అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్‌

రాజధాని రైతులకూ అన్యాయమే, రాష్ట్రానికీ అన్యాయమే

తమ జేబులు నింపుకోవడంకోసం విపరీతంగా అంచనాలు పెంచి టెండర్లు ఖరారు చేశారు

కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టారు

దేశంలో ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదు

గతంలో రూ.2,700 కోట్లయ్యే సచివాలయానికి ఇప్పుడు రూ.4,700 కోట్లా!

అమరావతిలో ఆరోజు పనులకు రూ.44వేల కోట్ల అంచనాలు, ఇప్పుడు రూ.77వేల కోట్లా!

75శాతం అంచనాలు పెంపు ఎక్కడైనా జరిగిందా?

ప్రపంచంలో ఇలాంటి దోపిడీని ఎక్కడైనా విన్నామా? చూశామా?

ఇంత దారుణమైన దోపిడీని ఎన్నడైనా చూశామా

దోపిడీ కోసమే జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరిట ముందస్తు దోపిడీ

ఇతర ప్రాంతాల్లో వైయస్సార్‌సీపీ అభివృద్ధి పనులను పూర్తిగా గాలికొదిలేశారు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను గాలికొదిలేసి కమీషన్ల వేటలో పడ్డారు

ప్రజలను మళ్లీ కష్టాల్లోకి నెట్టారు

ప్రభుత్వ పెద్దలు మాత్రం జల్సాలు చేస్తున్నారు 

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టీకరణ

శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్స్‌ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.

శ్రీకాకుళం: అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిప‌డ్డారు. విచ్చలవిడిగా అవినీతి జ‌రుగుతుంద‌ని  ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పాలన గురించి యువకులు, విద్యావంతులు, మేథావులు తెలుసుకోవాలి. దానిపై మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అమరావతి అనేది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ తప్ప ఇంకేమీ లేదని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. రాజధాని పేరుతో ఒక్క అమరావతి మీదనే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేస్తే భావితరాలు ఆ అప్పును మోయాల్సి వస్తుందని వైయస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.  రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం అమరావతి కోసం ఖర్చు చేస్తే సమ్మళితమైన అభివృద్ధి దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు లెక్క చేయడం లేదు. శ్రీకాకుళంలో  వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్స్‌ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గురువారం మీడియాతో మాట్లాడారు.

 సీదిరి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:

మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు:
    16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు సెక్రటేరియట్‌లో ప్రజెంటేషన్‌ ఇచ్చిన సీఎం చంద్రబాబు, అమరావతి నిర్మాణానికి రూ.77,500 కోట్లు అవసరం అవుతాయని.. హడ్కో, వరల్డ్‌ బ్యాంక్, ఏఐబీ, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి ఇప్పటికే రూ.31 వేల కోట్లు అప్పుల రూపంలో సమీకరించామని, కాబట్టి మరో రూ.44 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
    గడిచిన ఐదేళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పులు తెచ్చుకోలేని స్థితిలో వెళ్లిన ఏపీని ఆదుకోవాలంటూ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఇలా ముఖ్యమంత్రిగా ఉండి అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి పదవికే అవమానం. చంద్రబాబు చెప్పేది నిజమైతే, ఆయన చెప్పినట్టు రూ. 12 లక్షల కోట్లు అప్పులు తెచ్చిందే నిజమైతే, బడ్జెట్‌ ప్రసంగంలో రాష్ట్ర అప్పులు రూ.5.3 లక్షల కోట్లేనని ఎలా చూపించారు?. ఇదేమాటను కేంద్రం పార్లమెంట్‌లోనూ చెప్పింది. కానీ చంద్రబాబు మాత్రం బయటకొచ్చి అప్పులపై ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నాడు.

అదే నిజమైతే..:
    ఒకవేళ రాష్ట్రం అప్పు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నమాట నిజమే అయితే 11 నెలల కాలంలోనే చంద్రబాబు రూ.1.47 లక్షల కోట్ల అప్పు ఎలా తేగలిగారు!. ఇది  రాష్ట్ర చరిత్రలో ఒక ఏడాదిలో చేసిన భారీ అప్పు. పైగా ఈ అప్పులన్నీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతమాత్రాన ఈ అప్పులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదా? ఇది ప్రజల మీద మోపుతున్న భారం కాదా? ఈ రాష్ట్రాన్ని ఎవరు శ్రీలంకగా మారుస్తున్నారో మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. 

75 శాతం అంచనాలు పెంచేశారు:
    వైయస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టారు. ఆయన చేసిన ప్రతి రూపాయికీ లెక్కుంది. ఒక్కో రూపాయిని పొదుపు చేసి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని మంచి స్థితిలోకి తెచ్చారు. కానీ చంద్రబాబు 11 నెలల్లోనే అమరావతి పేరుతో కమీషన్ల కోసం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. రూ.43 వేల కోట్లతో నాలుగైదేళ్ల  క్రితం పిలిచిన టెండర్లను ఇప్పుడు ఏకంగా 75 శాతం అంచనాలు పెంచేసి రూ.77,500 వేల కోట్లకు చేర్చాడు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందా?
     చంద్రబాబు తనకు నచ్చినట్టు కమీషన్లు పుచ్చుకునేందుకు వైయస్సార్సీపీ హయాంలో ఉన్న జ్యుడిషియల్‌  ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానాలను రద్దు చేసి తనకు నచ్చిన వారికి నామినేషన్‌ పద్ధతిలో వేల కోట్లకు టెండర్లు కట్టబెట్టాడు. ఇదంతా దోపిడీ కాక ఇంకేమిటి? సూపర్‌ సిక్స్‌ అమలు చేయాలని ఉంది కానీ, గళ్లా పెట్టె ఖాళీ ఉందని వేళాకోలం చేస్తున్నాడు. ఇంకోపక్క తనకు కమీషన్లు తెచ్చిపెట్టే అమరావతి కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు. ప్రజలకు అవసరమయ్యే మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయించడం లేదు. మెడికల్‌ కాలేజీలను, స్కూల్స్, పోర్టులు, హార్బర్లు, ఆరోగ్యశ్రీలను ప్రైవేటుపరం చేసి చంద్రబాబు నిర్వీర్యం చేశాడు. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయకుండా విద్యార్థులు, రైతులను మోసగించారు.

అప్పుల కోసం ఎందాకైనా!:
    అమరావతి కోసం చంద్రబాబు ఎందాకైనా వెళ్తారు. ఎక్కడి నుంచైనా అప్పులు తెస్తారు. అంచనాలు ఎంతకైనా పెంచేస్తారు. కానీ ప్రజా సమస్యలకు కేటాయించాల్సి వస్తే మాత్రం చంద్రబాబుకి మనసు రాదు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. రాజధాని ఎక్కడ పెట్టాలనే విషయంలో ముందే తన వారికి సమాచారం ఇచ్చి భూములు కొనిపించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కి పాల్పడ్డారు. తన భూములకు అనుగుణంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన కేసులు ఇప్పటికీ న్యాయస్థానాల్లో ఉన్నాయి.  

100 శాతం అంచనాలు పెంచేసి సచివాలయ నిర్మాణం:
    రూ.4,689 కోట్లతో సచివాలయ నిర్మానానికి చంద్రబాబు టెండర్లు పిలిచారు. ఇదే సచివాలయానికి 2019కి ముందు టెండర్లు పిలిచినప్పుడు దాని విలువ రూ.2,271 కోట్లు మాత్రమే. ఆ సమయంలో ఎర్త్‌ వర్క్, పిల్లర్ల పనులు పూర్తి కూడా చేశారు. ఇప్పుడు వాటికే రీటెండర్లు పిలిచి అంచనాలను 100 శాతం పెంపుతో ఏకంగా రూ.4,689 కోట్లకు పెంచారు. జాతీయ రహదారులను కూడా కిలోమీటరు రూ.20 కోట్లతో పూర్తి చేస్తుంటే, అమరావతిలో అందుకోసం రూ.50 కోట్ల నుంచి నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నారు. హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాల కోసం రూ.1,650 కోట్లతో టెండర్లు పిలిచారు. గతంలోనే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను నిర్మించారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆరోజుల్లోనే రూ.11 వేలు ఖర్చు చేశారు. ఇవన్నీ దుబారా చేయడం కాదా?.
    రూ.770 కోట్లతో పార్లమెంట్‌ నిర్మాణం కడితే అంతే ఖర్చుతో ఏపీ అసెంబ్లీ కడుతున్నారు. సుప్రీంకోర్టు కన్నా పెద్దగా ఏపీ హైకోర్టు కడతారట!. 

44 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ దేనికి? :
    వైయస్సార్సీపీ హయాంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త రన్‌వే, కొత్త టెర్మినల్‌ అభివృద్ధి చేసి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గా నవీకరిస్తే, ఇప్పుడు తాను కట్టుకునే ఇంటి పక్కనే విమానాల్లో దిగాలని అమరావతిలో 5 వేల ఎకరాల్లో చంద్రబాబు మరో ఎయిర్‌పోర్ట్‌ కడతా అంటున్నాడు. ఇదే చంద్రబాబు బస్టాండ్‌ కోసం నిధులు అడిగితే గళ్లా పెట్టె ఖాళీ అంటున్నాడు. రైతుల నుంచి తీసుకున్న భూములనే డెవలప్‌ చేయకుండా వదిలేసి ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాలని పనిగా పెట్టుకున్నాడు.
    చంద్రబాబు తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలను ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ 5 సమర్థించేలా వార్తలు రాస్తుంటే మేథావులు మాట్లాడకపోవడం ఆందోళనగా ఉంది. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావులా మేథావులు బయటకొచ్చి చంద్రబాబుని ప్రశ్నించాలి. ఇచ్చిన వాగ్ధానాలను బాధ్యతగా నెరవేరుస్తాడని చంద్రబాబుకి ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాక తీవ్రంగా వంచించాడు. తాను, తన కొడుకు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల సొమ్ముతో విలాసాలు పొందుతున్నారు. ఒక్క పథకం అమలు చేయకుండానే రూ.1.47 లక్షల కోట్లు అప్పులు చేశారు. 

అమరావతికి ముంపు ప్రమాదం ఉన్నా..:
    అప్పిచే ముందే అమరావతి ముంపునకు గురయ్యే ప్రాంతమని ప్రపంచ బ్యాంకు, ఐఐటీ చెన్నై చెప్పాయి. ఇక్కడ రాజధాని కట్టాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాయి. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ముంపు నివారణ కోసం రూ.1,400 కోట్లతో నాలుగు చోట్ల లిఫ్టు ఇరిగేషన్‌ స్కీమ్‌లు, 6 రిజర్వాయర్లు కడతామంటున్నారు. ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్టు కోసం నిధులు అడిగితే గళ్లా పెట్టె ఖాళీ అంటున్నారు. మరీ దారుణంగా విశాఖలో టీసీఎస్‌కి రూ. 100 కోట్ల విలువైన ఎకరా భూమిని 99 పైసలకు కేటాయించారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 21 ఎకరాలు అప్పనంగా రాసిచ్చారు. ఇంతదారుణం ఏదైనా ఉంటుందా? 

మత్స్యకార భరోసా నిబంధనలు దారుణం:
    ఏ రేషన్‌ కార్డులో అయినా పింఛన్‌ వస్తున్నా, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా పథకం వస్తున్నా, మత్స్యకార భరోసా ఇవ్వబోమని ప్రభుత్వం దౌర్భాగ్యం. వేటకెళ్లే మత్స్యకారుడు తమ పిల్లలను చదివించకూడదా? ఒక కుటుంబానికి ఒకే పథకం అనేలా ప్రభుత్వం నిబంధన ఉంది. ఈ ప్రభుత్వ విధానం చాలా తప్పు. దీన్ని సవరించుకోవాలి. మా హయాంలో లక్షా 20 వేల మందికి మత్స్యకార భరోసా ఇచ్చాం. మత్స్యకారులకు అన్యాయం జరిగితే పోరాటం చేయడానికి వైయస్సార్సీపీ సిద్ధంగా ఉంది. 

అచ్చెన్న కుటుంబం శ్రీకాకుళం జిల్లాను నాశనం చేసింది:
    తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో అట్టడుగున ఉందని చంద్రబాబు చెబుతున్నారు. దీనికి మూడు దశాబ్దాలుగా జిల్లాను తమ చేతుల్లో ఉంచుకుని రాజకీయం చేసిన అచ్చెన్నాయుడు కుటుంబం సమాధానం చెప్పాలి. ప్రజల నుంచి ఓటేయించుకుని కీలక పదవులు అనుభవించారే కానీ, జిల్లాను అభివృద్ధి చేయడంలో దృష్టి పెట్టలేదని స్పష్టం అవుతుంది. 
    ఎయిర్‌పోర్టు వల్ల జిల్లా అభివృద్ధి చెందుతుందో లేదా అభివృద్ధి చెందిన ప్రాంతానికి ఎయిర్‌పోర్టు అవసరమో తెలుసుకునే కనీసం జ్ఞానం కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి లేదు. విశాఖ నుంచి విమానాలు ఎగరడం లేదని పేపర్లలో పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తుంటే శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు కట్టి ఏం ఉద్ధరిస్తారో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చురకలంటించారు.

పెట్రో కెమికల్‌ అండ్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌పై నిర్లక్ష్యం:
    వైయస్సార్‌ హయాంలో కీలకమైన ప్రాజెక్టులన్నీ శ్రీకాకుళం జిల్లాలో అమలయ్యాయి. ఆ తర్వాత వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక జిల్లాని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. మూలపేట పోర్టును ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం మూలన పడేసింది. అచ్చెన్న కుటుంబానికి ఏ ప్రాజెక్టును ఎలా మొదలుపెట్టాలో కూడా కనీస పరిజ్ఞానం ఉండదు. ఉద్దానం ప్రాంతంలో పచ్చగా పంటలతో కళకళలాడుతున్న ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌ కడతామని చెప్పడం వారి అవగాహనరాహిత్యానికి నిదర్శనం. ప్రజల నుంచి కాదు కదా సొంత పార్టీ ఎమ్మెల్యే అభిప్రాయం కూడా తీసుకోవడం లేదు.
    మా హయాంలో పెట్రో కెమికల్‌ అండ్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ కోసం అనుమతులు తీసుకొచ్చి పోర్టుకి అనుసంధానంగా 9 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ సిద్ధం చేసి ఉంచాం. దీనిద్వారా 40 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నాం. కానీ అచ్చెన్న కుటుంబం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు.

Back to Top