోపల ఒకటి ఉంచుకని బయట ఇంకో విషయం మాట్లాడే మనిషి కాదు. మీరేం మాట్లాడినా దాన్ని చూపించే ఛానెళ్లు, రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరేం అబద్దాలు ప్రచారం చేసినా నడిచిపోతుంది. అసలు లడ్డూ వ్యవహారంపై విచారణ చేయాలని సుప్రీంకోర్టును కోరింది వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డే. ఆయన తప్పు చేసి ఉంటే నిగ్గు తేల్చమని సుప్రీంకోర్టుకు వెళ్తారా? పరమపవిత్రమైన భక్తి తత్వంతో ఉండే ఆయన మీద ఆరోపణలు చేసింది మీరు. అందుకే ఆయనే స్వయంగా విచారణ కోరారు. బాబు బంధువుల రూ.5 వేల కోట్ల భూకబ్జా: విశాఖపట్నంలో లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ పేరుతో గీతం అనే విద్యాసంస్థను నిర్వహిస్తూ... సుమారు 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గతంలో 2000 సంవత్సరంలో 71 ఎకరాలు రుషికొండలో చంద్రబాబు హయాంలో ఎకరం రూ.18వేలకు గీతం విద్యాసంస్థలకు కట్టబెట్టారు. వైయస్.జగన్ హయాంలో గీతం కబ్జాలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్లియర్ చేసి ప్రభుత్వ బోర్డులు పెట్టారు. దానిపై కోర్టుకెళ్లి స్టేటస్ కో తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ 54.79 ఎకరాల భూమని గీతం విద్యాసంస్థలకు ఇచ్చేస్తాం.. మీరు దానికి సంబంధించి విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ లో తీర్మానం పెట్టి ఆమోదించి పంపిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేస్తామని విద్యాశాఖ నుంచి కలెక్టర్ గారికి నోట్ పంపించారు. ఆ భూమి విలువ కేవలం రూ.5 వేల కోట్లు. గతంలో కొట్టేసిన 71, ఇప్పుడు 55 కలిపి దాదాపు రూ.10 నుంచి రూ.12వేల కోట్ల ఖరీదు చేసే 125 ఎకరాల ఆస్తిని తన కొడుకు తోడల్లుడికి రాసిచ్చి... బయటకు వస్తే చాలు తండ్రీ కొడుకులు, కూటమి నేతలు ప్రవచనాలు వల్లిస్తున్నారు. నిన్న జీవీఎంసీ కౌన్సిల్ లో ఇది అన్యాయం అంగీకరించేది లేదని కార్పొరేటర్లు వ్యతిరేకిస్తే వారిందరిపైనా దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి భూకబ్జాలతో ప్రశాంతమైన విశాఖను... అల్లకల్లోలం చేస్తున్నారు. ఇంత పెద్ద కబ్జా జరుగుతుంటే ఇంత పెద్ద కబ్జాను కాదనే ధైర్యం ఒక్క కూటమి నాయకుడికి లేదు. ఒకవైపు భూ దోపిడీ మరోవైపు అప్పనంగా అప్పగింత: అత్యంత విచిత్రం ఏమిటంటే.. బీచ్ రోడ్డుకి ఎడమవైపు గీతం యూనివర్సిటీ ఉంటే, కుడివైపున పర్యాటకశాఖ అతిధుల కోసం రూ.250 కోట్లు పెట్టిన భవనాలను జగన్ ప్యాలెస్ అని పిలుస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అతిధుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలవి. అవి వాడుకుంటే వైయస్.జగన్ గుర్తుకు వస్తాడు కాబట్టి ప్రైవేటు హోటల్‌కే రాసిస్తామంటున్నారు. ఇటువైపు రూ.5 వేల కోట్ల భూమి సొంత కుటుంబ సభ్యులకి, మరోవైపు ప్రైవేటు వ్యక్తులకు రాసిస్తారట. మరోవైపు అదే విశాఖలో ఎకరం కేవలం రూ.99 పైసలతో అప్పనంగా కట్టబెడుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు.